కూల్చిన ప్ర‌హ‌రీని త‌క్ష‌ణం నిర్మించాలి

ఎమ్మెల్యే ఆదేశాల‌తోనే క‌రివేన బ్రాహ్మ‌ణ‌ స‌త్రం ప్ర‌హ‌రీ కూల్చివేత‌

ముందస్తు నోటీసులు ఇవ్వ‌కుండా కూల్చివేయ‌డం దారుణం

స్పందించ‌క‌పోతే బ్రాహ్మ‌ణుల‌తో క‌లిసి వైయస్ఆర్‌సీపీ ఉద్య‌మిస్తుంది  

ప్రభుత్వాన్ని హెచ్చ‌రించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి, నంద్యాల జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు 
కాట‌సాని రాంభూపాల్‌ రెడ్డి

చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ శ్రీవారి భ‌క్తుల‌కు స‌మాధానం చెప్పాలి

ఆల‌యాల‌ను అడ్డం పెట్టుకుని రాజ‌కీయాలు చేయ‌డం ఆపాలి

ల‌డ్డూలో జంతువుల కొవ్వు క‌ల‌వ‌లేద‌ని సిట్ చార్జిషీట్ తో తేలిపోయింది

అయినా త‌ప్పుడు ప్ర‌చారం ఆప‌ని కూట‌మి నాయ‌కుల‌ను దేవుడు క్ష‌మించ‌డు

స్ప‌ష్టం చేసిన వైయస్ఆర్‌సీపీ నాయ‌కులు  

నంద్యాల: ఎమ్మెల్యే బుడ్డా రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆదేశాల‌తోనే శ్రీశైలం ఆల‌య అధికారులు ముంద‌స్తు నోటీసులు ఇవ్వ‌కుండా క‌రివేన బ్రాహ్మ‌ణ‌ స‌త్రం ప్ర‌హ‌రీ కూల్చివేసే దుస్సాహ‌సం చేశార‌ని, త‌క్ష‌ణం కూల్చిన చోటే ప్ర‌హ‌రీని నిర్మించాల‌ని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి, నంద్యాల జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి కూట‌మి ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో వారు మీడియాతో మాట్లాడుతూ ప్ర‌భుత్వం త‌క్ష‌ణం స్పందించి ప్ర‌హ‌రీని నిర్మించక‌పోతే బ్రాహ్మ‌ణుల‌తో క‌లిసి వైయస్ఆర్‌సీపీ ఉద్య‌మిస్తుంద‌ని హెచ్చరించారు. గీతం కాలేజీకి రూ. 5 వేల కోట్ల విలువైన భూములు అప్ప‌నంగా ఇచ్చేసిన ప్ర‌భుత్వానికి నిత్యం దేవుడికి సేవ చేసే బ్రాహ్మ‌ణ స‌త్రం కూల్చివేయ‌డం స‌మంజ‌స‌మేనా అని ప్ర‌శ్నించారు. స‌నాతన ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షిస్తామ‌ని చెప్పుకుంటూ ఇలా ఆల‌యాల వేదిక‌గా దారుణాలు చేస్తూ పోతే హిందూ స‌మాజం చీద‌రించుకుంటుంద‌ని మండిప‌డ్డారు. తిరుమ‌ల ల‌డ్డూలో జంతువుల కొవ్వు క‌లిపారంటూ చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ చేసిన ప్ర‌చారమంతా అబ‌ద్ధ‌మ‌ని సీబీఐ సిట్ చార్జిషీట్ తో తేలిపోయింద‌ని, హిందువుల మ‌నోభావాల‌ను గాయ‌ప‌రిచినందుకు వారిద్ద‌రూ భ‌క్తుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. 
వారు ఇంకా ఏమ‌న్నారంటే  

● 1889 నుంచి క‌రివేన స‌త్రంలో అన్న‌దానం 

శ్రీశైలంలో క‌రివేన బ్రాహ్మ‌ణ స‌త్రంపై దాడి యావ‌త్ హిందూ స‌మాజాన్ని అవ‌మానించ‌డ‌మే. శ్రీశైలం దివ్యక్షేత్రాన‌కి వ‌చ్చే భ‌క్తుల‌కు అన్న‌దానం చేయాల‌న్న సంక‌ల్పంతో బ్రాహ్మ‌ణులంతా క‌లిసి 1889లో క‌రివేన స‌త్రాన్ని ప్రారంభించారు. ప్ర‌భుత్వం శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఐదురోజుల‌పాటు అన్న‌దానం నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. అఖిల భార‌త క‌రివేన బ్రాహ్మ‌ణ స‌త్రం పేరిట దేశ‌వ్యాప్తంగా 16 ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాల్లో అన్న‌దానం నిర్వ‌హిస్తూ భ‌క్తుల‌కు సేవ చేస్తూ వ‌స్తున్నారు. గ‌తంలో శ్రీశైలం ఆల‌య ఈవో క‌రివేన సత్రంకి ప‌క్క‌నే ఉన్న మ‌రో 17 సెంట్ల స్థ‌లం కూడా ఇవ్వ‌డంతో దాత‌ల స‌హ‌కారంతో ప్ర‌హ‌రీని నిర్మించుకున్నారు. ఈ విధంగా భ‌క్తుల‌కు సేవ చేస్తూ వ‌స్తున్న క‌రివేన స‌త్రం ప్ర‌హ‌రీని ఎమ్మెల్యే ఆదేశాల‌తో ఎలాంటి ముంద‌స్తు నోటీసులు ఇవ్వ‌కుండా దుర్మార్గంగా కూల్చివేశారు. ఎమ్మెల్యే ఆదేశాల‌తోనే దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఈ దారుణానికి పూనుకున్నాడు. 

● ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించాలి

హిందూ స‌మాజాన్ని అవ‌మానించే మాదిరిగా కూట‌మి ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంది. అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి భ‌క్తుల మ‌నోభావాల‌తో ఆడుకుంటున్నారు. దేవుడికి నిత్యం సేవ చేసుకునే బ్రాహ్మ‌ణోత్స‌ములు నిర్మించుకున్న స‌త్రం ప్ర‌హ‌రీని దుర్మార్గంగా కూల్చివేస్తే సనాత‌న ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షిస్తామ‌ని చెప్పే డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎందుకు స్పందించ‌డం లేదు?  గీతం యూనివ‌ర్సిటీకి రూ. 5 వేల కోట్లు విలువ‌చేసే 55 ఎక‌రాల‌ను అప్ప‌నంగా ఇచ్చేస్తున్న చంద్ర‌బాబు.. 17 సెంట్ల స్థ‌లం కోసం బ్రాహ్మ‌ణ స‌త్రం ప్ర‌హ‌రీని కూల్చివేయ‌డం దారుణం. స‌నాత‌న ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షించ‌డం ఇలాగేనా? దీనిపై ప్ర‌భుత్వం త‌క్ష‌ణం స్పందించి ప్ర‌హ‌రీని తిరిగి నిర్మించేదాకా వ‌దిలే ప్ర‌స‌క్తే లేదు. 

● భ‌క్తుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

ఇంకోప‌క్క హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసే విధంగా తిరుమ‌ల ల‌డ్డూలో జంతువుల కొవ్వు క‌లిసింద‌ని సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు అబ‌ద్ధ‌మ‌ని సీబీఐ చార్జిషీట్‌తో నిర్ధార‌ణ అయ్యింది. వైయ‌స్ జ‌గ‌న్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని హ‌న‌నం చేసే కుట్ర‌తో రాజ‌కీయ ల‌బ్ధి కోసం చేసిన దుస్సాహ‌సంగా ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంది. ఇప్ప‌టికైనా త‌ప్పు చేశామ‌ని క్ష‌మించ‌మ‌ని దేవున్ని వేడుకోవాల్సిందిపోయి చేసిన త‌ప్పును స‌మ‌ర్థించుకునేలా మ‌రింత దిగ‌జారి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను మ‌రింత దిగ‌జార్చేలా కూట‌మి నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌నాత‌న ధ‌ర్మం ముసుగులో ఆల‌యాల‌ను నాశ‌నం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా చేసిన త‌ప్పుని ఒప్పుకుని ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి. పుణ్య‌క్షేత్రాల గురించి మాట్లాడేట‌ప్పుడు కూట‌మి నాయ‌కులు నోటిని అదుపులో ఉంచుకోవాలి. 

● కూల్చిన ప్ర‌హ‌రీని త‌క్ష‌ణం నిర్మించాలి - నంద్యాల జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు కాట‌సాని రాంభూపాల్‌ రెడ్డి

ముంద‌స్తు నోటీసులు ఇవ్వ‌కుండా స‌త్రం ప్ర‌హ‌రీని కూల్చివేయ‌డం చాలా త‌ప్పు. అధికారులు తీసుకున్న తొంద‌ర‌పాటు నిర్ణ‌యాన్ని స‌రిదిద్దుకోవాలి. కూల్చిన ప్ర‌హ‌రీని త‌క్ష‌ణం నిర్మించాలి. తిరుమ‌ల‌ ల‌డ్డులో జంతువుల కొవ్వు క‌ల‌వ‌లేద‌ని సీబీఐ సిట్ చార్జిషీట్‌తో నిర్ధార‌ణ అయ్యింది కాబ‌ట్టి చంద్ర‌బాబు, ప‌వ‌న్ కళ్యాణ్ .. చేసిన త‌ప్పున‌కి ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి. రాజ‌కీయాల్లోకి దేవుడిని వాడుకోవ‌డం ఆపాలి. అనుక్ష‌ణం అబ‌ద్ధాలు, మోసాల‌తో రాజ‌కీయం చేసే చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు స‌నాత‌న ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షిస్తామని ఇంకోసారి చెబితే ప్ర‌జ‌లు స‌హించ‌రు.

Back to Top