రాజమండ్రి కల్తీ పాల ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలి

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి మార్గాని భ‌ర‌త్ డిమాండ్‌
 

తూర్పుగోదావరి జిల్లా: రాజమ‌హేంద్ర‌వ‌రంలో కల్తీ పాల ఘటనపై పూర్తి స్థాయిలో విచార‌ణ జ‌ర‌పాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి మార్గాని భ‌ర‌త్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారి సంఖ్య 11కు పెరిగింద‌ని,  బాధితుల కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయ‌ని చెప్పారు. బాధితుల‌ను మార్గాని భ‌ర‌త్ శ‌నివారం ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. పాల నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు పంపించినప్పటికీ ఇప్పటివరకు నివేదికలు రాకపోవడం గందరగోళానికి దారితీసింది. తమవారికి ఏ విధమైన చికిత్స అందిస్తున్నారో స్పష్టంగా తెలియకపోవడంతో బాధితులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇథిలిన్ గ్లైకాల్ కలిసిందన్న వార్తలు వినిపిస్తున్నప్పటికీ దీనిపై అధికారికంగా స్పష్టత రాలేదు. అయితే, స్పష్టమైన ల్యాబ్ రిపోర్ట్ లేకుండానే ఇథిలిన్ గ్లైకాల్‌కు యాంటీడోట్ తెప్పించారన్న వార్తలు మరింత అనుమానాలకు తావిస్తున్నాయి.
ల్యాబ్ నివేదికలు వచ్చినా ప్రభుత్వం దాచిపెడుతోందని మండిప‌డ్డారు.  చికిత్స పొందుతున్న వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన పట్టుబట్టారు. ప్రజల్లో భయం, అనిశ్చితి తొలగించాలంటే నిజాలు వెల్లడించాలని కోరారు.
 

Back to Top