అనంతపురం:వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై వైయస్ఆర్‌సీపీ నేత జ్వాలాపురం శ్రీకాంత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం అనంతపురం లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కనీసం పూజా విధానాల పట్ల అవగాహన లేని బుచ్చి రాంప్రసాద్ ఏ అర్హతతో వైయస్ జగన్ ని విమర్శిస్తున్నారని శ్రీకాంత్ ప్రశ్నించారు. పదవుల కోసం క్షుద్రపూజలు చేసే వారి పక్కన నిలబడే రాంప్రసాద్, బ్రాహ్మణత్వానికే కళంకం తెస్తున్నారని విమర్శించారు. గతంలో టీడీపీ హయాంలో కనకదుర్గమ్మ ఆలయంలో జరిగిన క్షుద్రపూజల ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే... - వైయస్ కుటుంబమే దేవాలయాలకు అండ ఈ రోజు రాష్ట్రం లోని మారుమూల గ్రామాల్లో కూడా ధూపదీప నైవేద్యాలు నిరంతరాయంగా అందుతున్నాయంటే దానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి, వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారే కారణం అని శ్రీకాంత్ స్పష్టం చేశారు. హోమ ద్రవ్యాలకు, అవిస్సులకు తేడా తెలియకుండా మాట్లాడటం రాంప్రసాద్ అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. - నందీశ్వర ఆలయ హోమంపై వివరణ పులివెందుల లోని నందీశ్వర ఆలయంలో వైయస్ జగన్ హోమంలో పాల్గొనడాన్ని తప్పుబట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వైయస్.జగన్ అత్యంత నిష్ఠతో, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారని తెలిపారు. యాగానికి దుష్ట శక్తులు అడ్డురాకుండా ఉండాలని కోరుకుంటూ అక్షింతలు వాసన చూసి వెనక్కి వేస్తారని, ఇది తెలియకుండా విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. మరోవైపు హోమంలో కార్యవాది అయిన ఆలయ చైర్మన్ లేదా పాలకమండలి సభ్యులు మాత్రమే సతీసమేతంగా కూర్చుంటారనే కనీస జ్ఞానం కూడా విమర్శించే వారికి లేదని మండిపడ్డారు. - హిందూ ద్రోహి చంద్రబాబే.. బూట్లు వేసుకుని పూజలు చేసిన వారు, దేవాలయాలను కూల్చిన చంద్రబాబు నాయుడు అసలైన హిందూ ద్రోహి అని శ్రీకాంత్ ఆరోపించారు. వైయస్.జగన్ ని హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడమే ధ్యేయంగా టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని, హిందూ ధార్మిక ముసుగులో ఉన్న అసలైన ద్రోహులు టీడీపీ నేతలే అని ఆయన తేల్చి చెప్పారు. పూజా విధానాలపై కనీస అవగాహన పెంచుకున్న తర్వాతే టీడీపీ నేతలు మాట్లాడాలని, అనవసర విమర్శలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని శ్రీకాంత్ హెచ్చరించారు.