న్యూఢిల్లీ : తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీసేలా తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. తిరుమలను రాజకీయ రణక్షేత్రంగా మార్చడం ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డిల్లీలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో గురుమూర్తి మాట్లాడుతూ, ప్రస్తుతం వివాదంలో ఉన్న భోలే బాబా డైరీ, ప్రీమియర్ డైరీ వంటి సంస్థలు గత తెలుగుదేశం ప్రభుత్వ కాలం నుంచే తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తున్నాయని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు సరఫరాదారుల సిండికేట్‌ను అరికట్టి, పారదర్శక టెండర్ విధానం ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించామని వివరించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. నెయ్యి నాణ్యతపై అనుమానం వ్యక్తమైన వెంటనే అప్పటి టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి బాధ్యతాయుతంగా స్పందించి నమూనాలను మైసూర్‌లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎఫ్‌టిఆర్‌ఐ)కు పంపించినట్లు తెలిపారు. నాణ్యత లేని సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడం కూడా జరిగిందన్నారు. అయితే ప్రస్తుత టిడిపి ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ఆ నివేదికలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఎంపీ మండిపడ్డారు. నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ చార్జ్‌షీట్‌లోనే స్పష్టంగా ఉన్నప్పటికీ, వైయస్ఆర్‌సీపీపై బురద చల్లడమే లక్ష్యంగా టిడిపి అసత్య ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారని గురుమూర్తి ఆరోపించారు. వై.వి. సుబ్బారెడ్డి దేవునిపై అపార భక్తిశ్రద్ధలతో దేశవ్యాప్తంగా సుమారు రెండు వేలకుపైగా ఆలయాల నిర్మాణానికి కృషి చేసి హిందూ ధర్మ ప్రచారానికి సేవలందించారని కొనియాడారు. అలాంటి వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న వారికి స్వామివారే తగిన బుద్ధి చెబుతారని ఎంపీ గురుమూర్తి హెచ్చరించారు.