తాడేపల్లి: తప్పు చేసిన బీఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని భక్తుల నుంచి డిమాండ్లు వస్తుంటే ఆయన మాత్రం ప్రెస్‌మీట్ పెట్టి అదిరేది లేదు.. బెదిరేది లేదని చెప్పడం చూస్తుంటే కామంతో కళ్లు మూసుకుని పోయిన వాడికి ఏదీ కనిపించదని ఇలాంటివి చూసినప్పుడే అంటారని ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీఅధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ నాయుడుకు సంబంధించిన అశ్లీల వీడియోలు బయటపడినప్పుడే వాటికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందిపోయి 30 ఏళ్లుగా బంధం కొనసాగుతోందని చెప్పడం, చంద్రబాబు రాజీనామా చేయమంటేనే చేస్తానని చెప్పడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. దేవదేవుడైన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడికి ఒకరోజు సేవ చేసుకునే భాగ్యం కలిగినా చాలు నా జన్మ తరించిపోయిందని ప్రతి హిందువూ భావిస్తారు. అలాంటిది ప్రపంచ వ్యాప్తంగా ఉండే కోట్లాది మంది భక్తులు కొలిచే శ్రీవారి ఆలయానికి చైర్మన్ స్థానంలో ఉన్నప్పుడు ఎవరైనా అత్యంత నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో వ్యవహరించాలి. కానీ అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా నా ఇష్టమొచ్చినట్టు ఉంటా, దీనివల్ల సమాజానికి ఏం నష్టం జరిగిందని బీఆర్ నాయుడు బరితెగించి మాట్లాడటం అత్యంత హేయమని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ వీడియోలు వెలుగులోకి వచ్చిన మరుక్షణమే బీఆర్ నాయుడుతో రాజీనామా చేయించకుండా డీప్ ఫేక్ వీడియోలంటూ పోలీసులకు ఫిర్యాదు చేయించడం చూసి చంద్రబాబుని కూడా శ్రీవారి భక్తులు చీదరించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరితో సంబంధాలు పెట్టుకుంటావో, ఎంతమందితో తిరుగుతావో, ఎంతకాలం ఉంటావో తన వ్యక్తిగత విషయమే అయినా, అత్యంత పవిత్రమైన శ్రీవారికి ఆలయ చైర్మన్ గా ఉండి కూడా నా ఇష్టం అని మాట్లాడాడంటే ఆయనకు పదవి పోయే కాలం దగ్గరపడిందని అనుకోవాలని మాజీ మంత్రి పేర్ని నాని చురకలంటించారు.