తిరుమల లడ్డూ దుష్ప్రచారం ఆపాలి

ధర్మవరం లో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు 

ధర్మవరం: తిరుపతి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై కూటమి నేతలు సాగిస్తున్న అసత్య ప్రచారాలను ఇకనైనా ఆపాలని డిమాండ్ చేస్తూ ధర్మవరం నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లడ్డూ ప్రసాదంపై జరిగిన విషప్రచారాలకు పాల్పడిన కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ సీపీ శ్రేణులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం అత్యంత అనుచితమని మండిపడ్డారు. కనీస అవగాహన లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వైయస్ఆర్ సీపీపై బురద జల్లాలనే ఉద్దేశంతో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అబద్ధపు ప్రచారాలు చేశారని ఆరోపించారు.

రాజకీయాల కోసం దేవుడినే వాడుకునే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారని విమర్శించారు. NDDB / NDRI ఇచ్చిన నివేదికల ప్రకారం ఈ ఆరోపణలు పూర్తిగా అసత్యమని తేలిన నేపథ్యంలో, కూటమి నేతలు బహిరంగంగా భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్‌కు నిజంగా హిందుత్వంపై నమ్మకం ఉంటే దుర్గ గుడికి వచ్చి మెట్లు కడిగి చేసిన తప్పును సరిదిద్దుకోవాలని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిపై, వైయస్ఆర్ సీపీపై అబద్ధపు ప్రచారాలు చేయడం కూటమి నేతల నిత్యకృత్యమైందని విమర్శించారు. పైగా అన్నీ చూస్తున్న వెంకటేశ్వర స్వామి ఎవరినీ వదలరని హెచ్చరించారు. ఇప్పుడు నిజాలు బయటపడటంతో కూటమి నేతలు ప్రజల ముందుకు రాలేక దాక్కొని తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఎల్లో మీడియాను ఉపయోగించి మళ్లీ అసత్య ప్రచారాలు చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజల ముందుకు వచ్చి లెంపలు వేసుకొని, గుంజీలు తీసి బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనని వైయస్ఆర్ సీపీ శ్రేణులు స్పష్టం చేశాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో భక్తులు స్వయంగా ముందుకు వచ్చి కూటమి నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

వైయ‌స్ జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని, మతసామరస్యాన్ని కాపాడిన ప్రభుత్వం వైయస్ఆర్ సీపీ ప్రభుత్వమేనని అన్నారు. గతంలో చంద్రబాబు అభివృద్ధి పేరుతో అనేక గుడులు కూల్చిన చరిత్ర ఉందని గుర్తు చేస్తూ, హిందువులంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు గౌరవం లేదని తీవ్ర విమర్శలు చేశారు. ఏడాది పాటు లడ్డూ ప్రసాదంపై జంతువుల కొవ్వు కలిసిందంటూ అబద్ధపు ఆరోపణలు చేయడం అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు.
 

Back to Top