తాడేపల్లి: తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారానికి సిట్ రిపోర్ట్ తో చెక్ పడిందని, కథ అడ్డం తిరిగింది కాబట్టి ఇప్పుడు విచారణ కమిటీ అంటున్నారని మాజీ మంత్రి, కృష్ణాజిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. సిట్ ప్రభుత్వాన్ని తదుపరి చర్యలు తీసుకోమని చెప్పలేదని, దోషులపై చర్యలు తీసుకోవాలని మాత్రమే చెప్పిందని ఆయన గుర్తుచేశారు. సిట్ రిపోర్ట్ లో వైయస్ జగన్ మోహన్ రెడ్డికానీ, ఇతర వైసీపీ నేతల పేర్లు ఎక్కడైనా ఉన్నాయా అని పేర్ని నాని ప్రశ్నించారు. ఏమీ లేకపోయినా రాజకీయం కోసం వైయస్ఆర్‌సీపీపై మూకుమ్మడిగా విష ప్రచారానికి దిగారని అన్నారు. ప్రెస్ మీట్ లో పేర్ని నాని ఇంకేమన్నారంటే.. చంద్రబాబు డ్రామాలకు సుప్రీంకోర్టు చెక్ నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిశాయని అబద్ధాలు చెప్పిన చంద్రబాబు.. తన ప్రభుత్వం ద్వారా సిట్ ను నియమించి వాటినే రిపోర్ట్ లో ఇచ్చేద్దామని అనుకున్నారని, కానీ సుప్రీంకోర్టు సిట్ నియామకంతో ఆయన ఆటలు సాగలేదన్నారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ కాబట్టి అన్నీ తేలిపోయే సరికి.. చంద్రబాబు తనను తదుపరి చర్యలు తీసుకోమని చెప్పిందంటున్నారు. కానీ సిట్ చెప్పింది తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోమని. ఈ దోషుల్లో మీరు ఇంతగా విషం చిమ్ముతున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పేరు ఉందా అని అడుగుతున్నాం. ఈ సిట్ రిపోర్ట్ లో వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారి పేరు కానీ, అప్పటి దేవాదాయమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేరు కానీ, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టీటీడీ ఈవో, జేఈవో ఎవరి పేర్లు ఉన్నాయో చెప్పండి. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సిఫార్సు చేసిన అధికారులే ఇందులో ఉన్నారు. ఈ పాపం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారెకి ఆపాదించేందుకు మీరు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నెయ్యి కిలో రూ.291 కే మీరు కొనలేదా? శ్రీవారి ప్రసాదంలో కెమికల్స్ కలిశాయని, మార్కెట్ కన్నా తక్కువ రేటు 319 రూపాయలకు ఎలా ఆవునెయ్యి కొన్నారని అడుగుతున్నారు. తక్కువ రేటుకు నెయ్యి కొన్నారు కాబట్టి కల్తీ జరిగిందంటున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో టీటీడీలో ఇద్దరు అధికారులు హర్ష్ ఫ్రెష్ అనే డెయిరీని 2019 ఫిబ్రవరిలో ఆమోదిస్తే...ఆ తర్వాత వచ్చిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు. ఫిబ్రవరి తర్వాత మాదే ప్రభుత్వం అయితే మేలో ఈసీతో పోట్లాడి కేబినెట్ మీటింగ్ ఎలా పెట్టారు, ఎలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు, పోలింగ్ తర్వాత కూడా మీ ప్రభుత్వం యాక్టివ్ గానే పనిచేసింది. 2019లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కాకముందే మీ ఆపద్ధర్మ ప్రభుత్వంలోనే ఈ హర్ష్ ఫ్రెష్ డెయిరీని తీసుకొచ్చింది. అదే ఆ తర్వాత భోలే బాబా డెయిరీగా పేరు మార్చుకుంది. అప్పట్లో వీళ్లు కొన్నది డబ్బాల్లో కాదు ట్యాంకర్లలోనే. 82 వేల కేజీలు ట్యాంకర్లలో, 12,300 కేజీలు డబ్బాల్లో కొన్నారు. అప్పట్లో 291 రూపాయలకు ఎలా కొన్నారు? మా హయాంలో 319, 329 రూపాయలకు కొంటే తప్పంటున్నారు. రోజుకో మతం పేరుతో పవన్ డ్రామా పవన్ కళ్యాణ్ ఉచ్చనీచాలు మరిచి విషం చిమ్మే వ్యక్తి. క్రిస్టియన్ అంటారు, బాప్టిజం తీసుకున్నా అంటారు. నన్ను, చంద్రబాబును తిడుతుంటే మీరు కాచుకోరా అంటూ పవన్ కళ్యాణ్ ఆయన అన్నయ్యను తిట్టారని జనసేన నేతలే చెప్తున్నారు. దేవుడంటే భయం లేని జనం ఇవాళ మాట్లాడుతున్నారు. అదే అన్నయ్య గతంలో దేవుడే లేడని అంటాడు, అందుకే దేవుడ్ని విమర్శించను, లేని వారి గురించి ఎలా మాట్లాడతాను అంటాడు. తమ్ముడు కోటింగ్ ఇచ్చాక బయటికి వచ్చి నేను సనాతన హిందువు, వైయస్ జగన్ మోహన్ రెడ్డి క్రిస్టియన్ అంటూ దిగజారి మాట్లాడుతున్నాడు. రామతీర్ధంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసిన వాళ్లెవరో పవన్ కు తెలియదా?, ఈ ఘటన తర్వాత నెల రోజుల్లో కొత్తగా విగ్రహం చేయించి హైందవ సంప్రదాయాల ప్రకారం ప్రభుత్వం పునఃప్రతిష్టించిన విషయం తెలియదా ? అంతర్వేది రథం కాల్చారంటూ మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ కు మీ ప్రభుత్వంలో తాడేపల్లి గూడెం పక్కన పెంటపాడులో రథం తగులబెడితే చర్యలు తీసుకున్నారా ? అంతర్వేదిలో దగ్ధమైన రథాన్ని మేం మళ్లీ ఉత్సవాల కల్లా కొత్తది చేయించి పెట్టాం. మీరు పెంటపాడులో రథం తిరిగి చేయించారా ? గుళ్లు ధ్వంసం చేసిన చరిత్ర చంద్రబాబుదే 2015-16లో విజయవాడలో కృష్ణా పుష్కరాల పేరుతో ఆలయాల్ని ధ్వంసం చేసిన చంద్రబాబు, ఇప్పుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి 250 గుళ్లు ధ్వంసం చేశారని చెప్పడానికి సిగ్గుందా ? మతం పేరుతో విషం చిమ్ముతున్న మీ ప్రభుత్వంలో జరిగిన ఘటనలే కదా ఇవి. ఉత్సవమూర్తులే కాదు గర్భగుడిలో ఉన్న మూర్తుల్ని కూడా ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన గుళ్లలో కనీసం సంప్రోక్షణ చేశారా, అపచారం చేశామని చెంపలు వాయించుకున్నారా, ఎక్కడైనా మెట్లు కడిగారా ? మీరు కూలదోసిన ప్రతీ ఆలయాన్ని వైయస్ జగన్ మోహన్ రెడ్డి తిరిగి నిర్మించారు. దేవుడి మీద పగ పెట్టుకున్నారంటున్న పవన్.. దేవుడిని అడ్డుపెట్టుకుని ఆయనపై రాజకీయాలు చేస్తున్నందుకు ఏమైపోతారో ఆలోచించుకోవాలి. అయోధ్యకు జంతుకొవ్వు, పందికొవ్వుతో లక్ష లడ్డూలు పంపించారని పవన్ ఈ రోజుకూ మాట్లాడుతున్నారు. ఇంతకన్నా నీచమైన రాజకీయం ఉంటుందా ?, నాటి టీటీడీ బోర్డు సభ్యులు సౌరభ్ బోరా, మైహోం రామేశ్వరరావు అయోధ్యకు శ్రీవారి ప్రసాదం లక్ష లడ్డూలు పంపిద్దామని చెప్పి అందుకు కావాల్సిన శ్రేష్టమైన 2 వేల కిలోల నెయ్యిని వారే సేకరించి తెచ్చుకున్నారు. ఈ నిర్ణయానికీ, మా ప్రభుత్వానికీ సంబంధం లేదు, ఇది కేవలం టీటీడీ బోర్డు నిర్ణయమే. కానీ పవన్ కళ్యాణ్ కొవ్వుతో చేసిన లడ్డూలు పంపించారని ఇవాళ్టికీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి హిందూ ధర్మాన్ని గౌరవించలేదంటున్న పవన్ .. తోలు బూట్లు వేసుకుని దేవుడికి పూజలు చేస్తూ హారతిస్తున్న మీ మిత్రుడు చంద్రబాబును ఏమంటారు ?,చిన్న గుళ్లలోనూ చెప్పులు తీసి పూజలు చేసేది వైయస్ జగన్ మోహన్ రెడ్డి. తల్లితండ్రులు చనిపోయినా తలనీలాలు ఇవ్వని పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నట్లా? చెప్పాలి.ఇవాళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు రాజకీయాల్లో పతనానికి పరాకాష్ట. తిరుమలను దివ్యక్షేత్రంగా ప్రకటించింది వైయస్ఆర్ 2007 జూన్ 2న తిరుమల ఏడు కొండల్ని దివ్యక్షేత్రం అని పిలవాలి, ఆ కొండల మీద అన్యమత ప్రచారం చేయడం నిషిద్ధమని రాజశేఖర్ రెడ్డి జీవో ఇచ్చింది నిజం కాదా ? నాడు వైఎస్సార్ ఏడు కొండల్ని రెండు కొండలు అన్నారంటూ ఇప్పుడు చంద్రబాబు, పవన్ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు సర్వనాశనం అయిపోయేది, మట్టికొట్టుకుపోయేది ఎవరో పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఇంట్లో నుంచి చూస్తుంటే ఏడు కొండలు కనిపిస్తాయని, భక్తిపారవశ్యం చెందుతున్నట్లు చెబుతున్న చంద్రబాబు మాటలు వందకోళ్లను తినేసే తోడేలు సాయంత్రం ప్రవచనాలు చెప్తున్నట్లుంది. మీ మాటలు నమ్మట్లేదని పవన్ కళ్యాణ్ తో చెప్పిస్తున్నట్లున్నారు, జనం ఆయన మాటలు కూడా ఎప్పుడో నమ్మడం మానేశారు. జంతుకొవ్వు కలిసిన నెయ్యి ఎందుకు వాడారు? నెయ్యిలో కొవ్వు కలిసిందని అడిగితే ఎవరు చెప్పారని ఎదురు ప్రశ్నిస్తున్న చంద్రబాబు.. అదే నిజమని మరోసారి చెప్పాలని అడుగుతున్నాం. వేంకటేశ్వరస్వామి తన మనసులో దహించేయడం వల్లే ప్రెస్ మీట్లో అస్మదీయులు అడుగుతున్న ప్రశ్నల్ని కూడా భరించలేక చంద్రబాబు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మీరు టీటీడీని ప్రక్షాళన చేయమని బాధ్యతలు అప్పగించిన ఈవో శ్యామలరావు అక్కడ ఎందుకు లేరు ? చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నియమించిన