మంత్రి గారూ ..మా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పండి 

రాష్ట్ర ఆర్థిక మంత్రికి వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ బుగ్గన రాజేంద్రనాథ్ లేఖ‌

తాడేప‌ల్లి: ఏపీఎండీసీకి సంబంధించి బాండ్ల ద్వారా రాజ్యాంగ విరుద్ధంగా రుణ సేకరణపై వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున నేను ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్‌గారికి పత్రికా సమావేశం ద్వారా సూటి ప్రశ్నలు వేయడం జరిగింది. అయితే మంత్రి గారు దీనికి సంబంధించి నేరుగా సమాధానాలు ఇవ్వకుండా చిరాకుపడుతున్నారు. ఇంతటి కీలక అంశంపై అనంతపురంలో వారి పార్టీ కార్యక్రమంలో భాగంగా ఓ పల్లె నుంచి ప్రకటనలు చేస్తూ, అక్కడి ప్రజలనే కాదు, రాష్ట్ర ప్రజలను మరింత అయోమయంలోకి నెట్టివేసి, వాస్తవాలను మరుగునపరిచే ప్రయత్నంచేస్తున్నారు. 

1.    రాష్ట్ర ఖజానా నుంచి నేరుగా తమకు రావాల్సిన డబ్బును తీసుకునే వెసులుబాటును రుణాలిచ్చిన వారికి కల్పిస్తూ మన రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా చేశారంటూ మేం వేసిన ప్రశ్నలకు మంత్రి గారు నేరుగా సమాధానాలు చెప్పడం లేదు. 

2.    ఏపీఎండీసీ నుంచి వైయస్సార్‌సీపీ ప్రభుత్వం కూడా రూ.7వేల కోట్లకు బాండ్ల ద్వారా రుణాలు సేకరించాలని భావించి, విఫలమయ్యారని, ఆ కడుపుమంటను తట్టుకోలేక ఈ కూటమి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలతో విమర్శలు చేస్తున్నారంటూ మంత్రిగారన్నారు. మంత్రి గారు మరింతగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏపీఎండీసీ నుంచి బాండ్ల ద్వారా రుణ సేకరణ జరగలేదన్నది ముమ్మాటికీ వాస్తవం. 

3.    ఏపీఎండీసీ నుంచి రుణాలను సేకరించాలని ఉద్దేశంతో జీవోను విడుదల చేసినప్పటికీ, అది అమల్లోకి రాలేదు. ఈ జీవోలో కూడా మంత్రిగారు గమనించాల్సిన కీలక అంశాలు ఏంటంటే, కూటమి ప్రభుత్వం మాదిరిగా తేవాలనుకుంటున్న రుణాలకు, రాష్ట్ర ఖజానాను పణంగా పెట్టడం అనేది జరగలేదు. పైగా మూడు కచ్చితమైన నిబంధనలను పెట్టడం జరిగింది. 

4.    ఇందులో ఒకటి ఏంటంటే, ఏపీఎండీసీ నుంచి తీసుకునే రుణాలు, ఆ సంస్థ వ్యాపారాభివృద్ధికి మాత్రమే ఉద్దేశించాలని, ఏ సమయంలో ఎంత అవసరమో, అంతే సేకరించాలని, ఇక రెండో విషయం ఏంటంటే… ఇప్పటికిగాని, ఎప్పటికీగాని, తీసుకొచ్చిన రుణాల బాధ్యత ప్రభుత్వానిది కాదని, చెల్లింపు భారంతో ప్రభుత్వానికి సంబంధం లేదని, చెల్లింపు బాధ్యత ఏపీఎండీసీదేనని చాలా స్పష్టంగా పేర్కొనటం జరిగింది. ఇక మూడో విషయం ఏంటంటే.. సేకరించనున్న రుణాల నిర్వహణ, రుణాల వినియోగం, తిరిగి చెల్లింపు భారం అంతా ఏపీఎండీసీ ఎండీకి అప్పగించడం జరిగింది. అంటే దీని అర్థం రుణాల చెల్లింపుల భారం ప్రభుత్వానికి సంబంధం లేదు. మరొకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ జీవో కింద ఏ విధమైన అప్పు తీసుకురావడం జరగలేదు. ఎలాంటి బాండ్లు విడుదలచేసే ప్రయత్నంకూడా చేయలేదు. 

