నగరి: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అశ్లీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయారని, అలాంటి వ్యక్తిని తక్షణం టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. ఈ వీడియోలతో హిందూ సమాజం నిర్ఘాంతపోయిందని, సామాజిక మాధ్యమాల్లో శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆమె వెల్లడించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మౌనం పాటించడం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించారు. శ్రీవారికి సేవ చేసే అవకాశం లభిస్తే అదృష్టంగా భావించాల్సింది పోయి, టీటీడీలో రాజకీయాలు చేస్తున్నారని, వైయస్ జగన్‌పై కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీటీడీ గౌరవం, ఆలయ పవిత్రతను కాపాడాలంటే బీఆర్ నాయుడిని వెంటనే పదవి నుంచి తప్పించాలని నగరిలోని క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన ఆర్‌కె రోజా స్పష్టం చేశారు. ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి ఆర్‌కె రోజా ఇంకా ఏం మాట్లాడారంటే..: గతి తప్పిన టీటీడీ ఛైర్మన్ వ్యవహారశైలి: ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు హాట్ టాపిక్ బీఆర్ నాయుడు, ఆయన వీడియోలు. ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్న వారిని నేను ఒక్కటే అడుగుతున్నాను. దేశంలో ఏ ఆలయానికి సంబంధించిన చైర్మన్ వీడియోలు ఇలా బయటపడిన సందర్భాలు ఉన్నాయా? టీటీడీ చైర్మన్ వీడియోలు బయటకు వస్తే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది?. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు ఎప్పటికీ ఆ హుందాతనాన్ని చూపలేదు. ఆయన ఇప్పటికీ ఒక ఛానల్ సీఈవోలాగా ప్రవర్తిస్తున్నారు. టీటీడీ చైర్మన్ అంటే రాజకీయాలకు దూరంగా ఉండాలి. కానీ ఆయన ప్రెస్‌మీట్లు చూస్తే బీఆర్ నాయుడి వ్యవహార శైలి ఏంటో అర్థమవుతుంది. టీటీడీ పవిత్రతను దెబ్బ తీసిన బీఆర్ నాయుడు: గతంలో ఎంతో మంది టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్నారు. కానీ, ఎప్పుడూ ఇలాంటి అపశృతులు జరగలేదు. కానీ ఇప్పుడు టీటీడీ గోశాలలో గోవుల అకాల మరణాలు, తొక్కిసలాటలో భక్తుల ప్రాణాలు పోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తిరుమల కొండ పేరు ప్రతిష్టలకు బీఆర్ నాయుడు భంగం కలిగించారు. భగవద్గీత హిందువుల పవిత్ర గ్రంథం. ప్రతిరోజూ ఒక పేజీ అయినా చదివి ఉన్నత విలువలతో జీవించాలని భావిస్తారు. కానీ బీఆర్ నాయుడుకు భగవద్గీతపై ఎలాంటి భక్తి లేదు. భగవద్గీతపై చులకనగా మాట్లాడే వ్యక్తికి టీటీడీ చైర్మన్‌గా ఉండే అర్హత ఉందా?. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయ్యాక కొండపై మాంసం తిన్న ఘటనలు, మద్యం బాటిళ్ల లభ్యం, వైకుంఠ ఏకాదశి రోజున కూడా అపశృతులు చోటుచేసుకున్నాయి. టోకెన్లు ఇవ్వకపోవడం ఆయన చేతకానితనం. తిరుమల ప్రతిష్ట పెంచే ఒక్క పని అయినా బీఆర్ నాయుడు చేశారా?. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లడ్డూపై ఇష్టానుసారంగా మాట్లాడితే చైర్మన్‌గా ఒక్క మాటైనా మాట్లాడారా? హెరిటేజ్ తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు నిత్యం భజన చేస్తున్నారు. ఇందులేఖ లెటర్లపై విచారణ జరగాలి: బీఆర్ నాయుడిపై ఏఐ వీడియోలు చేయాల్సిన అవసరం వైయస్ఆర్‌సీపీకి లేదు. ఆయనే మీడియా సమావేశంలో ఆ వీడియోలో తప్పు ఏముంది అని మాట్లాడారు. ఆమె కుటుంబంతో 30 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. ఆ వీడియోలు బయటకు ఎలా వచ్చాయో విచారణ జరగాలి. ఇందులేఖ 2024 ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్‌కు లేఖలు రాశారు. ఆ లేఖపై పూర్తి స్థాయి విచారణ జరపాలి. చంద్రబాబు గుట్టు బీఆర్ నాయుడు చేతిలో ఉందా? అందుకే ఆయనపై చర్యలు తీసుకోవడం లేదా?. అశ్లీల వీడియోలపై ఇంతవరకు చంద్రబాబు, పవన్ స్పందించకపోవడం బాధాకరం. పవన్ నిజంగా హిందువు అయితే బీఆర్ నాయుడిని ఎందుకు కొనసాగిస్తున్నారో సమాధానం చెప్పాలి. ఏకసభ్య కమిషన్ ఎందుకు?: దేవుడిని రాజకీయాల్లోకి లాగవద్దని సుప్రీంకోర్టు ఆదేశించినా వినకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఆరోపణలు చేశారు. సీబీఐ, సిట్ దర్యాప్తులో లడ్డూలో జంతు కొవ్వు కల్తీ కాలేదని తేలినా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం సిగ్గుచేటు. ఎలాగోలా ఈ వ్యవహారంలో వైయస్ఆర్‌సీపీ వారిని ఇరికించేందుకే చంద్రబాబు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. వీటన్నింటి నేపథ్యంలో ప్రతిష్టాత్మకమైన టీటీడీ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని, బీఆర్ నాయుడిని వెంటనే ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని ఆర్‌కె రోజా స్పష్టం చేశారు.