ఎన్టీఆర్ జిల్లా: తిరువూరులో నిర్వహించే నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణం కార్యక్రమం ప్రతి ఏడాది ఎంతో ఘనంగా, భక్తిశ్రద్ధలతో జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. అలాంటి పవిత్ర కార్యక్రమాన్ని ఎంపీ కేసినేని చిన్ని చెడగొట్టారని విమర్శించారు. తిరువూరు నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణాన్ని చెడగొట్టిన కేసినేని నాని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో దేవినేని అవినాష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసినేని చిన్ని లాంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉండటం మన దౌర్భాగ్యమని ఆయన అన్నారు. గతంలో ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఎంపీలుగా సేవలందించారని, అయితే ప్రస్తుతం అవినీతి, అక్రమాలు, పంచాయితీలు, గూండాగిరి వంటి పనులు చేస్తున్న వ్యక్తి ఎంపీగా ఉండటం దురదృష్టకరమని విమర్శించారు. ఎంపీకి ఉండాల్సిన హుందాతనం చిన్నికి లేదని, వేణుగోపాల స్వామి కళ్యాణం గొప్పతనాన్ని బ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. జిల్లా పరువు పోయేలా ఎంపీ వ్యవహరించారని, ఎస్సీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో అతనిపై రుబాబు చూపించడం తగదని అన్నారు. ఎమ్మెల్యేకు అధికారులను సహకరించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్పుకునే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనఖ కళ్యాణ్‌లు ఈ అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో దసరా మహోత్సవాల సమయంలో కూడా విజయవాడ ఉత్సవాల పేరుతో ఎంపీ అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు. అమ్మవారి ఉత్సవాలను చెడగొట్టే విధంగా నీచమైన కార్యక్రమాలు నిర్వహించారని విమర్శించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పాలనలో ఇలాంటి ఘటనలు జరగలేదని, అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన తప్పుడు పనులను నిలదీస్తే అసత్య ప్రచారాలు చేయడం కూటమి నేతలకు అలవాటైందని అన్నారు. టీటీడీ లడ్డూ విషయంలో ప్రభుత్వం పరువు మొత్తం పోయిందని విమర్శించారు. దేవుడి ఆశీస్సులు నిజాయితీగా పనిచేసేవారిపైనే ఉంటాయని, వాస్తవం ఏమిటో ప్రజలకు తెలిసిపోయిందన్నారు. తిరువూరులో ఎంపీ కారణంగా అభివృద్ధి పనులు జరగక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. నారా లోకేష్ తన వెనుక ఉన్నాడనే ధైర్యంతో చిన్ని దురుసుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా తిరువూరు ప్రజలందరికీ ఎంపీ బహిరంగ క్షమాపణ చెప్పాలని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు.