గీతం యూనివర్సిటీకి భూముల బదలాయింపుపై స్పష్టత ఇవ్వాలి 

జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు 

విశాఖపట్నం: గీతం యూనివర్సిటీ అదీనంలో ఉన్న భూములపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు. గీతం ఆక్రమణలో ఉన్న భూముల విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ భూముల పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని కోరారు.ఈ సందర్భంగా కేకే రాజు ఆధ్వర్యంలో నియోజకవర్గ సమన్వయకర్తలు, శాసన మండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, కార్పొరేటర్లతో కలిసి గౌరవ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు.  ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఎండాడ – రుషికొండ గ్రామాలకు సంబంధించిన 54 ఎకరాలు 79 సెంట్ల ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేటు యూనివర్సిటీ అయిన గీతం యూనివర్సిటీకి బదలాయించేందుకు ప్రతిపాదనలు రావడం విశాఖ ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నారు. విశాఖపట్నం రూరల్ తహసీల్దారు ద్వారా జీవీఎంసీ కమిషనర్‌కు భూమి బదలాయింపు ప్రతిపాదన పంపించారని తెలిపారు.

జనవరి 30న జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనను 15వ అంశంగా అజెండాలో చేర్చారని, ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చ లేకుండానే సభ్యుల స్పష్టమైన ఆమోదం లేకుండా ఏకపక్షంగా ఆమోదించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ భూమి బదలాయింపును విశాఖపట్నం ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని జిల్లా కలెక్టర్‌కు స్పష్టం చేసినట్లు తెలిపారు. మొత్తం 54 ఎకరాలు 79 సెంట్లలో ఎంత ప్రభుత్వ భూమి ఉందో, అందులో గెడ్డ పోరంబోకు భూమి ఎంత ఉందో, ఎస్‌ఐఓడీ భూమి ఎంత మేరకు ఉందో పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్‌పై ఉందని గుర్తు చేస్తూ ఈ భూమి బదలాయింపును వెంటనే నిలిపివేయాలని కోరారు. గీతం యూనివర్సిటీకి భూమి బదలాయింపు అంశంపై ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ న్యాయమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, శాసన మండలి సభ్యులు కుంభ రవిబాబు, డిప్యూటీ మేయర్ కట్టమురి సతీష్, ఎస్‌సీసీ సభ్యులు బాణాల శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి పి.వి. నారాయణ, కోరుకొండ వెంకట రత్న స్వాతి దాస్, పళ్ళ దుర్గ, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు ఉరుకూటి రామచంద్రరావు (చందు), పేడాడ రమణి కుమారి, బర్కత్ అలీ, బొండా ఉమా మహేశ్వర్ రావు, బోని శివ రామ కృష్ణ, జీలకర్ర నాగేంద్ర , కార్పొరేటర్లు దౌలపల్లి ఏడుకొండల రావు, సాడి పద్మారెడ్డి, బిపిన్ కుమార్ జైన్, వావిలపల్లి ప్రసాద్, రేయ్యి వెంకట రమణ, శేశికల్, పి.వి. సురేష్, గుడివాడ సాయి అనూష లతీష్, వార్డు అధ్యక్షులు బొడ్డేటి గోవింద్, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మువ్వల సురేష్, జిల్లా కార్యదర్శి ఉమ్మడి దాస్, పార్టీ నాయకులు గుడివాడ లతీష్, సూర్య, మహేష్, మూలక రెడ్డి, బంగారు భవాని శంకర్, సాయి తదితరులు పాల్గొన్నారు.

 

Back to Top