న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాలపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులు, అన్యాయాలపై కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, పార్టీ నేతలు జాతీయ ఎస్సీ కమిషన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, నాయకులు మాట్లాడుతూ ..రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు పెరుగుతున్నాయని, ప్రశ్నించే గొంతులను అణిచివేయడానికి పాలకులు అక్రమ కేసులు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దళితుల హక్కులు, రక్షణను కాపాడాల్సిన ప్రభుత్వమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రత్యేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులపై టార్గెట్ చేసిన దాడులు జరుగుతున్నాయని, ఇందులో ఎక్కువగా ఎస్సీ వర్గాలకు చెందిన కార్యకర్తలు బాధితులవుతున్నారని వివరించారు. ఇటువంటి పరిస్థితులు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సమర్థంగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని కమిషన్‌కు అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రతినిధి బృందంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్ రెడ్డి, మద్దిల గురుమూర్తి, బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, తనూజా రాణి పాల్గొన్నారు. అలాగే ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్ బాబు, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలం సురేష్, ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, ఎమ్మెల్యే చంద్రశేఖర్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు కూడా ఈ బృందంలో ఉన్నారు.