డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే లడ్డూ ప్రసాదంపై తప్పుడు ఆరోపణలు

కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ ఫైర్‌

కోడుమూరు చెన్న‌కేశ‌వ‌స్వామి ఆల‌యంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల పూజ‌లు  

కోడుమూరు: ఎన్నికల వాగ్ధానాలను అమలు చేయలేక, పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ఆరోపణలు చేసిందని కోడుమూరు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ తీవ్రంగా మండిపడ్డారు. తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ కావాలనే అసత్య ప్రచారాలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేసిన విషప్రచారాలను డాక్టర్ సతీష్ తీవ్రంగా ఖండించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా జరిగిన ఈ దుష్ప్రచారాలు పూర్తిగా అబద్ధమని తేలిందని, ఇకనైనా ఇలాంటి ప్రచారాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం దేవాలయాలను, దేవుడిని వాడుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంపై జరిగిన విషప్రచారంపై వాస్తవాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, స్వామివారిపై జరిగిన అపవాదు తొలగినందుకు కృతజ్ఞతగా కోడుమూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారి ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ మాట్లాడుతూ..ఆ రోజు తాము సనాతన ధర్మ పరిరక్షకులమంటూ గొప్పలు చెప్పిన పవన్ కళ్యాణ్ దుర్గ గుడి మెట్లు కడిగారని గుర్తు చేశారు. ఈ రోజు ఆయన చేసిన ఆరోపణలన్నీ అబద్ధమని తేలిన నేపథ్యంలో, ఇప్పుడు ఏ గుడి మెట్లు కడుగుతారో పవన్ కళ్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై నిత్యం ఆరోపణలు చేయడం, వైయ‌స్ఆర్‌సీపీపై అసత్యాలు ప్రచారం చేయడమే కూటమి నేతల పనిగా మారిందని ఆయన విమర్శించారు. ప్రజలు ఈ కుట్ర రాజకీయాలను గమనిస్తున్నారని, తగిన సమయంలో తగిన బుద్ధి చెబుతారని డాక్టర్ ఆదిమూలపు సతీష్ స్పష్టం చేశారు.

Back to Top