వ్యవసాయంపై మళ్లీ దొరికిపోయిన చంద్రబాబు 

అసెంబ్లీ సాక్షిగా ఏమీ చేయలేదని ఒప్పుకున్నారు

మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజం

కాకినాడలోని తన క్యాంపు ఆఫీసులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు

రైతులకు ఏం చేస్తున్నారో చెప్పుకోలేని దుస్దితి

అసెంబ్లీ సాక్షిగా తేలిపోయిన చంద్రబాబు 

కౌలు రైతులపైనా బయటపడ్డ అక్కసు 

కౌలు రైతులే సమస్య అని ఎలా చెప్తారు ?

రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు పట్టవా?

వరి రైతుల ఊసెత్తని చంద్రబాబు

వ్యవసాయ, మార్కెటింగ్ విధానాలూ కరవు

ఇప్పటికైనా బాబు వైఫల్యాల్ని ఒప్పుకోవాలి

మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్

కాకినాడ:     వ్యవసాయం మీద ఇవాళ అసెంబ్లీలో ప్రసంగం చేసి సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, అందులో వ్యవసాయ విధానాలపై కానీ, మార్కెటింగ్ పై కానీ, రైతుల సంక్షేమం పై కానీ ప్రస్తావన లేకపోవడమే ఇందుకు నిదర్శనమని వ్యవసాయశాఖ మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రైతులకు ఏం చేశారో చెప్పుకోలేక, కోకో సిటీ, అరకు కాఫీ అంటూ వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. రైతులు ఎక్కువ కౌలు చేసేస్తున్నారని చంద్రబాబు చెప్పడం ఆయన అవగాహన లేమికి నిదర్శమని కన్నబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులకు ఏమీ చేయలేకపోయినట్లు చంద్రబాబు ఇవాళ ఒప్పుకున్నారని కన్నబాబు తెలిపారు. 
ప్రెస్ మీట్ లో కన్నబాబు ఇంకేమన్నారంటే..

కౌలు రైతులపై చంద్రబాబు అక్కసు
    
    ఇవాళ వ్యవసాయం మీద చంద్రబాబు మాట్లాడుతూ.. ఏలూరులో కోకో సిటీ తెస్తున్నాం, అరకులో కాఫీ పెంచుతున్నాం, అమెరికా సుంకాల్లో ఆక్వాకల్చర్ కు మేలు జరుగుతుందని చాలా విషయాలు చెప్పారు. కౌలు రైతుల సమస్య ఉంది, ఒక్కొక్కరూ 30-40 ఎకరాలు కౌలు చేసేస్తున్నారు, ఈ సమస్యకు పరిష్కారం ఆలోచిస్తున్నామని చంద్రబాబు చెప్తున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కౌలు రైతుల గురించి ఎంత అవగాహనలేమితో మాట్లాడారో దీన్ని బట్టి అర్దమవుతోంది. తాను కూలీ అనిపించుకోకుండా రైతు అనిపించుకుందామనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, వెనుకబడిన కష్టజీవులు కౌలు చేస్తారు. భూస్వాములు తమ భూములు కౌలు కిచ్చి అమెరికాలోనో, బెంగళూరులో ఉండి ఎంజాయ్ చేస్తారు. కానీ ముఖ్యమంత్రి కౌలు రైతులే సమస్య అని మాట్లాడటం దారుణం.

రైతు సమస్యలపై దొరికిపోయిన చంద్రబాబు

ఈ రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం ఏమీ చేయలేదని చంద్రబాబు ఇవాళ ఒప్పుకున్నట్లయింది. ఒక మార్కెటింగ్ గురించి కానీ, రైతు సంక్షేమం గురించి కానీ, ఓ సౌకర్యం కల్పించామని గానీ చెప్పలేకపోయారు. గతేడాది చంద్రబాబు ప్రభుత్వం వేసిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 393 మంది రైతులు, 2472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే ఏ స్థాయికి వ్యవసాయం దిగజారిందో అర్దం చేసుకోవచ్చు. ఇంత దుర్మార్గంగా వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేసి కోకూ సిటీ తెస్తా, వాణిజ్య పంటలే పండించండని చంద్రబాబు చెప్తున్నాడు. చంద్రబాబు తన ప్రసంగంలో ఒక్క ముక్క వరి రైతుల గురించి మాట్లాడలేదు. తన వ్యవసాయ విధానం ఇదీ, మార్కెటింగ్ విధానం ఇదీ అని చెప్పుకోలేకపోయారు. రైతు ఆత్మహత్యలు ఆపడానికి మా పాలసీ ఇది అని చెప్పలేకపోయారు. ఇది మీ వైఫల్యమా కాదా చంద్రబాబు సూటిగా చెప్పాలి. 

