సిట్‌ స్పష్టం చేసినా చంద్రబాబు దుష్ప్రచారమే

టీటీడీ చైర్మన్‌గా ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు

స్వామివారి ముందు ప్రమాణానికైనా, సత్యశోధన పరీక్షకైనా సిద్దమే

స్పష్టం చేసిన వైయ‌స్ఆర్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెట్టి

న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ లోక్‌సభ పక్షనేత పీవీ మిధున్‌రెడ్డి, ఎంపీలు ఎం.గురుమూర్తి, గొల్ల బాబూరావు.

నెయ్యి వ్యవహారంపై చంద్రబాబువన్నీ అబద్ధాలే

నిజానిజాలు తేల్చాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లింది నేనే

సీబీఐ సిట్‌ నివేదికతో అడ్డంగా దొరికిన చంద్రబాబు

అందుకే మరో కమిటీ పేరుతో రాజకీయ కుట్రకు తెర

తేల్చి చెప్పిన వైవీ సుబ్బారెడ్డి

న్యూఢిల్లీ: లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారంతో సీఎం చంద్రబాబు కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని వైయ‌స్ఆర్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. సీబీఐ ఆధ్వర్యంలోని సిట్, నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వులు లేవని ఛార్జి షీట్‌ దాఖలు చేసినా.. ఇంకా దుష్ప్రచారం చేస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. టీటీడీలో తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. దీనిపై స్వామి వారి ముందు ప్రమాణం చేయడంతో పాటు, సత్యశోధన పరీక్షకూ సిద్ధమేనని సవాల్‌ చేశారు. ఎన్‌డీడీబీ రిపోర్టు సహా సీబీఐ కూడా  నెయ్యిలో జంతు కొవ్వులు లేవని నివేదికిచ్చినా.. దీనిపై విచారణకు మరో కమిటీ ఏర్పాటు చేయడం రాజకీయ కుట్రేనని ఆయన తేల్చి చెప్పారు.
ఈ సందర్బంగా ఇంకా ఆయన ఏమన్నారంటే..:

చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదన్న సుప్రీంకోర్టు:
    లడ్డూ ప్రసాదంలో ఆవునెయ్యికి బదులు జంతుకొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు అత్యంత దారుణంగా కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బ తీశారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు ఆరోపణల మీద సీబీఐతో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాం. దీంతో కోర్టు సైతం ప్రసాదం అంశం కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి.. విచారణ పూర్తయ్యే వరకు ఎవ్వరూ దీనిపై వ్యాఖ్యానించవద్దని చెప్పడంతో పాటు.. ముఖ్యమంత్రి స్దానంలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న చంద్రబాబు ఈ రకమైన వ్యాఖ్యానాలు చేయడం సరి కాదని తప్పు బట్టింది. 

కల్తీ ఆరోపణలు ప్రభుత్వ పెద్దల కుట్రే:
    2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. నెయ్యి నాణ్యతా పరీక్ష నిర్వహించిన 4 ట్యాంకర్లలో జంతుకొవ్వు ఉందా? లేదా? ఉంటే దాన్ని లడ్డూ ప్రసాదం తయారీలో వాడారా? లేదా? అన్నదానిపై సమగ్రంగా దర్యాప్తు చేయమని ఆదేశించారు. తిరుమల లడ్డూల తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని స్వయంగా సీఎం చంద్రబాబు ఆరోపించిన నేపధ్యంలో.. సుప్రీంకోర్టును ఆశ్రయించాం. కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సీబీఐ సిట్, దర్యాప్తు కూడా పూర్తి చేసి, కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఆ రిపోర్టు ప్రకారం లడ్డూ ప్రసాదానికి వాడిన నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వులు కలవలేదని చెప్పింది. కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్‌ సమావేశంలో మరలా అవే మాటలు మాట్లాడింది.
    సుప్రీంకోర్టు ఒకవైపు కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బ తీయొద్దని చెప్పినా.. సీబీఐ ఛార్జిషీట్‌లో సైతం జంతు కొవ్వులు కలవలేదని స్పష్టం చేసినా, కూటమి ప్రభుత్వ పెద్దలు, మంత్రులు భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా గడిచిన పది రోజులగా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. అంతే కాకుండా వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జంతుకొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడి ఇన్ని లక్షల లడ్డూలు తయారు చేశారు. ఇన్ని కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సిట్‌ జంతుకొవ్వు లేదని చెప్పిన తర్వాత కూడా కేవలం వైయ‌స్ఆర్‌సీపీపై దుష్ప్రచారం చేయాలన్న కుట్రతోనే ఆ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ముమ్మాటికీ ప్రభుత్వ పెద్దల కుట్రే. 

