కూట‌మి నేత‌ల తప్పుడు ప్రచారాలపై ప‌రిగి పోలీసుల‌కు ఫిర్యాదు 

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా:  పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కూటమి నేతలు చేసిన తప్పుడు ప్రచారాలు, ఫ్లెక్సీల వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

గౌరవ మాజీ ముఖ్యమంత్రివర్యులు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మాజీ మంత్రివర్యులు, శ్రీ సత్యసాయి జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషాశ్రీ చరణ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఫ్లెక్సీల వెనుక కుట్ర – శాంతి భద్రతలకు ముప్పు

రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని భంగం చేయాలన్న ఉద్దేశంతో, ఎవరి పేరు లేకుండా, ప్రింటింగ్ సంస్థ వివరాలు లేకుండా కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తప్పుడు ప్రచారం చేశారని నాయకులు ఆరోపించారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా చేసిన ఈ దుష్ప్రచారంపై, అలాగే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పరిగి ఎస్సైని కోరారు.

రాజకీయ స్వార్థం కోసం భక్తుల మనోభావాలతో ఆట

ఈ సందర్భంగా ఉషాశ్రీ చరణ్ గారు మాట్లాడుతూ…రాజకీయ స్వార్థం కోసం పరమ పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై జంతువుల కొవ్వు కలిసిందంటూ నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కూటమి నేతలు చేసిన తప్పుడు ఆరోపణలతో కోట్లాది భక్తులను మానసిక క్షోభకు గురి చేశారని మండిపడ్డారు. ఈ దుర్మార్గపు ప్రచారానికి వారు తక్షణమే భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

NDDB, NDRI నివేదికలతో అబద్ధాలు బట్టబయలు

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశంలోని ప్రతిష్టాత్మక NDDB, NDRI ల్యాబ్‌లు చేసిన పరీక్షల్లో తిరుమల ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదని స్పష్టంగా తేలినా, కూటమి నేతలు ఇంకా నిస్సిగ్గుగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. నిజం గెలిచి అబద్ధం ఓడిపోయిందని స్పష్టం చేశారు.

తిరుమల ఆలయాన్నే రాజకీయ వేదికగా మార్చారు

తిరుమల శ్రీవారి ఆలయాన్ని, స్వామివారి ప్రసాదాన్నే రాజకీయ ఆయుధంగా మార్చిన చంద్రబాబు నాటకం పూర్తిగా భగ్నమైందన్నారు. ఇంత నీచమైన రాజకీయాన్ని, ఇంత అమానవీయమైన దుష్ప్రచారాన్ని రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదన్నారు.

కుట్ర వెనుక చంద్రబాబు రచన

2024 సెప్టెంబర్ 18న కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన ప్రకటనతోనే ఈ విష రాజకీయానికి పునాదులు పడ్డాయన్నారు. ఆ అబద్ధాన్ని టీడీపీ, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, ఎల్లో మీడియా కలిసి రాష్ట్రవ్యాప్తంగా వ్యాపింపజేశారని ఆరోపించారు.

తప్పు చేస్తే కోర్టుకు వెళ్తారా?

నిజాలు వెలికి తీయాలని సుప్రీంకోర్టుకు వెళ్లింది వైవీ సుబ్బారెడ్డిగారేనని గుర్తు చేశారు. తప్పు చేసి ఉంటే ఛార్జ్‌షీట్‌లో ఆయన పేరు, భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరు ఉండేదని ప్రశ్నించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న భోలే బాబాకు టెక్నికల్ క్లియరెన్స్ ఇచ్చింది కూడా చంద్రబాబు గత ప్రభుత్వమేనని తెలిపారు.

హింస, దాడులు – పాలన వైఫల్యానికి నిదర్శనం

నిజాలను ప్రశ్నించిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై హత్యాయత్నాలు, దాడులు జరగడం చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యానికి నిదర్శనమన్నారు. పోలీసు వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని, రాజ్యాంగ పాలన కనుమరుగైందని తీవ్ర విమర్శలు చేశారు.

రాష్ట్రపతి పాలన విధించాలి

రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని, జంగిల్ రాజ్ కొనసాగుతోందని ఆరోపిస్తూ తక్షణమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top