తాడేపల్లి: తిరుమల లడ్డూ వివాదంలో దర్యాప్తు చేసిన సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఛార్జ్‌షీట్ నేపథ్యంలో.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నేతలను నిందిస్తూ, రాష్ట్రంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు సంబంధించి, తక్షణమే తగిన చర్య తీసుకోవాలని వైయస్సార్‌సీపీ రాష్ట్ర డీజీపీని కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. సీబీఐ సిట్ ఛార్జ్‌షీట్ లోని అంశాలను తప్పుదోవ పట్టిస్తూ, తమ పార్టీని నిందిస్తూ గుంటూరు, పిడుగురాళ్ల, వినుకొండ, దర్శితో పాటు, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ఆయన వెల్లడించారు. అలా వైయస్ఆర్‌సీపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడంతో పాటు, వారి పరువుకు భంగం కలిగించే విధంగా ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఆ విధంగా రాష్ట్రంలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. నిజానికి సిట్ ఛార్జ్‌షీట్‌లో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు, పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పై ఎలాంటి నేరారోపణలు చేయలేదని, అయినా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తూ, వారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా, వారి ఫోటోలతో సహా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని లేళ్ల అప్పిరెడ్డి వెల్లడించారు. అందుకే అవి ఏర్పాటు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, భవిష్యత్తులో మళ్లీ అలాంటి పనులు చేయకుండా చూడాలని కోరారు. తప్పుడు ప్రచారం చేస్తూ, పరువు నష్టం కలిగించే ఆ ఫ్లెక్సీలు డిజైన్ చేసిన, ప్రింట్ చేసిన, వాటికి నిధులు సమకూర్చిన, రవాణా చేసిన వారితో పాటు, అవి ఏర్పాటు చేసిన వారిపైనా వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి ఫ్లెక్సీల ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం ఉందని, కాబట్టి శాంతికి విఘాతం కలిగించే ఆ చర్యలను నిరోధించేలా వెంటనే నిషేధాజ్ఞలు జారీ చేయాలని లేళ్ల అప్పిరెడ్డి ఆ లేఖలో రాష్ట్ర డీజీపీని కోరారు.