సీమ ఎత్తిపోతల సాధనే ధ్యేయం 

మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి స్ప‌ష్టం

నెల్లూరు:  రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం సాధ‌నే వైయ‌స్ఆర్‌సీపీ ధ్యేయ‌మ‌ని మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలోని పొదలకూరు మండల కేంద్రంతో పాటు భోగసముద్రం గ్రామంలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు, స్థానికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. యూరియా సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆయనకు విన్నవించారు. యూరియా కొరత కారణంగా బ్లాక్ మార్కెట్‌లో రెట్టింపు ధరలకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి పాలనంతా అవినీతి, అక్రమాలతో నిండిపోయిందని, అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని స్థానికులు విమర్శించారు. ఈ పర్యటనలో ఇటీవల మృతి చెందిన త్రోవ గుంట ప్రసాద్ నాయుడు తండ్రి చిన్న మస్తాన్ నాయుడిని, అలాగే వెన్న పూస సుందర్ రెడ్డి కుటుంబ సభ్యులను డా. కాకాణి పరామర్శించి సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. యూరియా సకాలంలో అందక రైతులు అనేక నష్టాలు చవిచూస్తున్నారని, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రాజకీయాలకు అతీతంగా సమృద్ధిగా యూరియా అందించామని గుర్తు చేశారు. గ్రామాల్లో అంతర్గత రోడ్లతో పాటు ప్రధాన రహదారులన్నింటినీ నిర్మించామని, రైతులు–ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వైయస్సార్ ప్రభుత్వ పాలన సాగిందని అన్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి మాటలు విని కృష్ణా జలాలను మనకు రానివ్వకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడం దుర్మార్గం అని తీవ్రంగా విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడాన్ని నిరసిస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ‘ఛలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జగనన్న తలపెట్టిన ఈ పథకం తిరిగి ప్రారంభించే వరకు కూటమి ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి పెంచుతామని స్పష్టం చేశారు. కూటమి పాలనలో కక్ష సాధింపులతో విసిగిపోయిన ప్రజలు జగనన్న పాలనను కోరుకుంటున్నారని, రాష్ట్రంలో ఏ రోజు ఎన్నికలు వచ్చినా వైయస్ జగన్ మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. జగన్ పర్యటనల్లో ప్రజలు భారీగా పాల్గొనడాన్ని కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేక పోలీసులతో అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు లెక్కచేయకుండా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్నారని, ఇది రానున్న ఘన విజయానికి సంకేతమని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో ఎక్కడైనా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఇబ్బంది ఎదురైతే అన్ని విధాలా అండగా నిలుస్తామని, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.

Back to Top