‘జీరో టారీఫ్’ సుంకాలతో దిగుమతులు మ‌న రైతులకు శాపం 

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.వి.ఎస్ నాగిరెడ్డి ఆందోళ‌న‌

తాడేప‌ల్లి: విదేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ‘జీరో టారీఫ్’ సుంకాలతో దిగుమతి చేసుకోవడం దేశ రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వి.ఎస్ నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన పంటలైన ప్రత్తి, మొక్కజొన్న, సోయాబీన్‌, పప్పుధాన్యాలు, నూనెగింజలు, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ ఉత్పత్తులను అమెరికా నుంచి సుంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం రైతుల పాలిట మరణశాసనమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు శ‌నివారం ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

విదేశాల నుంచి దిగుమతి చేసే వ్యవసాయ ఉత్పత్తులు దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశించే ధర, దేశంలో అమలులో ఉన్న కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే కనీసం 10 శాతం ఎక్కువగా ఉండేలా దిగుమతి సుంకాలు విధించాల్సిన అవసరం ఉందని నాగిరెడ్డి పేర్కొన్నారు. లేకపోతే దేశీయ వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

దేశంలో అమలులో ఉన్న ఎంఎస్పీ విధానాన్ని పక్కన పెట్టి విదేశీ ఉత్పత్తులను జీరో టారీఫ్‌తో అనుమతిస్తే కోట్లాది మంది భారత రైతుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని ఆయన అన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొద్ది శాతం మంది విదేశీ కార్పొరేట్ వ్యవసాయ సంస్థలకు మాత్రమే లాభం చేకూరుతుందని విమర్శించారు.

ఇప్పటికే వివిధ వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతుల కారణంగా దేశీయ రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాగిరెడ్డి తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం సరైన విధానాలు రూపొందించి, దేశీయ వ్యవసాయాన్ని రక్షించే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Back to Top