పదే పదే అదే అబద్దపు ప్రచారం:
    కేబినెట్‌ సమావేశం పూర్తైన తర్వాత వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌తో పాటు, నా ఫోటో పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తాజా కేబినెట్‌ సమావేశం తర్వాత కూడా మంత్రులు మాట్లాడుతూ.. 2024లో ఎన్‌డీడీబీ ఇచ్చిన నివేదిక ప్రకారమే చంద్రబాబు అలా మాట్లాడారని వక్రీకరిస్తున్నారు. నెయ్యి ట్యాంకర్లు సరఫరా చేసింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే. రిపోర్టు కూడా కూటమి ప్రభుత్వంలోనే వచ్చింది.

నిపుణుల కమిటీ సూచనల మేరకే:
    2014–19 వరకు ఉన్న నెయ్యి సరఫరాకు సంబంధించిన టెండర్‌ నిబంధనలను సడలించారని చెబుతున్నారు. దానికి కారణం 2019లో మా హయాంలో నెయ్యి సరఫరాకు అనుకున్న మేరకు స్పందన రాకపోవడంతో అధికారులు 2017లో నియమించిన నిపుణుల కమిటీ సూచనల మేరకు నిబంధనలు సడలించారు. అయినప్పటికీ నెయ్యి నాణ్యతలో రాజీ లేకుండా చేయడం జరిగింది. అయితే దాని వల్లే భోలే బాబా వంటి కంపెనీలు వచ్చాయని మంత్రులు ఆరోపిస్తున్నారు.
    కానీ, నిజానికి ఆ నిబంధనలు సడలించిన తర్వాత కొత్తగా ఏ కంపెనీ రాలేదు. గతంలో చాలా కాలం నుంచి ఉన్నవే. నిపుణులు కమిటీ ఇచ్చిన రిపోర్టుల ప్రకారం నెయ్యి సరఫరాకు చిన్న కంపెనీలు కూడా వస్తున్నాయి. వాళ్లు పాలలో ఫ్యాట్‌ తీసి నెయ్యి తయారు చేసి అమ్ముతారు. అలాంటి  స్టార్టప్‌ కంపెనీలకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. 
అది కూడా మా మీద నెపం పెట్టారు. మీకు వేరే దురుద్దేశాలు ఉన్నాయి కాబట్టే మీరు నిబంధనల మార్పు చేశారన్న ఆరోపణ నిరాధారం. నాణ్యతలో ఏ మాత్రం రాజీ పడకుండా మరింత ఎక్కువ మందికి అవకాశం కల్పించాం.

ప్రమాణం. పరీక్ష. దేనికైనా సిద్దం:
    అదే విధంగా టీటీడీ బోర్డులో కొంతమందికి కల్తీ వ్యవహారంతో నాకు సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. దీనిపై గతంలోనే ను నేను స్పష్టం చేశాను. టీటీడీ పర్చేజింగ్‌తో సహా, ఏ కాంట్రాక్టుకు సంబంధించి కూడా అవినీతికి పాల్పడలేదు. దీనిపై నేను సాక్షాత్తూ శ్రీ వెంకటేశ్వరస్వామి వద్ద ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎలాంటి సత్యశోధన పరీక్షౖకైనా సిద్ధమే. ఇంకా నా మీద అలాంటి ఆరోపణలు చేస్తే దానిపై న్యాయపరంగా పోరాటం చేస్తాం.
    చిన్నప్పన్న నా పీఏ అని చెబుతున్నారు. చిన్న అప్పన్న 2014–18 వరకే నా పీఏగా పని చేశాడు. ఆ తర్వాత ఏపీ భవన్‌లో లైజన్‌ ఆఫీసర్‌గా పని చేశాడు. ఆ తర్వాత మరికొంత మంది ఎంపీల దగ్గర పీఏగా పని చేశాడని తెలిసింది. సిట్‌ అధికారులు నాతో సహా భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిని విచారించి,  మా ప్రమేయం లేదని స్పష్టంగా చెప్పారు.

మరో కమిటీ ద్వారా కుట్రకు తెర:
    దీంతో మరలా ప్రభుత్వం మరో విచారణ కమిటీ వేయాలని నిర్ణయించింది. అంటే కేవలం కుట్రపూరితంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలను ఇన్‌వాల్వ్‌ చేసి, వారిని దోషులుగా నిలబెట్టి.. మా పార్టీపై రాజకీయ కుట్రకు పాల్పడుతున్నారనడానికి ఇదే నిదర్శనమని వైవీ సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. 

