కోవూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. గంజాయి బ్యాచ్ అరాచకానికి ఓ బాలిక బలైపోయింది. ఇద్దరు మృగాళ్లు కలిసి ఓ బాలికను గ్యాంగ్ రేప్ చేశారు. బాధితురాలి పరిస్థితి విషమించగా వారం రోజులపాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి చివరికి శుక్రవారం ప్రాణాలు విడిచింది. అయితే, నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి అరెస్టుచేసిన పోలీసులు.. బాధిత కుటుంబం ఇంటికి వైయస్ఆర్‌సీపీ నేతలు వస్తున్నారన్న సమాచారంతో బాలిక మృతి ఘటన ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని వారు కేసు తారుమారుకు యత్నాలు ప్రారంభించారు. బాలిక తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి వారితో మరో రకంగా ఫిర్యాదు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ప్రేమ వ్యవహారం అంటగట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పోలీసుల తీరుతో అర్ధమవుతోంది. జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటన వివరాలు.. ఏం జరిగిందంటే.. కోవూరు పంచాయతీ పరిధిలోని గుమ్మళ్లదిబ్బ కొత్తకాలనీకి చెందిన ఎస్‌కే రసూల్ దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అరీఫా (12) గత నెల 30వ తేదీ (శుక్రవారం) రాత్రి దుకాణానికి వెళ్లొస్తుండగా, గంజాయికి బానిసలైన అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలురు ఆమెపై కన్నేశారు. బాలికను సమీపంలోని చెట్ల పొదల్లోకి బలవంతంగా లాక్కెళ్లి వైట్నర్ కలిపిన నీటిని బలవంతంగా తాగించారు. బాలిక స్పృహ కోల్పోగానే వారు విచక్షణ మరిచి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. స్పృహలోకి వచి్చన తర్వాత ఆ చిన్నారి జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు వివరించింది. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. అప్పటికే బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో తొలుత కోవూరు ప్రభుత్వాస్పత్రికి అక్కడ నుంచి నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. పరిస్థితి క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా ఐసీయూలో మృత్యువుతో పోరాడిన ఆ బాలిక చివరికి శుక్రవారం ప్రాణాలు విడిచింది. తమ బిడ్డకు మత్తు ద్రావణం తాగించి దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు తారుమారుకు పోలీసుల యత్నం బాలిక మృతి చెందడంతో చెన్నైలోనే పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అనంతరం శనివారం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించనున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వాకబు చేసినట్లు సమాచారం. అయితే, బాలిక స్వగ్రామానికి కాకాణి శనివారం వెళ్లనున్నారనే సమాచారంతో పోలీసులు కేసు తారుమారు చేసేందుకు ప్రయతి్నస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా బాలిక కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఆమెకు ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా కథలు అల్లుతున్నట్లు తెలుస్తోంది. పోక్సో కేసు నమోదు.. రేప్ జరగలేదంటూ బుకాయింపు.. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు, ఘటనా స్థలాన్ని సైతం పరిశీలించారు. అక్కడ కొన్ని ఆధారాలు సేకరించి, మైనర్లు అయిన ఇద్దరు నిందితులపై పోక్సో కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చారు. అయితే, గంజాయి బ్యాచ్ అరాచకాల విషయంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకే అవకాశం ఉండడం వల్ల కూడా వారు కేసు తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విచ్చలవిడిగా గంజాయి ఆగడాలు.. మరోవైపు.