గుంటూరు: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఆ పార్టీ నేతలు తెలిపారు. కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు నిరసనగా పెద్ద సంఖ్యలో ప్రజలు జగన్ పర్యటనకు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలను అదుపులో పెట్టాలనే ఉద్దేశంతో పాలన సాగిస్తున్నదని విమర్శించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయాలకు ఉపయోగించడం దురదృష్టకరమన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలకు వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ జగన్ పర్యటనకు వచ్చిన జనసునామీకి ధన్యవాదాలు తెలిపారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు ఉందంటూ కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు. సిట్ నివేదికలో జంతు కొవ్వు లేదని తేలిన తర్వాత ప్రభుత్వం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధించిన అధికారుల పేర్లు డిజిటల్ డైరీలో నమోదు చేస్తున్నామని, భవిష్యత్తులో పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగినప్పుడు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సంక్షేమం పూర్తిగా నిలిచిపోయిందని ఆరోపించారు. జగన్ పర్యటన సందర్భంగా నేతలను హౌస్ అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించారని పేర్కొన్నారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి సమయంలో పోలీసులు ఇదే స్థాయిలో స్పందించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని అన్నారు. కూటమి పాలనలో చట్టవ్యవస్థ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ కూటమి పాలనలో ఆటవిక రాజ్యం కొనసాగుతోందన్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ తిరుమల లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేయడమే కాకుండా అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరగడం దుర్మార్గమన్నారు. జగన్ పర్యటనకు తరలివచ్చిన అశేష ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు.