గుంటూరు: ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను పెంచుకుంటుందని, వైయస్ జగన్ చిత్తూరు జిల్లా పర్యటనకు అడుగడుగునా ఆంక్షలు విధించడం దుర్మార్గమని వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రజల ప్రవాహాన్ని, ఉప్పెనను మీరు ఆపలేరు అంటూ వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ఏం చెప్తే అది పోలీసులు చేస్తారా అని ప్రశ్నించారు. గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ..ఇంకా ఆయనేమన్నారంటే... చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి రైతుల పరామర్శకు వస్తున్న వైయస్ జగన్ సమావేశానికి హాజరవుతున్న రైతులపై ప్రభుత్వం అడుగడునా ఆంక్షలు విధిస్తున్నారు. వైయస్ జగన్ పర్యటన ఖరారు అయినప్పటి నుంచి ప్రభుత్వం సుమారు మూడువేల మందికి నోటీసులు ఇప్పించింది. చివరకు పెట్రోల్ బంకు దగ్గర కూడా పోలీసులను కాపలా పెట్టి ఎవరికీ పెట్రోల్ కూడా అమ్మడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టడం దారుణం. అనేక మంది నాయకులను అరెస్టు చేశారు, చాలా మందిని గృహ నిర్భందంలో పెట్టారు. ఇక వైయస్ జగన్ హెలీ ప్యాడ్ వద్ద లాఠీ ఛార్జీ కూడా చేశారు. వైయస్ జగన్ ను అడ్డుకోవడమే వారి లక్ష్యం ఉప్పెనలా వస్తున్న వైయస్ జగన్‌ను అడ్డుకోవడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యంగా మారింది. అందుకే పోలీసులు యంత్రాంగం ద్వారా తన అరాచకాన్ని ఆచరణలో పెట్టింది. బంగారుపాళ్యంలో వేలాది మంది పోలీసులను నియమించి ప్రతి గ్రామంలోనూ పోలీస్ పికెట్ పెట్టారు. మార్కెట్ యార్డుకు వెళ్లకుండా, హెలీప్యాడ్ దగ్గరకు పోనీయకుండా, వైయస్ జగన్ నుని చూసి చేయి కూడా ఊపడానికి అవకాశం లేని విధంగా నిర్భంధిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సమావేశానికి జనాలను సమీకరించాల్సిన అవసరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అయినా కూడా జనాన్ని సమీకరిస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ ఏ విధంగా చెబుతారు? మంత్రి నారా లోకేష్ ఏం చెబితే అది చేయడానికేనా ఎస్పీ ఉన్నది? లోకేష్‌కు చెంచాగా కాదు, చట్టబద్దమైన పాలన సాగించాల్సిన ఐపీఎస్‌గా ఆయన పనిచేయాలి. రైతులను పరామర్శించడం వల్ల ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి ఆ రైతులను ఆదుకుంటుందన్న సదుద్దేశ్యంతో వారిని పరామర్శించడానికి వైయస్ జగన్ వెళ్ళారు. ఒక మాజీ ముఖ్యమంత్రి రైతులను పరామర్శించడానికి కూడా ఇన్ని ఆంక్షలు, అడ్డంకులు విధిస్తున్నారు. మీ అంతట మీరే ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకుంటున్నారు. బంగారుపాళ్యంలో 116 దుకాణాలకు నోటీసులు జారీ చేసారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఈ ఆర్ పురం మండలం వైయస్సార్సీపీ నేతలను చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ క్యాంపులో పెట్టి రాకుండా అడ్డుకున్నారు. ఆటోలు, ట్యాక్సీలకూ నోటీసులిచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో వచ్చిన వారిని కూడా దించి మరీ అడగడం సరికాదన్నారు.