సమస్యలు వదిలేసి ఎమ్మెల్యేల ఆటలా?

రాష్ట్రంలో రైతు సమస్యలపై మేం ప్రశ్నిస్తుంటే లడ్డూ కల్తీ అని అన్నింటికీ ఒకే సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రతీదీ కల్తీ అన్నట్లుగా మారిపోయింది. వ్యవస్థల మీద మీకు పట్టులేకుండా పోయింది. వైఎస్సార్సీపీ నేతల మీద ఎక్కువ బూతులు తిడితే ఎమ్మెల్యేలు, మంత్రులకు అదే పనితీరు అని మీరు మార్కులేయడం మొదలుపెట్టారో, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ లోకేష్ గుడ్ లుక్స్ లో ఉంటే చాలనే పరిస్ధితి తెచ్చారు. మంత్రులు శాఖలన్నీ గాలికొదిలేసి, అధికారులు పాలన మనకు ఎందుకులే అని వదిలేసి ఈ పరిస్ధితి తీసుకొచ్చారు. చంద్రబాబు కుటుంబ సభ్యురాలైన రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి.. పాలు కల్తీ జరిగాయని ప్రశ్నిస్తే.. బాధితుల్ని పరామర్శిస్తాం అని చెప్పకుండా ప్రభుత్వం సకాలంలో స్పందించిందని చెప్పుకుంటున్నారు. బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వడమే సకాలంలో స్పందనా ? చావుల దగ్గర కూడా మిమ్మల్ని మీరు పొగుడుకుంటూ బతుకుతున్నారు. పాలు కల్తీ జరిగి జనం చనిపోవడం ఎక్కడైనా విన్నారా ? ఇవాళ నీళ్లు, పాలు కల్తీ జరిగి జనం చనిపోతుంటే మీకు మీరు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. పాలు కల్తీ జరిగి జనం చనిపోతుంటే, శ్రీకాకుళంలో నీళ్లు కల్తీ జరిగి జనం చనిపోతుంటే మీ ఎమ్మెల్యేలు క్రికెట్ ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ దెబ్బలు తగిలించుకున్నారని సర్దిచెప్పుకుంటున్నారు. ఈ సంవత్సరం ఆటలు, గత సంవత్సరం నాటకాలు వేశారు. 

చంద్రబాబుకు అప్పుడే మొదలైన అనుమానాలు 

సుదీర్ధమైన ఏపీ చరిత్రలో మతం, కులం గురించి చర్చలు జరిగాయా ? ప్రభుత్వానికి చేసింది చెప్పుకోలేక ఇలాంటి చర్చలు తెరపైకి తెస్తున్నారు. చంద్రబాబు.. తమ్ముళ్లూ నేను ఎప్పుడైనా, ఎవరిని అయినా మోసం చేశానా అని అడిగితే లేదని ఒక్కరూ సమాధానం చెప్పలేదు. సభికులంతా మౌనంగా ఉన్నారు. మీరు అంత డైరెక్ట్ గా అడిగితే ఎవరైనా ఏం సమాధానం చెప్తారు ? మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో జనం పండుగ చేసుకుంటున్నారని అనుకుంటున్నారు, కానీ ఇందులో ఏ ఒక్క హామీ నెరవేరిందని మీరు ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటారు. ఆడబిడ్డలకు స్త్రీశక్తి పథకం ద్వారా బస్సు ఇస్తే ఆడబిడ్డలు సభకు ఎందుకు తక్కువగా వచ్చారన్న చంద్రబాబు ప్రశ్నలోనే సమాధానం ఉంది. మీకు ఇంత పెన్షన్ ఇస్తున్నా.. మళ్లీ ఓటేస్తారా అని అడుగుతున్నారంటే.. అప్పుడే ఆయనకు అంత అనుమానం ఎందుకొచ్చిందని కన్నబాబు ప్రశ్నించారు.

Back to Top