తాడేపల్లి: రాష్ట్రంలో రైతులు మద్దతు ధరలు లేక అల్లాడుతుంటే ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని వైయస్ఆర్‌సీపీప్రధాన కార్యదర్సి (వ్యవసాయం, రైతుల సంక్షేమం) ఎంవీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. రెండో ప్రధాన పంట అయిన శెనగల కొనుగోలులో, ఈ-క్రాప్ పూర్తి చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందన్నారు. దిగుమతి సుంకాల్లేక ధరలు పడిపోతున్నా కేంద్రంపై ఒత్తిడి చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. పైగా వైయస్ఆర్‌సీపీ హయాంలో రైతులకు ఏమీ చేయలేదంటూ అసెంబ్లీలో వ్యవసాయమంత్రి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారని ఎంవీఎస్ నాగిరెడ్డి ఆక్షేపించారు. ప్రెస్ మీట్ లో ఎంవీఎస్ నాగిరెడ్డి ఇంకేమన్నారంటే... శెనగ, మొక్క జొన్న రైతుల వెతలు పట్టని ప్రభుత్వం: రబీలో ధాన్యం తర్వాత శెనగ, మినుము ప్రధాన పంటలు. ఈ సంవత్సరం శెనగ స్ధానంలో మొక్కజొన్న రెండో స్ధానంలోకి వచ్చింది. రెండేళ్ల క్రితం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మేం క్వింటాలు 8 వేల రూపాయలకు అమ్ముకున్నామని రైతులు ప్రభుత్వ అనుకూల ఛానల్లో చెప్పారు. ఇక్కడ పప్పు ధాన్యాలు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నప్పుడు ఏపీలో రైతులు చాలా దెబ్బతింటున్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే సమయానికి శెనగలకు ధర లేదు. జమ్మలమడుగులో ఎన్నికల ప్రచార సభలో ఉండగా రైతులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు దృష్టికి ఈ సమస్య తీసుకొస్తే మద్దతు ధర కంటే ఎక్కువ ఇప్పిస్తామని చెప్పి.. ప్రభుత్వంలోకి రాగానే ఆదుకున్నాం. మా హయాంలో 2020లో శెనగలకు 60 శాతం దిగుమతి సుంకం విధించారు. 2021 లో 10 శాతం దిగుమతి సుంకం +50 శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కలిపి 60% విధించారు.. దీనితో 3 సంవత్సరాల క్రితం వరకు రైతులు క్వింటాలు 8000 రూ పైగా అమ్ము కున్నారు. 2024 మే1న వైయస్ జగన్ దిగిపోయేనాటికి దిగుమతి సుంకం సున్నా చేసేశారు. గతేడాది ఈ సుంకం 10 శాతమే వేశారు. దీంతో మద్దతు ధర కంటే 700-800 తక్కువకు అమ్ముకుని నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కేంద్ర వాణిజ్యమంత్రికి నేను, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి, గురుమూర్తి లేఖ రాశాం. గతంలో ఉన్న తరహాలోనే దిగుమతి సుంకాలు విధించాలని, మద్దతు ధర పడిపోతే రైతులు నష్టపోతారని గుర్తుచేసాం. వ్యవసాయశాఖ మంత్రికి కూడా పెరిగిన ఉత్పత్తి వ్యయానికి క్వింటాకు రూ.5875 మద్దతు ధర ప్రకటించినా వెయ్యి రూపాయలు బోనస్ ఇవ్వకపోతే శెనగ రైతులు నష్టపోతారని ప్రస్తావించాం. కానీ 8 జిల్లాల్లో పండే ఇంత ప్రధాన పంట విషయం ప్రభుత్వానికి పట్టడం లేదు. అందుకే ఇప్పటివరకూ కేంద్రం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లడం లేదు. ధరల్లేక తక్కువకు అమ్ముకుంటున్న రైతులు: ఈ పరిణామాల తర్వాత ఫిబ్రవరి 17న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి కేంద్రం నుంచి 94,500 టన్నులు శెనగ క్వింటాకు రూ.5875కు కొనుగోలు చేస్తామని రాష్ట్రానికి లేఖ రాశారు. కానీ ఈ-క్రాప్ అయ్యాక మార్చి 1 నుంచి కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇవాళ సెలవురోజు కావడంతో కొనుగోళ్లు జరగలేదు. కర్నూలు మార్కెట్లో నిన్న శెనగల ధర క్వింటాల్ రూ.5089, ఆదోని మార్కెట్లో రూ.4939. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోతున్నారనడానికి ఇదే నిదర్శనం. రాష్ట్రం ఇచ్చే వారాంతపు నివేదిక ప్రకారం శెనగ 3.72 లక్షల హెక్టార్లలో సాగు జరిగింది. రిజిస్ట్రేషన్ దగ్గర ఎకరాకు 8 క్వింటాళ్లు తీసుకుంటామని చెప్తున్నారు. ఈ లెక్కన 7 లక్షల టన్నులకు పైగా రాష్ట్రంలో శెనగ ఉత్పత్తి వస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న డేటానే. రెండేళ్లుగా శెనగరైతులు తీవ్రంగా నష్టపోయి ఉన్నా.. దానిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడం లేదు. అసెంబ్లీలో ఆర్భాటపు ప్రకటనలు తప్ప చేసిందేమీ లేదు: ఇప్పటివరకూ కొనుగోళ్లు మొదలుకాలేదు. రైతుల నుంచి ప్రభుత్వం పంట కొంటుందన్న నమ్మకం లేకపోవడం వల్లే కర్నూలు, ఆదోని మార్కెట్లలో రైతులు తక్కువకు అమ్ముకుంటున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలి. అసెంబ్లీలో పెద్ద పెద్ద ప్రకటనలు చేయడం కాదు క్షేత్రస్ధాయిలో ఆచరణలో చూపాలి. తక్షణం ప్రభుత్వం స్పందించి కేంద్రం నుంచి అదనపు అనుమతులు తెచ్చుకుని, నిబంధనల్ని సవరించి అయినా రైతుల నుంచి శెనగ పంటను కొనుగోలు చేయాలి. అలాగే ఈ సంవత్సరం రబీలో ధాన్యం తర్వాత అత్యధిక సాగు జరిగింది మొక్కజొన్న. 4 లక్షల 37 వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు జరిగింది. ఖరీఫ్ లో 40 శాతం మొక్కజొన్న నంద్యాల జిల్లాలో జరిగింది. ఈసారి కూడా రాయలసీమలోనే ఎక్కువగా సాగు జరిగింది. గత ఖరీఫ్ లో 2400 మద్దతు ధర ఉంటే రైతులు అమ్ముకుంది 1400కు మాత్రమే. పొరుగున ఉన్న తెలంగాణలో 8 లక్షల టన్నులు చేస్తామని ప్రకటించి టన్ను రూ.2400 చొప్పున కొన్నారు. నిన్న కర్నూలు మార్కెట్లో మొక్కజొన్న కనీస ధర రూ.1489 కాగా.. గరిష్ట ధర రూ.1659. దీనిపై ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా చర్యలున్నాయా చెప్పాలి. రైతుల్ని నిజంగా ఆదుకున్నది జగన్ గారే: చిత్తూరు జిల్లాలో బంతిపూలు రోడ్డు మీద పారబోసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇలా బంతిపూలు ధర లేక పారబోయడం తొలిసారి చూస్తున్నాం. గత ఖరీఫ్ సీజన్ మొత్తం 29.16 లక్షల హెక్టార్లు సాగు జరిగినట్లు వ్యవసాయ శాఖ15 అక్టోబర్ ఖరీఫ్ అంతపు వారాంతపు నివేదికలో చెప్పింది. కానీ 