అనంతపురం: కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుందని సంబరాలు చేసుకోవడం కంటే ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని మాజీ మేయర్ మహమ్మద్ వసీం సూచించారు. జిల్లా వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, రెండేళ్లు గడిచినా ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి ఇప్పుడు రెండేళ్ల పాలన పేరుతో సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెండేళ్ల పాలనలో నగర ప్రజా సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలోని అనేక ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయని, అయినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. కాలువలు పొంగిపొర్లి అనేక కాలనీల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి సమయంలో ప్రజల కష్టాలను పట్టించుకోకుండా సంబరాలు చేసుకోవడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. గతంలో వైయస్ఆర్‌సీపీ పాలకవర్గం ఉన్న సమయంలో ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల భారీ వర్షాలు వచ్చినా సమస్యలను వెంటనే పరిష్కరించేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం రాంనగర్ అంబేద్కర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో రెండు రోజులుగా వర్షపు నీరు నిల్వ ఉన్నా సమస్య పరిష్కారానికి చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో ఇలాంటి సమస్యలపై హడావుడి చేసిన వారు, రెండేళ్లు గడిచినా శాశ్వత పరిష్కారం చూపలేకపోయారని ఆయన ప్రశ్నించారు. నగర ప్రజలందరి ఓట్లతో ఎన్నికైన ఎమ్మెల్యేకు అన్ని ప్రాంతాల సమస్యలను పరిష్కరించే బాధ్యత ఉందన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత వ్యవహారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించిన మహమ్మద్ వసీం, నగర ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా స్పందన కనిపించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ సమావేశంలో వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్, మాజీ కార్పొరేటర్లు కమల్ భూషణ్, ఇషాక్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.