చిత్తూరు: కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర కష్ట నష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను పరామర్శించేందుకు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటించారు. వైయస్ జగన్ చిత్తూరు జిల్లా పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బంగారుపాళ్యం మండలం కొత్తపల్లి హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో బంగారుపాళ్యం మామిడి మార్కెట్ కు వెళ్తున్న క్రమంలో వైయస్ జగన్‌ను కలిసేందుకు వచ్చిన రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు, కొన్నిచోట్ల లాఠీఛార్జ్ చేశారు. పోలీసుల దాడిలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం కార్యదర్శి శశిధర్ రెడ్డి తలకు తీవ్ర గాయమై, రక్తస్రావం అయింది. దీనిని గమనించిన వైయస్ జగన్ స్ధానిక పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు, ఇంత దారుణంగా వ్యవహరించాల్సిన పరిస్ధితి ఎందుకొచ్చిందని నిలదీశారు. శశిధర్ రెడ్డికి వెంటనే మంచి వైద్యం అందించాలని పార్టీ నేతలకు వైయస్ జగన్ సూచించారు. అనంతరం వైయస్ జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ ముందుగా అనుమతి తీసుకున్న రూట్ మ్యాప్ ప్రకారం వెళ్తున్నా...చిత్తూరు, అన్నమయ్య జిల్లాల ఎస్పీలు మణికంఠ, విద్యాసాగర్ నాయుడు కాన్వాయ్ ముందుకు వచ్చి రూట్‌మ్యాప్ మార్చే ప్రయత్నం చేశారు. సబ్‌వే లో వెళ్ళాల్సిన కాన్వాయ్‌ను నేషనల్ హైవేపైకి మళ్ళించమన్నారు. దీంతో వైయస్ జగన్ ముందుగా అనుమతి తీసుకున్న రూట్‌మ్యాప్‌లోనే కాన్వాయ్ వెళ్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా నేషనల్ హైవేపై కాన్వాయ్ వెళితే అనేక మంది ప్రయాణీకులు ఇబ్బందులు పడతారని, అందుకే సబ్‌వేలో ముందుకు వెళతామన్నారు. అనంతరం బంగారుపాళ్యం చేరుకున్నారు. పోలీసుల ఓవర్ యాక్షన్ వల్ల చిత్తూరు, బెంగళూరు హైవే మీద చాలాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.