తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ హయాంలో నిర్వహించిన సమగ్ర భూసర్వే కార్యక్రమం ద్వారా శతాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని ఎన్నో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మేలు జరిగేలా వైయస్ జగన్ గారు చేసిన ఈ మహా యజ్ఞానికి కేంద్ర ఆర్థిక సర్వేలో ప్రశంసలు దక్కాయని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. వైయస్ జగన్ ప్రారంభించిన ఈ యజ్ఞాన్ని రాక్షసుల్లా అడ్డుకోవాలని చూసిన కూటమి నాయకులు.. అధికారంలోకి వచ్చాక మేమే చేశామంటూ క్రెడిట్ చోరీకి పాల్పడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సుదీర్ఘ పాదయాత్రలో తన దృష్టికి లక్షల్లో వచ్చిన భూ సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించాలని తలచి, 2019 వైయస్ఆర్‌సీపీ మేనిఫెస్టోలోనే భూముల రీసర్వే హామీని చేర్చిన విషయాన్ని గుర్తుచేశారు. వైయస్ జగన్ గారు ప్రారంభించిన ఈ సర్వే విధానాలను పరిశీలించాలని గతంలో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు సూచించారని ఆయన వివరించారు. కానీ ఎన్నికల్లో భూముల రీసర్వేపై ప్రజలను తప్పుదోవ పట్టించడంలో సక్సెస్ అయిన కూటమి నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత తెగించి జగన్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి తిరుమల శ్రీవారిని కూడా రాజకీయాలకు వాడుకున్నారని మండిపడ్డారు. తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు చేసిన దిగజారుడు వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని జూపూడి ప్రభాకర్ డిమాడ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ● 2019 మేనిఫెస్టో లోనే భూముల రీసర్వే ప్రకటన 2009 లో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి హఠాన్మరణం తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన వైయస్ జగన్ గారు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రజలకు మరింత చేరువయ్యారు. గ్రామగ్రామాన ప్రజల సమస్యలను నేరుగా విన్నారు. రైతులు, ప్రజలు పడుతున్న కష్టాలను కళ్లారా చూశారు. ఆ సమస్యలకు పరిష్కార చూపే విధంగా 2019 ఎన్నికల మేనిఫెస్టో రూపొందించారు. ప్రతి గ్రామంలో ప్రధానంగా ఉన్న భూమస్యను పరిష్కరించాలని ఆలోచించారు. ఆ మేరకు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు వందేళ్ల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేకి 2021 లో శ్రీకారం చుట్టారు. గ్రామ సచివాలయాలు ప్రధాన కేంద్రంగా అక్కడే అవసరమైతే రిజిస్ట్రేషన్ కూడా జరిగేలా టెక్నాలజీని, అధికారులను సిద్ధం చేశారు. ఇదే సందర్భంలో కేంద్రం కూడా దేశవ్యాప్తంగా భూముల రీసర్వే చేయాలని ఆలోచన చేసింది. ఈ నేపథ్యంలో అప్పటికే ఏపీలో వైయస్ జగన్ గారు ప్రారంభించిన భూ రీసర్వేని పరిశీలించాలని అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు ప్రధాని మోడీ సూచించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ సైతం దేశంలో భూముల రీసర్వే జరగాల్సిన ఆవశ్యకత గురించి ఆనాడే చెప్పారు. ● వైయస్ఆర్‌సీపీ హయాంలోనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఎక్కడైనా గొడవ ఉందంటే ఆ భూములను 22 ఏ లో చేర్పించి ఇబ్బంది పెట్టేవాడు. రాజకీయ ప్రత్యర్థులకు చెందిన వేలాది ఎకరాలను సైతం చంద్రబాబు 2014-19 మధ్య 22ఏ జాబితాలో చేర్చాడు. ఈ సమస్యలన్నింటికీ 2019లో వైయస్ జగన్ గారు సీఎం అయ్యాక పరిష్కారం చూపించారు. రైతులకు పైసా ఖర్చు లేకుండా అత్యాధునిక టెక్నాలజీతో దాదాపు 15 వేల మంది సర్వేయర్ల నియామకం చేపట్టి రీ సర్వే నిర్వహించారు. సుమారు 86,000 సరిహద్దు వివాదాలకు పరిష్కారం లభించింది. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి 6,901 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేశారు. తొలిసారి డ్రోన్లు, రోవర్లు, విమానాలను వినియోగించి అత్యాధునిక టెక్నాలజీతో భూములకు జియో హద్దులు నిర్ణయించి పట్టాదార్ పాస్ పుస్తకాలపై క్యూఆర్ కోడ్‌లతో ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ టైటిళ్లు జారీ చేసిన ఘనత వైయస్ జగన్ గారికే దక్కుతుంది. వైయస్ఆర్‌సీపీ హయాంలోనే 81 లక్షల కమతాలు తిరిగి సర్వే నిర్వహించడం జరిగింది. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఏపీలో జరిగిన రీసర్వే జరిగింది కాబట్టే 2025-26 కేంద్ర ఆర్థిక సర్వేలో వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాలకు ప్రశంసలు దక్కాయి. భూ వివాదాలు లేకుండా క్లియర్ టైటిల్స్ తో పాసు పుస్తకాలు అందజేస్తే కూటమి పార్టీలు దానిపూ విషప్రచారం చేశాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక నాడు వైయస్ఆర్‌సీపీ అవలంభించిన రీసర్వే విధానాలనే ఇప్పుడూ కొనసాగిస్తుంది. అవే పట్టాదారు పాసుపుస్తకాలను రంగు మార్చి పంపిణీ చేస్తున్నాడు. ● చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భక్తులకు క్షమాపణలు చెప్పాలి భూసర్వే విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడంలో సక్సెస్ అయిన కూటమి నాయకులు, అధికారంలోకి వచ్చాక వైయస్ జగన్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్రకు తెరలేపాయి. వైయస్ఆర్‌సీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యిని వాడారని, ఆ ఆ లడ్డూలను భక్తులు తిన్నారని విష ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై సుప్రీంకోర్టు సీబీఐ సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ సిట్ చార్జిషీట్ దాఖలు చేస్తూ తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని జరిగిన ప్రచారం అబద్ధమని తేల్చింది. దీంతో వైయస్ జగన్‌ని రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలనే కుట్రతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఆడిన డ్రామా ప్రజలకు తెలిసిపోయింది. రాజకీయ లబ్ధి కోసం దేవుడిని కూడా వాడుకున్న విధానంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని కప్పి పుచ్చుకునేందుకు తాము చేసి తప్పుడు ప్రచారమే నిజమని ఇంకా నమ్మించేందుకు చంద్రబాబు మరిన్ని తప్పులు చేస్తున్నాడు. లడ్డూ కల్తీ జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా ప్లెక్సీలు ఏర్పాటు చేసి తిరుమల శ్రీవారిని ఇంకా రాజకీయాల్లోకి లాగుతూనే ఉన్నాడు. చంద్రబాబు దిగజారుడుతనాన్ని ప్రజలు గుర్తించాలి. చంద్రబాబుకి దేవుడంటే భయం, భక్తి ఉంటే ఇలాంటి క్షుద్ర రాజకీయాలు చేసేవాడే కాదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు అడుగుజాడల్లోనే నడుస్తూ సనాతన ధర్మం ముసుగులో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. తాము చేసిన తప్పులను గ్రహించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తెలుగు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.