పాలు–నీళ్లు కూడా ప్రాణాంతకమా? 

కూట‌మి ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంపై వైయ‌స్ జ‌గ‌న్ ఆగ్ర‌హం 

తాడేప‌ల్లి: రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న డయేరియా, కల్తీ పాలు ఘటనలపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.  ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, “ప్రజలు బ్రతకడానికి తాగే పాలు, నీళ్లు కూడా సురక్షితం కాకపోవడం దారుణం. కలుషిత నీరు, కల్తీ పాలు కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకం” అని పేర్కొన్నారు.

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..
ఎవరైనా బ్రతకడం కోసం పాలు, నీళ్లు తాగుతారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ రెండూ ప్రాణాంతకం అవుతున్నాయి. పలు చోట్ల కల్తీ పాలు, కలుషిత నీరు తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యవసరమైన ఆ రెండింటి పేరు వింటేనే ఉలిక్కిపడే పరిస్థితి రాష్ట్రంలో ఉత్పన్నమైంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబునాయుడు పాలనలో డయేరియా, ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు తరుచూ వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థకు ఆ ఘటనలు అద్దం పడుతున్నాయి. పరిపాలనపై చంద్రబాబు పూర్తిగా తన పట్టు కోల్పోగా, మిగిలిన వారంతా ప్రతిపక్షంపై బురద చల్లడం, నిత్యం అసత్య ప్రచారం చేయడంతో పాటు, రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎక్కడికక్కడ స్వార్థ ప్రయోజనాలు ఆశించి పని చేస్తూ.. ప్రజారోగ్యం, వారి రక్షణ వంటి వాటికి పూర్తిగా మంగళం పాడుతున్నారు.

కురుపాం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 16 మంది విద్యార్థినులు డయేరియాతో అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. ఇదే పాఠశాలలో గతంలో కలుషిత నీటి కారణంగా పచ్చకామెర్లతో ఇద్దరు బాలికలు మృతి చెందగా, దాదాపు 100 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. అంత దారుణంగా ఘటనలు చోటు చేసుకున్నా, సమస్య శాశ్వత పరిష్కార దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడు ఆ విధంగా వ్యవస్థ దారుణంగా విఫలం కాగా, మళ్లీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉత్పన్నమైంది.

టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, గత 14 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లు, విద్యాసంస్థల్లో ఫుడ్‌ పాయిజన్, కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్రత వల్ల వ్యాధుల వంటి ఘటనలు దాదాపు 25 చోటు చేసుకున్నాయి. వాటి వల్ల 15 జిల్లాల్లో 900 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇదే విషయాన్ని జాతీయ మీడియా సైతం ప్రముఖంగా ప్రచురించింది. పూర్తిగా కొరవడిన పరిశుభ్రత, కలుషిత నీరు, ఆహారం, హాస్టళ్లలో దారుణ పరిస్థితులను జాతీయ మీడియా కూడా ఎండగట్టింది.

రాష్ట్రంలో గడచిన 18 నెలల్లో చేబ్రోలు, విజయవాడ, గుంటూరు, గుర్ల, శ్రీకాకుళం, తురకపాలెం ప్రాంతాల్లో పెద్దఎత్తున డయేరియా ప్రబలింది. ఫలితంగా వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. డజన్ల కొద్దీ మరణాలు సంభవించాయి. ముఖ్యంగా కలుషిత నీరు, అపరిశుభ్రత అందుకు ప్రధాన కారణాలు. అయితే ఇదేమీ ఆషామాషీ వ్యవహారం, లెక్కలు కావు. ప్రభుత్వ నిర్లక్ష్యం, హాస్టళ్లపై పూర్తిగా కొరవడిన పర్యవేక్షణ, వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టవలసిన చర్యల్లో వైఫల్యానికి అద్దం పడుతున్నాయి.

గత వారం పరిస్థితి మరింత దారుణంగా మారింది. శ్రీకాకుళంలో కలుషిత నీటి కారణంగా తీవ్ర డయేరియా వ్యాప్తి చెందింది. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 200 మంది ఆస్పత్రుల పాలయ్యారు. అతిసారం, ఇన్ఫెక్షన్లతో పలు కుటుంబాలు తల్లడిల్లాయి. ఎప్పటికప్పుడు నీటి నాణ్యత పరీక్ష, సురక్షిత నీటి సరఫరా కోసం తగిన మౌలిక వసతుల కల్పన, నిర్వహణ, ఇలాంటి దురదృష్టకర ఘటనలు చోటు చేసుకున్నప్పుడు వేగంగా స్పందించి, నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో.. వైఫల్యాన్ని స్పష్టంగా చూపాయి.

అదే వారం రాజమహేంద్రవరం నగరంలో కల్తీ పాల కారణంగా మరో విషాదం చోటుచేసుకుంది. ఏకంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది ప్రాణాపాయ స్థితిలో వివిధ ఆస్పత్రుల్లో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు. ఇంకా మరెందరో అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యారు. పోషణ ఇవ్వాల్సిన పాలు చివరకు మరణానికి కారణమయ్యాయి. ఇది ఏదో ఒక చిన్నపాటి లోపం కాదు. ఆహార భద్రత పర్యవేక్షణలో నిర్లక్ష్యం, దానికి సంబంధించిన యంత్రాంగాల వైఫల్యాన్ని స్పష్టంగా చూపుతోంది.

ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర లేచి నిజాయితీగా పరిస్థితిని సమీక్షించాలి. ఎక్కడెక్కడ లోపాలున్నాయో గుర్తించాలి. వాటన్నింటినీ సరి చేయాలి. వాటి ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్న ఆలోచన వీడాలి. సురక్షిత నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ఆహార భద్రత పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. పరిశుభ్రత ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలి. వీటన్నింటిపై చిత్తశుద్ధితో పని చేయాలి. ప్రభుత్వం నుంచి ప్రజలు ఏవో అద్భుతాలు కోరుకోవడం లేదు. ఇంకా మరిన్ని ప్రాణాలు పోకముందే ప్రభుత్వం మేల్కొని, తగిన చర్యలు చేపట్టాలని మాత్రమే ప్రజలంతా ఆశిస్తున్నారు. 

Back to Top