తాడేపల్లి: రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు, లోకేష్‌ల అండతో రాష్ట్రంలో టీడీపీ సైకో బ్యాచ్ రెచ్చిపోతోందని, అరాచకం సృష్టిస్తోందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తాజాగా గుంటూరుజిల్లా మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వర రావు పై పట్టపగలు నడిరోడ్డుపై టీడీపీ గుండాలు అత్యంత కిరాతకంగా చేసిన దాడిని చూసి మొత్తం రాష్ట్రం అంతా ఉలిక్కిపడిందని అన్నారు. అధికార మదంతో, కన్నూమిన్నూ కానకుండా తెలుగుదేశం ఉన్మాదులు రక్తపాతం సృష్టిస్తుంటే, కూటమి నేతలు వారిని ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రాన్ని నరకాసుర రాజ్యంగా మారుస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే... రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూటమి నేతల రౌడీయిజం, గుండాగిరీతో అరాచక పాలన కనిపిస్తోంది. నిత్యం వీరి దాడులతో రాష్ట్రం రక్తమోడుతోంది. మరోపక్క మహిళలకు, బాలికలకు కూడా టీడీపీ సైకో బ్యాచ్ నుంచి రక్షణ ఉండటం లేదు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు టీడీపీ నాయకుల దారుణాలకు, ఆగడాలకు అండగా నిలబడి ప్రోత్సహిస్తున్నారు. రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానని దేవుడి సాక్షిగా ప్రమాణం చేసిన చంద్రబాబు, దానికి భిన్నంగా టీడీపీ కార్యకర్తలు చేస్తున్న దారుణాలకు అండగా నిలబడుతున్నాడు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పుకోలేక అధికార మదంతో ఊగిపోతూ వైయస్ జగన్‌ని భూస్థాపితం చేస్తానని బెదిరింపులకు దిగుతున్నాడు. ఇది మాటల పాలనే తప్ప చేతల పాలన కాదని ప్రజలు కూడా అంచనాకి వచ్చేశారు. సంక్రాతి నాటికి రోడ్ల మీద గోతులు పూడుస్తామని చెప్పారు. ఆరు నెలలు దాటినా దానికి అతీగతీ లేదు. ఏడాది కూటమి పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. టీడీపీ అవినీతిని అడ్డుకున్నందుకే దాడి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆదేశాలతో ఆయన అనుచరులు గుంటూరు జిల్లా మన్నవ గ్రామంలో చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తుంటే కలెక్టర్‌కి ఫిర్యాదు చేసి నాగమల్లేశ్వర రావు అడ్డుకున్నాడు. నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అవినీతి, అరాచకాలను ఆయన ప్రశ్నిస్తున్నాడు. దీంతో ఎమ్మెల్యే అండతో ఆయన అనుచరులు నాగమల్లేశ్వర రావు పై పట్టపగలు అతి కిరాతకంగా రాడ్డులు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే అంతా వెనకుండి నడిపించి, ఇప్పుడు నీతులు చెప్పడం సిగ్గుచేటు. బొనిగెల నాగమల్లేశ్వర రావు పై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ గతంలో టీడీపీ నాయకుడు బాబూరావు మీద జరిగిన దాడికి ప్రతీకారం అంటూ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర నీతులు చెబుతున్నాడు. వాస్తవానికి ఆ రోజు బాబూరావు మీద దాడి జరుగుతుంటే అడ్డుకున్న వ్యక్తి నాగమల్లేశ్వర రావు అని గ్రామంలో ఎవర్ని అడిగినా చెబుతారు. పైగా ఆరోజు బాబూరావు మీద దాడి చేసిన నిందితులంతా ఇప్పుడు టీడీపీ జెండాలు మోస్తూ ఎమ్మెల్యే నరేంద్ర వెనుకే తిరుగుతున్నారు. బాబూరావును కాపాడిన నాగమల్లేశ్వర రావు మాత్రం దారుణంగా దాడికి గురయ్యాడు. నరేంద్ర చెప్పినట్టు నాగమల్లేశ్వర రావుకి దాడులు చేసే మనస్తత్వమే ఉంటే గత నాలుగు పర్యాయాలుగా ఆయనే గ్రామ సర్పంచ్‌గా ఎలా ఉంటూ వస్తాడు? టీడీపీ హయాంలోనూ ధూళిపాళ్ల నరేంద్ర ఎమ్మెల్యేగా ఉండగా కూడా ఆయనే గ్రామ సర్పంచ్‌గా ఉన్నారు. అంతకుముందు ధూళిపాళ్ల తండ్రి ఉన్నప్పుడు సైతం వారి కుటుంబ సభ్యులనే ప్రజలు గ్రామ సర్పంచ్‌లుగా గెలిపిస్తూ వస్తున్నారు. నిజంగా ఆయనకు దాడులు చేసే నేపథ్యమే ఉంటే ఆయన్ను, వారి కుటుంబాన్ని ప్రజలు దశాబ్దాలుగా ఎందుకు ఆదరిస్తారో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సమాధానం చెప్పాలి. రెచ్చగొట్టి దాడులు చేయించడమే ఎమ్మెల్యే పని కూటమి పార్టీలు 164 సీట్లు గెలిచినప్పటికీ మన్నవ గ్రామంలో మాత్రం వైయస్ఆర్‌సీపీ కే మెజార్జీ వచ్చింది. దానికి నాగమల్లేశ్వర రావు నాయకత్వమే కారణమని తెలుసు. తన రాజకీయ లబ్ధి కోసం గ్రామంలోని ప్రత్యర్థులను రెచ్చగొట్టి నాగమల్లేశ్వర రావు హత్యకు ప్రేరేపించాడు. ఇటీవల జరిగిన టీడీపీ మినీ మహానాడులో ఆ పార్టీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి మన్నవ గ్రామం గురించి ప్రస్తావిస్తూవైయస్ఆర్‌సీపీ వారిని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చాడు. అలాంటి ఆలోచనలు ఉంటేనే నాతో నడవండి లేదంటే పక్కకు తప్పుకోండని హెచ్చరికలు జారీ చేశాడు. నా ఆలోచనల మేరకు నడుచుకోకపోతే నాతో ఉండాల్సిన పనిలేదని హూంకరిస్తూ మాట్లాడాడు. అంటే, నాగమల్లేశ్వర్రావు మీద దాడికి ఆరోజే పరోక్షంగా ఎమ్మెల్యే నరేంద్ర ఆదేశాలిచ్చాడు. గ్రామాల్లో అశాంతి, అల్లర్లు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందడం ధూళిపాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. మన్నవ గ్రామానికి పక్కనే ఉన్న పొన్నూరు మండలం వెల్లలూరు లోనూ గతంలో ఇదే జరిగింది. గ్రామంలో టీడీపీకి మెజారిటీ రావడం లేదనే కోపంతో అల్లర్లను ప్రోత్సహించి ఆరు మర్డర్లకు కారణమయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలకే సుపరిపాలన రాష్ట్రంలో ఏదో మూలన రోజూ అత్యాచారాలు, హత్యలు, దాడులు జరుగుతున్నా నిందితులెవరికీ శిక్షలు పడటం లేదు. చంపేశాక శవ పంచనామా చేయడానికి మాత్రమే పోలీసులు వస్తున్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలు అదృశ్యమైతే ఏడాది కాలంలో ఇద్దర్నే పట్టుకున్నారట, అది కూడా పవన్ కళ్యాణ్ ఆదేశిస్తేనే జరిగిందని చెప్పుకోవడం పోలీసులకే సిగ్గు చేటు. ఆ పవన్ కళ్యాణ్ కే సమస్యలు చెప్పుకుందామని వెళ్దామనుకుంటే మాత్రం ఆయనెప్పుడూ రాష్ట్రంలో అందుబాటులో ఉండడు. ఆయన్ను కలవాలంటే పక్క రాష్ట్రంలో షూటింగ్ స్పాట్‌కి వెళ్లాలేమో. వ్యయప్రయాసలకోర్చి కష్టపడి చదివి డాక్టర్ పాసైన విద్యార్థులకు కూడా రిజిస్ట్రేషన్ చేయకుండా ఈ ప్రభుత్వం వేధిస్తోంది. ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఐపీయస్‌లు సైతం భయపడి రాజీనామాలు చేసి వెళ్లిపోతున్నారు. వేలకు వేలు కరెంట్ బిల్లులు ఎందుకొస్తున్నాయని ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పుకోలే ఎల్లో పత్రికల్లో గత ప్రభుత్వమే కారణమని అసత్య కథనాలు రాయిస్తున్నారు. కారుంటే అమ్మ ఒడి ఎందుకివ్వరు? మా పాలనలో అడ్డగోలు నిబంధనలు అంటూ ప్రజల్ని రెచ్చగొట్టారు. అవే ఇప్పుడెందుకు అమలు చేస్తున్నట్టు? ఇది టీడీపీ ఎమ్మెల్యేలకే సుపరిపాలన తప్ప, ప్రజలకు కాదు. విషాహారం తిని విద్యార్థినులు అనారోగ్యం పాలై అల్లాడి పోతుంటే మంత్రి వచ్చేదాకా అంబులెన్స్ లో తరలించకూదంటూ అడ్డుకున్నారు. వైయస్ జగన్ రాడని చెప్పడానికి పవన్ కళ్యాణ్ ఎవరు? పార్టీ పెట్టి, సొంతంగా పోటీ చేసి భారీగా ప్రజామోదంతో అధికారంలోకి వచ్చి తన పాలనలో ఒక మార్క్ క్రియేట్ చేసిన నాయకులు వైయస్ జగన్. అలాంటి జగన్‌ని మళ్లీ అధికారంలోకి రానివ్వను అనడానికి పవన్ కళ్యాణ్ ఎవరు? వైయస్ జగన్ గురించి మాట్లాడే స్థాయి పవన్‌కు లేదు. చంద్రబాబుకి నష్టం జరిగినప్పుడు తప్ప ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ బయటకొచ్చాడా? జగన్ మళ్లీ రావాలా వద్దా అనేది నిర్ణయాల్సింది ప్రజలే తప్ప పవన్ కళ్యాణ్, చంద్రబాబు కాదు. మళ్లీ ఈవీఎంలను మేనేజ్ చేసి గెలవచ్చనే ధైర్యంతోనే జగన్‌ని అధికారంలోకి రానివ్వనని చెబుతున్నాడని బయట మాట్లాడుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఈవీలంలో జరిగిన అవకతవకలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా వివరించడం జరిగింది. అందుకే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని మా పార్టీ డిమాండ్ చేస్తోంది. జనసేన పార్టీ టెంట్ హౌస్‌లాగా అద్దెకిచ్చే పార్టీ అని నేను మాట్లాడితే తిట్టారు. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. సొంతంగా గెలవలేక అందరూ ఒక్కటై ప్రజలను దోచుకుంటున్నారు. అది చేస్తా, ఇది చేస్తా అని ఎన్నికలకు ముందు చెప్పిన పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంగా ఎక్కడున్నాడు.