అసెంబ్లీ వద్ద వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీల ధర్నా

తిరుమల లడ్డూ అంశంపై చర్చ కొనసాగించాలని ప్రతిపక్షం డిమాండ్

అమరావతి: శాసనసభ ప్రాంగణం వద్ద వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు గురువారం ధర్నాకు దిగారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి సంబంధించిన అంశంపై సభలో విస్తృత చర్చ జరగాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీ బయట రోడ్డుపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ ప్రసాదం అంశంపై చర్చ చేపట్టాలని కోరుతూ శాసనమండలిలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్సీలు ర‌మేష్‌యాద‌వ్‌, భ‌ర‌త్‌, సిపాయి సుబ్ర‌హ్మ‌ణ్యం వాయిదా తీర్మానాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు మాట్లాడుతూ, ప్రజలకు ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సభలో సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. అంశాన్ని పక్కన పెట్టకుండా ప్రజల ముందు వాస్తవాలు ఉంచాలని కోరారు. మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా తిరుమల లడ్డూ అంశంపై చర్చ కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. సభలో చర్చ ప్రారంభమైన తరువాత వాయిదా పడినందున, నేటి సమావేశంలోనూ చర్చ కొనసాగించాలని ఆయన పట్టుబట్టారు. ఈ మేరకు నిన్న మండలి చైర్మన్‌తో పాటు సెక్రటరీ జనరల్‌కు బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ప్రజల విశ్వాసాలకు సంబంధించిన అంశం కావడంతో పారదర్శకంగా చర్చ జరగాలని ప్రతిపక్షం అభిప్రాయపడింది. 
 

Back to Top