5.    కానీ, ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే, ఏపీఎండీసీకి గనులు కేటాయించడమే కాదు, బాండ్ల ద్వారా రుణాలు సేకరించి, ఆడబ్బును ఏపీఎండీసీ వ్యాపారాభివృద్ధికి ఉపయోగించకుండా, ప్రభుత్వానికి మళ్లించి, మళ్లీ రుణాల చెల్లింపు బాధ్యతను పరోక్షంగా ప్రభుత్వం నెత్తిమీద పెట్టారు. ఇదికూడా ఎలా పెట్టారంటే,  రుణదారులు నేరుగా ప్రభుత్వ ఖజానానుంచి తీసుకునే వెసులుబాటు ఇచ్చి, 9.3% శాతం వడ్డీకి ఈ అప్పులు తీసుకురావడం జరిగింది. ఇంత వడ్డీ ఇవ్వడంతో పాటు, నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకునే వెసులుబాటు ఇచ్చారు. అంతే కాదు రూ.1.91లక్షల కోట్ల రాష్ట్ర ఖనిజ సంపదను కూడా తాకట్టుపెట్టారు. కాబట్టే.. ఈ బాండ్లన్నీ కూడా ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. వాస్తవానికి ఏపీఎండీసీ మాత్రమే తిరిగి అప్పు చెల్లించే బాధ్యతను తీసుకుంటే.. అసలు ఈ బాండ్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యే అవకాశం లేనేలేదు. రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రజల తరఫున మీకు ఈ హెచ్చరికలు చేస్తున్నాం. 

6.    అదే మేం ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచి జూన్‌ 2022 లో మేం బాండ్లను విడుదల చేస్తే, ఈ విధమైన వెసులుబాట్లు, రాష్ట్ర సంపద, ఖజానాలాంటి వాటిని నేరుగా పణంగా పెట్టకుండా, తాకట్టు పెట్టకుండా చేస్తే రూ.2వేల కోట్ల విలువైన బాండ్లను విడుదల చేస్తే అవి 4రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైప్‌ అయ్యి రూ.8,300 కోట్లు సమీకరించగలిగాం. ఇది మా పనితీరు, సమర్థత, మా బ్రాండ్‌. 

7.    రాష్ట్రానికి సంబంధించిన రెవిన్యూ ఖర్చుల కోసం ఇలాంటి దారుణమైన, ప్రమాదకరమైన అప్పులు చేసి, వాటిని గొప్ప ఆర్థిక విధానాలుగా, పెట్టుబడుల తేవడంలో మీ తర్వాతే అన్నట్టుగా, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన గొప్ప ఆలోచనగా, మీకు మీరుగా వ్యాఖ్యానించుకోవడం, ప్రశంసించుకోవడం రాష్ట్రానికి దురదృష్టకరం.  

8.    గతంలో మీరు మాకంటే ఎక్కవ అప్పులు చేశారు. కాని,  మీరు, మేము ఎక్కువ అప్పులు చేసినట్టుగా మమ్మల్ని చిత్రీకరించారు. ఇప్పుడు కూడా మీరు విపరీతంగా అప్పులు చేసి, ఆర్థిక విధ్వంసం చేసి మీరు గొప్పగా చేస్తున్నట్టుగా చెప్పుకోవడం శోచనీయం. ఈరోజు ఏపీఎండీసీ బాండ్ల రూపంలో రుణ సేకరణకు మీరు ఎంచుకున్న సరికొత్త విధ్వంసకర విధానం మరింత శోచనీయం. 

9.    ఆర్థిక మంత్రి గారు ఇలాంటి కీలక విషయాల మీద ఎక్కడో పార్టీ కార్యక్రమంలో, ఎక్కడో గ్రామంలో ఉండి ఇంత చిరాకుగా, అసలు సమాధానాలు చెప్పకుండా మాట్లాడేబదులు, రాష్ట్ర సచివాలయానికి వచ్చి సావధానంగా కూర్చుని మేం చెప్పిన విషయాలన్నింటినీ కూలంకుషంగా పరిశీలించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం.

Back to Top