ప్రొద్దుటూరు: తిరుమల లడ్డూ ప్రసాదంపై కావాలనే దుష్ప్రచారం చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఘటన రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు నాయుడు చేసిన అతిపెద్ద కుట్రగా నేటి కోర్టు తీర్పుతో తేలిపోయిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ రోజు ప్రొద్దుటూరు బొల్లవరం ప్రాంతంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పరిహార పూజలు నిర్వహించిన అనంతరం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారానికి తెరలేపిన నేపథ్యం నేటితో పూర్తిగా ముగిసిందని, ఇందుకు నేటి కోర్టు తీర్పే నిదర్శనమని స్పష్టం చేశారు. ఇది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలోని నిజాయితీకి, పారదర్శకతకు స్పష్టమైన రుజువుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వరుసగా ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తోందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ ఆరాచకాలు, అవాస్తవ ఆరోపణలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పరిహార పూజలను విజయవంతం చేశారు.