33.03 లక్షల హెక్టార్లలో సగటు కన్నా ఎక్కువ సాగు జరిగిందని వ్యవసాయమంత్రి అసెంబ్లీలో చెప్పారు. ఇందులో ఏది నిజమో ప్రభుత్వం చెప్పాలి. శెనగ పంట పూర్తయిన తర్వాత కూడా ఇంకా ఈ-క్రాప్ పూర్తికాకపోవడం దారుణం. రైతులు, వ్యవసాయ శాఖకూ అనుసంధానం తెచ్చింది వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం. కానీ మా హయాంలో రైతులు, వ్యవసాయశాఖకూ డీలింక్ అయిందని వ్యవసాయ మంత్రి అబద్ధాలు చెప్తున్నారు. రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానమైన రైతుల్ని అడిగితే వాస్తవాలు చెబుతారు. ఉచిత విద్యుత్ పైనా సర్కార్ అబద్ధాలు: వైఎస్సార్ హయాంలో ఉచిత విద్యుత్, రైతులకు విద్యుత్ బకాయిలు మాఫీ చేసిన చరిత్ర మాది. కానీ మా ప్రభుత్వం వరికి నుండి పండ్ల తోటలు, చెరకుకీ, నర్సరీలకూ విస్తరించి 9 గంటలు ఇస్తున్నామని అంటున్నారు. కానీ చంద్రబాబు హయాంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేకపోతే తత్కాల్ కనెక్షన్లు ఇచ్చారని గుర్తుంచుకోవాలి. తత్కాల్ కనెక్షన్లకూ ఉచిత విద్యుత్ ఇవ్వాలని వైయస్ఆర్ ను మేం అడిగితే వెంటనే ఆమోదించారు. మొదటే హార్టీకల్చర్ కు ఉచిత విద్యుత్ ఇచ్చారు. కడియంలో నర్సరీలకు సైతం జక్కంపూడి రామ్మోహన్ రావు గారు రైతులతో కలిసి కాకినాడ లో అడగ్గానే వైయస్ఆర్ ఆమోదించి ఉచిత విద్యుత్ కల్పించారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు తామే మొదలుపెట్టినట్లు అబద్ధాలు చెబుతోంది. చంద్రబాబు హయాంలో 7 గంటల ఉచిత విద్యుత్ ను పగలు నాలుగు గంటలు, రాత్రి 3 గంటలు ఇస్తే తిరిగి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు హయాంలో 9 గంటలూ పగలే ఇచ్చారు. అత్యధికంగా 3 లక్షల వ్యవసాయ కనెక్షన్లు కూడా ఇచ్చారు. గత ప్రభుత్వంలో వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కడా సేకరించలేదని ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా అబద్ధాలు చెబుతోంది. సమాచార చట్టం ప్రకారం వివరాలు తీసుకుంటే ఈ ప్రభుత్వంలో 7-01-2026 వరకూ కేవలం 788 కోట్ల రూపాయల ఉత్పత్తులు మాత్రమే సేకరించారు. మా హయాంలో ఐదేళ్లలో 7726 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు కొన్నాం. ఇందులో మొక్కజొన్న, జొన్న, పసుపు, వేరుశెనగ, సజ్జలు, పొగాకు ఉన్నాయి. అలాగే మా హయాంలో వ్యవసాయ యంత్రాలు రైతులకు ఇవ్వలేదన్నారు. కానీ వైయస్ జగన్ హయాంలో రూ.1052 కోట్ల విలువైన యంత్రాలు ఇచ్చాం. కావాలంటే డేటా చూసుకోండి. అలాగే ఇన్ పుట్ సబ్సిడీ రూ.3261 కోట్లు, సున్నా వడ్డీ రాయితీ రూ.2050 కోట్లు ఇచ్చాం. ఈ 20 నెలల్లో మీరు ఒక్క సున్నా వడ్డీ రాయితీ కూడా ఇవ్వలేదు. అసెంబ్లీ సాక్షిగా వ్యవసాయంపై అన్నీ అబద్ధాలే చెప్తున్నారు. చేసింది చెప్పుకునే పరిస్ధితి లేక ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఎంవీఎస్ నాగిరెడ్డి ఆక్షేపించారు.