కార్యకర్తల కష్టానికి తగిన గుర్తింపు తప్పనిసరి 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి భరోసా

నెల్లూరు జిల్లా: పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు ప్రభుత్వం తిరిగి ఏర్పడిన వెంటనే తగిన గుర్తింపు, గౌరవం తప్పకుండా కల్పిస్తామని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి భరోసా ఇచ్చారు. పార్టీ కోసం చెమట చిందించిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని, కష్టపడే వారికి సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు.  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొని పార్టీ సంస్థాగత బలోపేతంపై  దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్బంగా వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గాంధీజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

 ఈ సంద‌ర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… రాజకీయ మార్పు యువతతోనే సాధ్యమని పేర్కొంటూ, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామని తెలిపారు. యువతను కేవలం ఓటర్లుగా కాకుండా, భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్ది రాజకీయంగా చైతన్యవంతులను చేస్తామని అన్నారు. రాష్ట్రంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని ఆపడం ఎవరితరం కాదని, రాబోయే రోజుల్లో మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పటిష్టమైన కమిటీల ఏర్పాటు ద్వారా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా పార్టీని మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు.

కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు

కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, అవినీతి అక్రమాలు విపరీతంగా పెరిగి ప్రజలు భరించలేని పరిస్థితి నెలకొందని డా. కాకాణి విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి తానే చంద్రబాబును కోరిన మేరకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఆపివేయడానికి చంద్రబాబు సమ్మతించాడని ప్రకటించారని గుర్తు చేశారు. శ్రీశైలం దిగువ నుంచి తెలంగాణ రాష్ట్రం రోజుకు 8 టీఎంసీల నీటిని తరలిస్తుంటే, మన రాష్ట్రం కనీసం 3 టీఎంసీల నీరు కూడా తెచ్చుకోలేని దుస్థితి నెలకొందన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి  ప్రారంభించిన రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని చంద్రబాబు అర్ధాంతరంగా ఆపివేసి రాష్ట్ర రైతాంగానికి తీరని ద్రోహం చేశారని ఆరోపించారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై స్పష్టత

సోమిరెడ్డికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై కనీస అవగాహన లేదని, గ్రావెల్, ఇసుక దోపిడీపైనే ఆయనకు శ్రద్ధ ఉందని విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు మేలు చేసేదని, గతంలో ఏదైనా పొరపాటు జరిగితే ప్రభుత్వం బాధ్యత తీసుకునే నిబంధన ఉండేదని, ఆ నిబంధనను ఈ ప్రభుత్వం తొలగించిందన్నారు. కేవలం పట్టాదారు పాస్‌బుక్ రంగులు మార్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గ‌తంలో సీఎస్ఆర్ నిధులను జిల్లా కలెక్టర్ లేదా ప్రభుత్వ ద్వారా మాత్రమే వినియోగించేవారని, రూ.25 కోట్లతో ఫిషింగ్ జెట్టీని సీఎస్ఆర్ నిధులతో నిర్మించేందుకు పోర్ట్ యాజమాన్యానికి బాధ్యత అప్పగించామని తెలిపారు. ఫిషింగ్ జెట్టీ, స్టేడియం పనులు అర్ధాంతరంగా ఎందుకు ఆగిపోయాయో టిడిపి నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మత్స్యకారేతరులతో పాటు మత్స్యకార కుటుంబాలకు రూ.25,000 ప్యాకేజీ అందించామని, సోమిరెడ్డి అధికారం లోకి వచ్చాక రూ.41,000 ఇస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. పోర్టు కంటైనర్ టెర్మినల్‌ను వెనక్కి తీసుకువస్తామని చెప్పి ఇప్పుడు మౌనం వహిస్తున్నారన్నారు. కులమతాలకు తావులేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేసిన ఘనత వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి గారికే దక్కిందన్నారు. జగనన్న పాలనలో పేదల ముఖాల్లో కనిపించిన చిరునవ్వే రేపు మన గెలుపుకు పునాది అవుతుందని చెప్పారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని స్పష్టం చేశారు. జిల్లాలో ఫ్యాన్ గాలి వీచేలా అందరినీ ఏకం చేస్తామని డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి  ఉద్ఘాటించారు.

Back to Top