పీవీ మిధున్‌రెడ్డి. వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ.
– ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేక వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందని ఆరోపించాడు. వైయ‌స్ఆర్‌సీపీపై బురద జల్లడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలన్న దురుద్దేశంతో ఏకంగా శ్రీ వెంకటేశ్వరస్వామిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. ఎలాంటి ఆధారాలు లేకుండానే స్వామి వారి ప్రసాదంపై ఆరోపణలు చేయడం అత్యంత దుర్మార్గం. చంద్రబాబుతో పాటు కూటమి నేతలంతా ఇవే మాటలు చెప్పారు. ఇది ఘోరమైన తప్పిదం. దీన్ని మొదట నుంచి వైయ‌స్ఆర్‌సీపీ తప్పు పడుతూ వస్తోంది.
ఈ అంశంపై దర్యాపు చేసిన సీబీఐ ఆధ్వర్యంలోని సిట్‌.. లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వులు లేవని కోర్టుకు ఛార్జి షీట్‌ని సమర్పించింది. దీంతో తప్పుడు ఆరోపణలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు, కూటమి నేతలు ఆత్మరక్షణలో పడి మరోసారి ఫ్లెక్సీలు, హోర్డింగులు ద్వారా దుష్ప్రచారానికి పూనుకున్నారు. మరోవైపు  సీబీఐ సిట్‌ జంతుకొవ్వులు లేవని తేల్చడంతో మరో విచారణ కమిటీ నిర్వహించడానికి సిద్దమయ్యారు. 
అత్యంత నిష్టా గరిష్టంగా హిందూమతాన్ని ఆచరించే వైవీ సుబ్బారెడ్డి మీద తప్పుడు ఆరోపణలు చేయడం హేయం. దేవుడ్ని వాడుకుని రాజకీయాలు చేసే సంçస్కృతిని విడిచిపెట్టాలి. ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకుని ప్రజలకు మేలు చేసే అంశాలపై దృష్టి పెట్టాలి.

ఎం గురుమూర్తి. వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ.
– కూటమి ప్రభుత్వం కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్ధాన్ని రాజకీయ రణక్షేత్రం చేస్తోంది. భోలే బాబా, ప్రీమియర్‌ డెయిరీలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి నెయ్యి సరఫరా చేస్తున్నాయి. తన హయాంలో వచ్చిన ఫిర్యాదు మేరకు నెయ్యి నాణ్యతపై పరీక్ష నిర్వహించాలని తాను చైర్మన్‌గా ఉన్నప్పుడు సీఎఫ్‌టీఆర్‌ఐ కి సుబ్బారెడ్డిగారు లేఖ రాశారు. అప్పుడే భోలేæబాబా డెయిరీని బ్లాక్‌ లిస్టులో కూడా పెట్టారు. అలాగే 2024 లో జూలైలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యతా ప్రమాణాలు లేని నెయ్యి ట్యాంకులను వెనక్కి పంపించారు. మీ ప్రభుత్వ హాయంలో జరిగిన దాన్ని మా పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేయడం సబబు కాదు. అలా వెనక్కి పంపించిన 4 ట్యాంకుల నెయ్యిని మరలా బ్యాక్‌ డోర్‌ ఎంట్రీతో, వేరే ఇన్‌ వాయిస్‌ లతో తీసుకొచ్చి వాడిని లడ్డూ తయారీలో వాడి, ఆ నెపాన్ని వైయ‌స్ఆర్‌సీపీ పై నెట్టడం దుర్మార్గం.
వైయ‌స్ఆర్‌సీపీ పై రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఆరోపణలకు పాల్పడ్డారు. మీరు ఇచ్చిన హామీల అమల్లో విఫలమై.. దాన్నుంచి ప్రజల దష్టిని మరల్చడానికే తప్పుడు ఆరోపణలకే ఏకంగా దేవుడ్నే రాజకీయాల్లోకి లాగారు. తీరా సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ సిట్, ఎలాంటి జంతుకొవ్వులు లేవని ఛార్జిషీట్‌ కోర్టుకు నివేదించడంతో దాన్ని జీర్ణించుకోలేని టీడీపీ కొత్త దుష్ప్రచారానికి తెరలేపింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ కుట్రే. మీరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని స్వామి వారి గమనిస్తున్నారు.. ఆయన తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ గొల్ల బాబూరావు
– తిరుమల ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందన్న చంద్రబాబు ఆరోపణల వెనుక రాజకీయ కుట్రకోణం దాగుంది. కేవలం వైస్సార్సీపీని రాజకీయంగా దెబ్బ తీయాలన్న దురుద్దేశంతో ఈ ఆరోపణలు చేసిన బాబు.. సీబీఐ సిట్‌ తన ఛార్జ్‌షీట్‌ ద్వారా లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వులేదని చెప్పిన తర్వాత ఎవరూ దానిమీద మాట్లాడరు. కానీ ఇవాల్టికీ చంద్రబాబు సహా కూటమి నేతలు జంతుకొవ్వులు కలిసాయని అబద్దాలు చెబుతూ కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారు. తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ సహా కూటమి నేతలు భూస్దాపితం కావడం ఖాయం. తాను సత్యశోధన పరీక్షకు సిద్దమని మా పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చేసిన సవాల్‌ను దమ్ముంటే స్వీకరించాలి.

Back to Top