ఈవో శ్యామలరావు నాలుగు ట్యాంకర్ల నెయ్యి కల్తీ జరిగిందని వెనక్కి పంపేశామని, వాటి శాంపిల్స్ ఎన్డీడీబీ ల్యాబ్ కు పంపితే వనస్పతి ట్రేసెస్ ఉన్నాయని తేలిందని చెప్పారు. ఇందులో ఆయన జంతువుల కొవ్వు కలిసిందని ఎక్కడా చెప్పలేదు, కేవలం వనస్పతి కలిసిందని మాత్రమే చెప్పారు. జంతుకొవ్వు కలిసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపామని లోకేష్, చంద్రబాబు చెప్పారు. ఆవునెయ్యి కాకుండా జంతువుల కొవ్వు, నాసిరకం సరుకులతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి లడ్డూలు చేయించారని, మేం నాలుగు లారీల్ని వెనక్కి పంపామని చెప్పుకున్నారు. ఏఆర్ డెయిరీ నుంచి తెప్పించి వెనక్కి పంపిన నాలుగు లారీలు వైష్ణవీ డెయిరీకు వెళ్లాయని సిట్ రిపోర్ట్ లో చెప్పారు. ఈ విషయం భోలేబాబా వాళ్లే విచారణలో చెప్పారు. నెల రోజుల పాటు ఈ నాలుగు ట్యాంకర్లు కాళహస్తిలోని ఓ పెట్రోల్ బంకులో నిల్వ ఉంచి, చివరికి సీలూ తీయకుండా, సరుకూ మార్చకుండా తిరిగి వైష్ణవీ డెయిరీ పేరుతో కొండపైకి పంపారు. లడ్డూల్లో కలిపేశారు. ఇప్పుడు చెప్పండి ఎవరు పాపాత్ములో?, ఎవరు మట్టికొట్టుకుపోవాలి, సర్వనాశనం అవుతారో చెప్పండి. జంతువుల కొవ్వు ప్రచారం మీ నలుగురిదే వైయస్ జగన్ మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని, వెంకటేశ్వర స్వామికి హిందూ భక్తుల్ని తగ్గించేయడానికే ఇదంతా చేశారని నిర్లజ్జగా పిచ్చిమాటలాడుతున్న మీకు.. కల్తీ నెయ్యి నాలుగు ట్యాంకర్లు వాడి లడ్డూలు తయారు చేసినా నీచం అనిపించదు. జంతువుల కొవ్వు లేదని ఎవరు చెప్పారని అడుగుతున్న చంద్రబాబుకు ఉందని ఎవరు చెప్పారో బయటపెట్టాలి. చంద్రబాబు, పవన్, లోకేష్, పురందేశ్వరి తప్ప నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఎవరూ చెప్పలేదు. 80 ఏళ్ల వయసులో ఏం మూటగట్టుకుపోదామని చంద్రబాబూ ఈ డ్రామాలు ?, పవన్ కళ్యాణ్ ఒక్కో దశలో ఒకలా క్రిస్టియన్, ముస్లిం, సిక్కు, హిందువు అని మాట్లాడుతుంటారు. పీఏ అప్పన్నకు 4 కోట్ల 65 లక్షలు వచ్చాయని చంద్రబాబు చెప్పారు, ఈడీ మీ పీఏ శ్రీనివాస్ కు 2 వేల కోట్లు వచ్చాయని చెప్పింది మర్చిపోతున్నారు. ఈ ఆరోపణ రాగానే ఆయన విదేశాలకు పారిపోయాడు. మీరు తిరిగి ముఖ్యమంత్రి కాగానే అమెరికా నుంచి తిరిగి ఇక్కడ వాలిపోయాడు. వైయస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయం కోసం దెబ్బతీసి తానూ, తన కొడుకూ కలకాలం అధికారంలో ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న అపచారాల్ని ప్రశ్నించాలని, కట్టడి చేయాలని అడగమని రాష్ట్రంలో స్వామీజీల్ని, ప్రవచనకారుల్ని, హైందవ వాదుల్ని పేర్ని నాని కోరారు.