తిరుపతిలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన

టిడిపి దుశ్చర్యలను తీవ్రంగా ఖండించిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు

తిరుపతి: బీసీ నాయకులు, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై నిప్పుపెట్టి దాడి చేసి పైశాచికంగా ప్రవర్తించిన టిడిపి నాయకుల దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తూ తిరుపతిలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని బాలాజీ కాలనీ సర్కిల్ వద్ద ఉన్న సామాజిక సంస్కర్త జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద జరిగిన ఈ నిరసనలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా టిడిపి నేతలు దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా పార్టీ బీసీ సెల్ నాయకులు మాట్లాడుతూ, బీసీల గొంతుకగా నిలిచిన జోగి రమేష్‌పై, ఆయన కుటుంబంపై దాడి చేయడం బీసీ వర్గాలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ప్రశ్నించే నాయకులను భయపెట్టేందుకు, ప్రజాస్వామ్య స్వరాలను అణిచివేయేందుకు టిడిపి కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల హక్కుల పరిరక్షణ కోసం ఎప్పటికీ పోరాటం చేస్తుందని, ఇలాంటి దాడులకు భయపడేది లేదని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top