నెల్లూరు: రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా వైఫల్యం చెందిందని, “కల్తీ పాలన” కొనసాగుతోందని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు విమర్శించారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వం తీరును తూర్పారబట్టారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, పాలు, నీళ్లు కల్తీ అయి ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. “నీళ్లు తాగినా కల్తీ, పాలు తాగినా కల్తీ, చివరకు పరిపాలన కూడా కల్తీగానే ఉంది” అని వ్యాఖ్యానించారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలు భయాందోళనల్లో జీవిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే మేల్కొని రాష్ట్ర పరిస్థితిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రెస్‌మీట్‌లో జూపూడి ప్రభాకర్‌రావు ఇంకా ఏమన్నారంటే..: ‘చంద్రకర్ణ మేల్కో’ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా జనం ప్రాణసంకటంతో బతుకుతున్నారు. ‘చంద్రకర్ణ మేల్కో’ అని ప్రజలు మొరపెడుతున్నారు. పాలు, నీళ్లు కల్తీ అయి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈరోజు రాష్ట్రంలో కల్తీ లేనిది ఏదీ లేదు. నీళ్లు తాగుదామన్నా కల్తీనే, పాలు తాగుదామన్నా కల్తీనే, మాట్లాడుదామన్నా కల్తీనే. చివరకు ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలన కూడా కల్తీగానే మారింది. కూటమి ప్రభుత్వంలో ఎవరి దారి వారిదే. ప్రజలకు శాంతిభద్రతలు లేవు. కనీస మౌలిక వసతులు కూడా లేని పరిస్థితి నెలకొంది. మొత్తం చిన్నబాబు మయం అయిపోయింది. ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు వస్తాయో లేదో అనుమానం. కానీ కూటమిలోని కొందరు నేతలకు మాత్రం సకాలంలో కమీషన్లు ముట్టుతున్నాయి. శాంతిభద్రతలపై స్పష్టత లేదు బడ్జెట్‌లో గవర్నర్ ప్రసంగమంతా తప్పుడు తడకలతో నిండి ఉంది. శాంతిభద్రతలపై ఒక్క స్పష్టమైన సమాచారం లేదు. ప్రతి నిమిషానికి ఎక్కడో ఒక చోట అత్యాచారాలు, అరాచకాలు జరుగుతున్నాయి అని ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా ‘తస్మత్ జాగ్రత్త’ అనే పరిస్థితి తీసుకొచ్చారు. ప్రతిపక్షంపై కూటమి ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోంది. ఎన్ని కేసులు పెట్టినా వైయస్‌ఆర్‌సీపీ భయపడదు. ప్రజల పక్షాన నిలబడటం మా కర్తవ్యం. ఆ బాధ్యత నుంచి మేము ఎప్పుడూ వెనక్కి తగ్గం. ఎవరిని వదిలిపెట్టం అసైన్డ్ ల్యాండ్లను కూటమి నేతలు దౌర్జన్యంగా లాక్కుంటున్నారు. వైయస్‌ఆర్‌సీపీని భయభ్రాంతులకు గురి చేయాలని పోలీసులను అడ్డుపెట్టుకొని కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. కానీ రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన వారిని సప్తసముద్రాల అవతల ఉన్నా విడిచిపెట్టేది లేదు. ప్రజల బాగోగులు చూసేందుకు ప్రభుత్వం, అధికారులు పని చేయాలి. కానీ ప్రతిపక్షంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే అలాంటి వారిని చట్టం ముందు నిలబెడతాం. వైయస్ జగన్ రోడ్డు మీదకు వస్తే ప్రజలు తిరగవద్దా అంటూ స్వయంగా సీఎం చంద్రబాబు అంటున్నారు. ముందు ఆయన తన ప్రయాణాలపై ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. తురకపాలెంలో ప్రజలు ఎందుకు చనిపోయారో ఇప్పటికీ ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతే వారిని పరామర్శించేందుకు వైయస్ జగన్ బయటకు వస్తే ఆంక్షల పేరుతో కట్టడి చేయాలని చూడటం సరైన పద్ధతి కాదు. త్వరలో గవర్నర్‌ను కలుస్తాం రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నాయి. నిత్యం గంజాయి కేసులు నమోదవుతున్నా వాటిని కట్టడి చేయడం లేదు. వైయస్‌ఆర్‌సీపీపై దాడులు చేయడం, సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టడం సరికాదు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలపై త్వరలోనే గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తాం. ఏకసభ్య కమిషన్ వేయడం ఏ పార్లమెంటరీ సిద్ధాంతం? అసెంబ్లీలో లడ్డూ అంశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన చార్జ్‌షీట్‌పై చర్చ పెట్టమంటే అధికార పార్టీ పారిపోయింది. సీబీఐ రిపోర్ట్‌పై చర్చించకుండా ఏకసభ్య కమిషన్ వేయడం ఏ పార్లమెంటరీ సిద్ధాంతం? పార్లమెంటరీ సాంప్రదాయాలను చంద్రబాబు తుంగలో తొక్కారు. అసెంబ్లీలో మీరు అనుకున్నది మాట్లాడి, అదే విషయాన్ని రేపు కమిషన్ రిపోర్టుగా ఇవ్వమని ఆదేశించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. వైయస్‌ఆర్‌సీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం బాధాకరం. ఎన్ని సీట్లు వచ్చాయన్నది ముఖ్యం కాదు. 40 శాతం పైగా ఓట్లు సాధించిన పార్టీగా ప్రజల పక్షాన ప్రశ్నించే హక్కు ఉంది. ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న చంద్రబాబు ప్రభుత్వ విధానం దారుణం. 2019 నుంచి 2024 మధ్య మాత్రమే వైయస్ జగన్ ప్రభుత్వం ఉంది. అంతకు ముందు కూడా టీటీడీ వ్యవస్థ ఉంది. గత పాలనపై కూడా విచారణ చేయమంటే ఎందుకు ముందుకు రావడం లేదు? లడ్డూలో కల్తీ జరిగిందని చెబుతున్నారు. అది హెరిటేజ్ తప్పేనంటూ చర్చ జరుగుతోంది. మొత్తానికి మీ పాలన కూడా కల్తీగానే ఉంది. ప్రతి జిల్లాలో వస్తున్న ప్రజా సమస్యలపై వైయస్‌ఆర్‌సీపీ నిలదీస్తోంది. మాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. లడ్డూ అంశంపై కూటమిలోని రెండు పార్టీలే మాట్లాడుతున్నాయి. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వరం మార్చారు. ‘వైయస్ జగన్ చేశారని నేను అనలేదు, టీటీడీ ఉద్యోగులదే తప్పు’ అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. కూటమి అంటే ప్రతిపక్షంపై దాడి చేయడం కాదు. ప్రజలకు ఆమోదయోగ్యమైన, పారదర్శకమైన పాలన చేయాలి అని జూపూడి ప్రభాకర్‌రావు డిమాండ్ చేశారు.