రైతుల కోసం వైయ‌స్ జగన్ పోరాటం

మామిడి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు ప్ర‌తిప‌క్ష నేత‌ బంగారుపాలెం వ‌స్తే ఇన్ని ఆంక్షలు ఎందుకు?                          

రైతుల గోడును అణచివేయాలనే ప్రయత్నం బాధాక‌రం 

వైయ‌స్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి

తాడేప‌ల్లి:  కష్టాలలో ఉన్న రైతులను పరామర్శించడానికి వైయ‌స్ఆర్ సిపి అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్  జగన్ వెళ్ళితే, ఏకంగా రైతులపై  ఎస్ పి స్థాయి జిల్లా అధికారులు లాఠీ చార్జి చేయడం దుర్మార్గని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గతంలో మిర్చి రైతుల సమస్యలపైన, పొగాకు రైతుల గురించి ప్రతిపక్ష  నేత జగన్ వెళ్లి మాట్లాడితేనే  కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిందన్నారు. మామిడి రైతుల కష్టాలను తెలుసు కునేందుకు ఈ రోజు చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటనకు వస్తున్నామని చెప్పడంతో రెండు మూడు రోజులుగా ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు.ప్రతి పక్ష నాయకుడిగా ప్రజల సమస్యలను, రైతుల పడుతున్న కష్టాలను తెలుసుకుని ప్రభుత్వానికి కళ్లు తెరిపంచడానికి జగన్  బంగారుపాలెం పర్యటన చేపడితే ప్రభుత్వం ఇన్ని ఆంక్షలు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు.ఐదు వందల మంది రైతులు మాత్రమే రావాలని చెప్పడం ఎంత విడ్డూరమన్నారు. అభిమానం ఉన్న రైతులు, కష్టాలు చెప్పుకోవడానికి తరలి వస్తుంటే  అడ్డుకుని , కెమెరాలతో ఫోటోలు తీసుకుంటున్నాం..రౌడీ షీట్లు తెరుస్తాం..కేసులు పెడదామని పోలీసులు బెదిరించడం .. స్వయంగా  ఎస్ పి స్థాయి అధికారులే  రైతులపైన లాఠీ చార్జి చేసి రక్త గాయాలు అయ్యేటట్లు కొట్టడం ఎంతవరకు సమంజస మన్నారు.పూర్తిగా భారతదేశ రాజ్యాంగాన్ని విస్మరించి, కక్ష్యపూరితంగా వ్యవహరిస్తూ, సొంత రాజ్యాంగం సృష్టించుకుని  రాచరిక, నియంత ,సైనిక పాలన మాదిరిగా అరాచక పాలన సాగిస్తుండడం సరైన విధానం కాదన్నారు.

వేలాదిమంది పోలీసులను మొహరింపచేసి,చెక్ పోస్టులు పెట్టి, రైతులను రానీయకుండా ఆపడంతో పాటు  స్వయంగా ఎస్ పి లే  లాఠీ చార్జి చేయడం  చాలా అన్యాయంగా కన్పిస్తోందన్నారు. రాజ్యాంగ విలువలను తాకట్టు పెట్టి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుండడం దురదృష్టకరమన్నారు. రాజ్యాంగంపైన ప్రమాణం చేసినప్పుడు మీరు ఏమని చేశారో ఒక సారి ఆలోచించు కోవాలని ఆయన కోరారు. అధికారులను బెదిరించుకుని, వాళ్ళను  గుప్పెట్లో పెట్టుకోవడం ప్రజా స్వామ్య విలువలను కాలరాస్తున్నారన్నారు.రాజకీయ వేదికల కోసం కాకుండా రైతుల కోసం పోరాడుతుంటే కూడా ఈ రకంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. వైఎస్ఆర్  జయంతి సందర్భంగా  లక్కిరెడ్డిపల్లె మండలంలో ఎస్ సి లు కేక్ కట్ చేస్తే ,వాళ్ళను పోలీసు స్టేషన్ కు పిలిపించి, భయబ్రాంతులకు గురిచేయడం మంచి పద్ధతి కాదన్నారు.ప్రతి విషయంలో అడ్డుగోలుగా వ్యవహరించడం, గ్రామీణ ఉపాధి హామీ పథకం తదితర అన్ని పథకాల లోనూ,వ్యవస్థలలోనూ పూర్తిగా దిగజార్చడం దురదృష్టకరమన్నారు. ఈ రోజు బంగారుపాలెం రైతులపైన ప్రభుత్వ వ్యవహరించిన తీరును చూస్తుంటే గతంలో హైదరాబాద్ బషీర్ బాగ్ లో రైతుల పైన కాల్పులు జరిపి, గుర్రాలతో తొక్కించిన సంఘటన గుర్తుకు తెస్తోందన్నారు. ఇప్పుడు మళ్లీ అదే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రైతుల మధ్య చిచ్చులు పెడుతూ, రైతుల సమస్యలను పరిష్కరింకుండా, కష్టాలు పడుతున్న రైతుల గోడు వినకుండా,  వాళ్ళ గొంతుకగా వినిపించే అవకాశం కలుగచేయకుండా  ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించడం దుర్మార్గమని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు ఒక యేడాది రైతు భరోసాను కూటమి ప్రభుత్వం ఎగరగొట్టిందన్నారు.టమోటా,వరి, వేరుశనగ,ఖర్బూజా, దోస, అంతరపంటలకు,  నేరేడు తదితర ఏ పంటలకు  ఈ ఏడాది గిట్టుబాటుధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల గురించి,వారి సంక్షేమం గురించి ప్రభుత్వం పట్టించుకోవాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.

Back to Top