వక్ఫ్ ఆస్తులను పీపీపీ మోడ్‌లో అప్పగిస్తే ఊరుకోం

కూటమి ప్రభుత్వానికి వైయ‌స్ఆర్‌సీపీ మైనార్టీ విభాగం నేతల హెచ్చరిక

విజయవాడ: వక్ఫ్ ఆస్తులను పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానంలో అప్పగించే ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం నేతలు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు విజయవాడలోని వక్ఫ్ బోర్డు రాష్ట్ర కార్యాలయం వద్ద వైయ‌స్ఆర్‌సీపీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీ రుహుల్లా, గుంటూరు నగర వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు ఆస్తులు ముస్లిం సమాజానికి సంబంధించినవని, వాటిని పీపీపీ మోడ్‌లో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. కూటమి ప్రభుత్వం మైనార్టీల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని చూస్తోందని ఆరోపించిన నేతలు, వక్ఫ్ ఆస్తులపై ఏ విధమైన నిర్ణయాలు తీసుకునే ముందు ముస్లిం సమాజంతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. మైనార్టీల హక్కులు, ఆస్తులను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని, అవసరమైతే న్యాయపరంగా కూడా పోరాటం చేస్తామని వైయ‌స్ఆర్‌సీపీ మైనార్టీ విభాగం నేతలు హెచ్చరించారు.

Back to Top