కూటమి పాల‌న‌లో పెరిగిన స్టేట్ స్పాన్సర్డ్ క్రైమ్  

మాజీ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌

ఎన్టీఆర్ జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రెండు కొత్త సంస్కృతులు తెచ్చారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఫాల్స్ కేసులు నమోదు చేయడం, స్టేట్ స్పాన్సర్డ్ క్రైమ్‌ను ప్రోత్సహించడం పెరిగిపోయిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నేరాలను స్పాన్సర్ చేస్తున్నట్లుగా పరిస్థితి మారిందన్నారు. మంగ‌ళ‌వారం ఇబ్ర‌హీంప‌ట్నంలో మాజీ మంత్రి జోగి ర‌మేష్‌ను బుగ్గ‌న ప‌రామ‌ర్శించారు. జోగి ర‌మేష్‌ ఇంటిపై జరిగిన దాడి వీడియోలు చూస్తే వాస్తవం అర్థమవుతుందని, దాడి చేస్తున్న వారికి పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చినట్లుగా కనిపించిందని బుగ్గ‌న వ్యాఖ్యానించారు. పెట్రోల్, యాసిడ్ బాంబులతో దాడులు జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉండిపోయారని మండిప‌డ్డారు.

అధికార పార్టీ తరపున కొందరు మహిళలు కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ దాడులకు పాల్పడటం కొత్త సంస్కృతి అని విమర్శించారు. దాడులను మహిళలు ముందుండి నడిపించడం అనేది వెనుక నుంచి కోచింగ్ ఇచ్చినప్పుడే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. నిజంగా తప్పు జరిగితే కోర్టులు ఉన్నాయని, రాజకీయ పార్టీలకు హింసాత్మక పద్ధతులు నేర్పించడం సరికాదని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని సూచించారు. కేసు లేకపోయినా కేసులు సృష్టించడం, ఆధారాలు తయారు చేయడం వంటి సంస్కృతి ఆగిపోవాలని డిమాండ్ చేశారు. దాడులు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు.  అంబ‌టి రాంబాబు తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసినప్పటికీ, ఆయనపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపారని ఆరోపించారు. దాడులు చేసిన వారిని వదిలేసి బాధితులపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ అనుభవాన్ని మంచి పనులకు ఉపయోగించాలని, తప్పుడు కేసులకు ఉపయోగించకూడదని సూచించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఎవరూ ఏమీ చూడటం లేదని ప్రభుత్వం భావించడం పొరపాటన్నారు.

బడ్జెట్ అంతా అబ‌ద్ధాలే
కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బడ్జెట్ మొత్తం అబద్ధాలతో నిండి ఉందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ఆదాయం, వ్యయం వివరాల్లో ప్రభుత్వం నిజాలు దాచుతోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఊరూరా తిరిగి రూ.15 వేలు, రూ.18 వేలు ఇస్తామని చెప్పారని, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి, రైతులకు అదనపు ఆర్థిక సహాయం వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే పథకాలు కాకుండా ప్రతి రైతుకు అదనంగా రూ.20 వేలు ఇస్తామని చెప్పారని, కృతజ్ఞతకు ఆశకు పోటీ పెడితే ఆశ గెలుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రజల్లో ఆశలు రేకెత్తించి ఇప్పుడు వాటిని విస్మరించారని అన్నారు. 

ఆ హామీలు ఏమ‌య్యాయి?
వైయ‌స్ జ‌గ‌న్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలను విమర్శించారని, ఇప్పుడు అదే పథకాలకు పేర్లు మార్చారని అన్నారు. అమ్మ ఒడిని తల్లికి వందనం పేరుతో మార్చారని, అయితే ఎంతమంది లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. 25 లక్షల మంది తల్లికి వందనం లబ్ధిదారుల పరిస్థితి ఏమైందని నిలదీశారు. రెండేళ్ల పాలనలో ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా లేదా, ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పథకాల కంటే మూడు రెట్లు ఎక్కువ ఇస్తామని చెప్పిన హామీలు అమలయ్యాయా అని అడిగారు. సామాన్య ప్రజలు ఆశాజీవులని, ప్రజలను మోసం చేస్తున్న రాజకీయాలు నిలవవని వ్యాఖ్యానించారు.

 టిటిడి లడ్డూపై మండలిలో చర్చకు సిద్ధమా?
టీటీడీ లడ్డూ వివాదంపై ఆధారాలు ఉంటేనే మాట్లాడతామని, అవాస్తవాలు మాట్లాడటానికి వైయ‌స్ జ‌గ‌న్ ఎప్పటికీ అంగీకరించరని బుగ్గన తెలిపారు. లడ్డూ అంశంపై ప్రభుత్వమే వివాదాన్ని ప్రారంభించిందని ఆరోపించారు. పారదర్శకత ఉంటే మండలిలో చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. లడ్డూ వివాదానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అన్నీ కూటమి ప్రభుత్వమేనని విమర్శించారు. ఈ వివాదం వల్ల దేవుడి ప్రతిష్ట, టిటిడి పరువు దెబ్బతిన్నాయని, దేవుడు అన్నీ గమనిస్తున్నాడని అన్నారు. చివరికి దేవుడే తగిన విధంగా న్యాయం చేస్తాడని బుగ్గ‌న వ్యాఖ్యానించారు.
 

Back to Top