వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియాపై ఆంక్షలు తొలగించాలి

విజయవాడలో వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఆందోళన

భావప్రకటన స్వేచ్ఛను కాలరాస్తున్నారని మండిపాటు

విజయవాడ: వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా వేదికలపై ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ పార్టీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తిరువూరు వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాస్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దొడ్డా అంజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. "రెడ్‌బుక్" పేరుతో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన వారికి రాజ్యసభ పదవులు ఇస్తున్నారని ఆరోపిస్తూ, చింతకాయల విజయ్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించారు. వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా పేజీలపై విదేశాల నుంచి ఫిర్యాదులు చేయిస్తున్నారని ఆరోపించిన ఆయన, 800 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేశారని అన్నారు. కోర్టులను ఆశ్రయించి తమ సోషల్ మీడియా పేజీలను తిరిగి పునరుద్ధరించుకుంటామని స్పష్టం చేశారు. ఫేస్‌బుక్ పేజీలను నిలిపివేయవచ్చేమో గానీ, వైఎస్ జగన్‌పై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని అడ్డుకోలేరని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ కూటమి పాలనలో గత రెండేళ్లుగా వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. ప్రభుత్వ వేధింపులను తట్టుకుని పార్టీ ముందుకు సాగుతోందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. వెంటనే వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా పేజీలపై ఉన్న ఆంక్షలను తొలగించి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ వైయ‌స్ఆర్‌సీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలపై ప్రభుత్వం దాష్టికం ప్రదర్శిస్తోందన్నారు. ఇప్పటికే 800 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేసి, 58 మందిని అన్యాయంగా రిమాండ్‌కు పంపించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ అక్రమాలను ప్రజలకు తెలియజేస్తున్నందుకే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా పేజీలపై ఆంక్షలు విధించడం అప్రజాస్వామికమని అన్నారు. గతంలో టీడీపీ, జనసేన సోషల్ మీడియా వేదికలపై ఇలాంటి చర్యలకు తాము పాల్పడలేదని గుర్తు చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అందరికీ భావప్రకటన స్వేచ్ఛ కల్పించిందని, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలిసిపోతాయనే భయంతోనే సోషల్ మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

తిరువూరు వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా పేజీని దేశంలో కనిపించకుండా చేయడం దారుణమన్నారు. భావప్రకటన స్వేచ్ఛను ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజల స్వేచ్ఛను హరించే చర్యలను సహించబోమని హెచ్చరించారు. వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా వేదికలపై విధించిన ఆంక్షలను వెంటనే తొలగించి, అధికారిక పేజీలను పునరుద్ధరించాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
 

Back to Top