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి రవాణా, విక్రయాలు, అరాచకాలు, ఆగడాలు మితిమీరాయి. అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు, ఎక్సైజ్ శాఖలు అవినీతి మత్తులో జోగుతున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరులో గంజాయి నిరోధక ఉద్యమకారుడు పెంచలయ్యను ఇటీవలే గంజాయి విక్రేతలు దారికాచి తరిమితరిమి కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షితోపాటు ఆమె సోదరుడు, అనుచరులు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. ఇక గంజాయి విక్రయ మూలాలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారనడానికి తరచూ భారీస్థాయిలో పట్టుబడుతున్న గంజాయే నిదర్శనం. నిజానికి.. నెల్లూరు నగరానికి పక్కనే ఉన్న కోవూరు అడ్డాగా గంజాయి విక్రయాల దందా జరుగుతోంది. ఒడిశా నుంచి రైళ్లల్లో, బస్సుల్లో తెస్తూ.. పడుగుపాడు, ఇనమడుగు ప్రాంతాల్లో విక్రేతలు పాగా వేసి విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఆ ఇద్దరే కారణం.. మా బిడ్డకు జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగకూడదు. అభం శుభం తెలియని మా బిడ్డపైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. చిన్న బిడ్డకు ప్రేమ వ్యవహారం అంటకట్టడం చాలా పాపం. అవన్నీ తప్పుడు ప్రచారం. మా బిడ్డను కొందరు బలవంతంగా తీసుకెళ్లి ఇబ్బందికి గురిచేసిన విషయం నిజమే. అందుకే కోవూరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మా బిడ్డ చనిపోవడానికి కారణం ఆ ఇద్దరు పిల్లలే. వారిని కఠినంగా శిక్షించాలి. – ఎస్‌కే రసూల్, బాలిక తండ్రి మా బిడ్డకు ఇలా జరగడం దారుణం.. పోయిన శుక్రవారం ఏదైనా కొనుక్కుంటానంటే నేనే రూ.10 ఇచ్చి పంపాను. దుకాణానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు పిల్లలు బలవంతంగా తీసుకెళ్లి మత్తు నీళ్లు తాగించడంతో చెట్ల పొదల మధ్యన పడిపోయింది. గంటసేపైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెంది అంతా వెతికాం. ఇంతలో ఇద్దరు పిల్లలు అక్కడ కూర్చొని ఉంటే అడిగాం. ముందు చూపిస్తామని, ఆ తర్వాత మాకు తెలియదని చెప్పారు. చివరకు చెట్ల పొదల్లో చూడగా అక్కడ మా బిడ్డ స్పృహలేకుండా పడిపోయి ఉంది. అప్పుడు కోవూరు ఆస్పత్రికి తీసుకెళ్లాం. పరిస్థితి ఇబ్బందిగా ఉంటే.. నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడ కూడా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో చెన్నైకు తీసుకెళ్లమన్నారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. మా కళ్ల ముందు ఆడుకుంటున్న బిడ్డకు ఇలా జరగడం దారుణం. – బాలిక పిన్ని అంతా అబద్ధం గుమ్మళ్లదిబ్బలో బాలికపై అసలు అత్యాచారమే జరగలేదు. అదంతా అబద్ధం. ఆ బాలికకు బాలుడితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఆ బాలిక తన స్నేహితులతో ఉంటూ పొద్దుపోయే వరకు ఇంటికి వెళ్లకపోవడంతో ఇంట్లో వాళ్లు తిడతారేమోనని సమీపంలో ఉన్న గుర్తుతెలియని లిక్విడ్ తాగింది. ఆ కారణంగానే చనిపోయింది. – సుధాకర్‌రెడ్డి, కోవూరు సీఐ రాష్ట్రం గంజాయికి అడ్డాగా మారింది.. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. మా ప్రభుత్వ హయాంలో గంజాయి, అక్రమ మద్యాన్ని ఉక్కుపాదంతో అణిచివేశాం. కానీ, నేడు చంద్రబాబు కనుసన్నల్లో రాష్ట్రమంతా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. ఈ మత్తు పదార్థాలవల్ల పసిబిడ్డల ప్రాణాలు సైతం గాలిలో కలిసిపోతుంటే ఈ ప్రభుత్వానికి కనికరంలేదు. కూటమి ప్రభుత్వ అక్రమాలకు కొందరు పోలీసులు వంతపాడటం సిగ్గుచేటు. బాలిక అత్యాచారం కేసును పక్కదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయతి్నస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తేలేదు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. – నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీమంత్రి