చంద్ర‌బాబు టార్గెట్ కాపు కుల‌మే

గతంలో నా కుటుంబం, ఇప్పుడు అంబటి కుటుంబానికి అవ‌మానం

చంద్ర‌బాబు కాపుల మీద ఎప్పుడూ రగిలిపోతునే ఉన్నారు 

కాపు ఉద్య‌మ నేత‌, వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ స‌భ్యుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఆగ్ర‌హం

అంబటిపై దాడి, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు ముద్రగడ బహిరంగ లేఖ

కాకినాడ:   చంద్ర‌బాబు పరిపాలనలో ఎంతసేపూ కాపు కులాన్ని టార్గెట్ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నార‌ని కాపు ఉద్యమ నేత, వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం  ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్రబాబు అనే వ్యక్తి ఎప్పుడూ కాపుల మీద రగిలిపోతూనే ఉంటారని.. అందుకే రిజర్వేషన్ల విషయం సహా ప్రతీ దాంట్లోనూ మోసం చేస్తూ వస్తున్నారని అంటున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి నేపథ్యం, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు ముద్రగడ సోమవారం ఓ బహిరంగ లేఖ రాశారు. 

‘‘రాష్ట్రంలో గాడితప్పిన రాక్షస పాలనలో దహనకాండను చూస్తున్నాను. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేష్ లను ఘోరాతి ఘోరంగా అవమానించడం ఎంత వరకు న్యాయం?. తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని సీబీఐ ఇచ్చిన నివేదికతో గతంలో మీరు చెప్పింది అబద్దమని తేలిపోయింది. దానిని కప్పిపుచ్చుకోవడానికి  మీరు పడుతున్నపాట్లు అంతా ఇంతా కాదు. మీరు చెప్పిన అబద్దానికి మీ పార్టీనే ఎంతో నష్టపోయింది.. 

మీ పరిపాలనలో ఎంతసేపూ కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు. గతంలో నా కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారు. కాపుల మీద మీరు ఎప్పుడూ రగిలిపోతునే ఉన్నారు. గతంలో కాపులకు రిజర్వేషన్‌లు ఇస్తానని హమీ ఇచ్చి మొండి చెయ్యి చూపించారు. డిప్యూటీ సీఎం(పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి..) మీద ప్రేమతో మళ్ళీ కాపులు మీకు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు కాపులంతా మీ మీద కోపంతో ఉన్నారు. దయచేసి కాపులను ఈ రాష్ట్రం నుండి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయ్యండి’’ అంటూ చంద్రబాబు, లోకేష్‌ను ఉద్దేశించి ముద్రగడ పద్మనాభం లేఖలో పేర్కొన్నారు.

Back to Top