విజయవాడ : కృష్ణలంక ప్రాంతానికి చెందిన గాదె సాయికృష్ణ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేయాలని, ఈ ఘటనలో బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా అడ్మిన్ డీసీపీకి వైయస్ఆర్‌సీపీ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ కృష్ణలంక ప్రాంతానికి చెందిన గాదె సాయికృష్ణ గత కొన్ని రోజులుగా కనిపించడం లేదని తెలిపారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, పోలీసుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కోర్టు కూడా సాయికృష్ణను తమ ముందు హాజరుపరచాలని ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఈ ఘటనలో దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు. "ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా?" అని ప్రశ్నించిన ఆయన, విజయవాడ పోలీసుల వ్యవహారశైలిపై ఇప్పటికే అనేక ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. సివిల్ సెటిల్‌మెంట్లు, స్టేషన్ సెటిల్‌మెంట్లతో పోలీసులు బిజీగా మారిపోయారని విమర్శించారు. సాయికృష్ణ ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ చట్ట ప్రకారం శిక్షించడానికి కోర్టులు ఉన్నాయని, కానీ అదృశ్యమైన ఘటనపై నిజానిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ గాదె సాయికృష్ణ కనిపించడం లేదని ఆయన తల్లి చెబుతున్న విషయాల ఆధారంగా వాస్తవాలు బయటపడాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటి వద్ద నుంచి తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని, తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగానే వారు పోలీసులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సాయికృష్ణ ఎక్కడ ఉన్నారో పోలీసులు వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆయన, నగరంలో పోలీసుల పనితీరుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. "సాయికృష్ణ సురక్షితంగా ఉంటే ప్రజల ముందుకు తీసుకురండి" అని కోరారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, హోంమంత్రి కూడా నోరు విప్పి మాట్లాడాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. సాయికృష్ణ కుటుంబానికి వైయస్ఆర్‌సీపీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు.