రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ

కూటమి పాలనపై రవీంద్రనాథరెడ్డి విమర్శలు

వైయ‌స్ఆర్‌ కడప జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింద‌ని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ వైయ‌స్ఆర్‌ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు దేశంలోని మరే రాష్ట్రంలో లేవని ఆయన వ్యాఖ్యానించారు.  పాలనలో లోపాలను ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త దుష్ట సాంస్కృతిని తీసుకొచ్చిందని విమర్శించారు. గతంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రకారం పాలన సాగేదని, ప్రస్తుతం “రెడ్ బుక్ రాజ్యాంగం” పేరుతో దుర్మార్గమైన పాలన కొనసాగుతోందని అన్నారు. కేవలం పార్టీ కార్యకర్తలపై మాత్రమే కాకుండా మాజీ మంత్రులపై కూడా దాడులు జరుగుతున్నాయని రవీంద్రనాథరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంపై “జగన్ రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం” అంటూ విమర్శలు చేసిన కూటమి నేతలు ఇప్పుడు అదే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

తిరుమల లడ్డులో కల్తీ లేదని సీబీఐ, సిట్ నివేదికలు స్పష్టంగా చెప్పినా కూటమి నేతలు విమర్శలు ఆపడం లేదని అన్నారు. ఈ వ్యాఖ్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ప్రసాదాన్ని కల్తీ చేయాలని ఎవరూ అనుకోరని, ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. సిట్, సీబీఐ నివేదికలు తమకు అనుకూలంగా రాకపోవడంతో కూటమి నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని రవీంద్రనాథరెడ్డి అన్నారు. ఆ ఆగ్రహంతోనే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. అంత పెద్ద ఎత్తున దాడులు జరిగినప్పటికీ దాడులకు పాల్పడిన వారిని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్న ఆయన, పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలంటే రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.

Back to Top