తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంటేనే ఒక పోరాటమని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు పేర్కొన్నారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్ స్క్రిప్టు ప్రకారమే వైయస్ జగన్ చిత్తూరు పర్యటనకు పోలీసులు అనుమతులిచ్చారని, అలాగే ఆటంకాలు సృష్టిస్తున్నారని అన్నారు. ఆఖరికి రైతులపై రౌడీషీట్లు తెరుస్తామంటూ బెదిరించేందుకు సిద్దపడటం వెనుక సీఎం చంద్రబాబు, లోకేష్‌ల ఒత్తిళ్ళు ఉన్నాయని అన్నారు. సీఎం తను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో మామిడి రైతుల పట్ల ఇంత కక్షపూరితంగా ఎలా వ్యవహరిస్తున్నాడో అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు. సీఎంగా చంద్రబాబు రైతుల సమస్యలను పట్టించుకోలేదు, దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో మామిడి పంట పండించే రైతులకు ఈ ఏడాది దారుణమైన నష్టం జరిగింది. అయినా కూడా ఆయనకు చీమ కుట్టినట్లైనా లేదు. మరోవైపు రైతుల సమస్యలను పట్టించుకుంటున్న వారి పై ఆంక్షలు పెట్టడమేంటి? వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. హంగూ ఆర్భాటాలు తప్ప చంద్రబాబుకు రైతులు అవసరం లేదు. పొద్దున్న లేచిన దగ్గర్నుంచి జగన్ నామస్మరణ చేయడమే చంద్రబాబు అండ్ కో పని. జగన్ మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఎక్కడికి వెళుతున్నాడు? ఆయన దగ్గరికి ఎవరెవరొస్తున్నారో ఆరా తీయడమే చంద్రబాబు, లోకేష్‌ల పని. జనంలోంచి జనం కోసం పుట్టిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులు జగన్ కోసం తరలివచ్చారు. జగన్ కోసం వస్తున్న జనాన్ని చూసైనా చంద్రబాబుకు సిగ్గురావాలి. బైండోవర్ కేసులు, పోలీసు నోటీసులు , 116 మంది దుకాణం మామిడి రైతులకు నోటీసులతో పోలీసులు ఒక భయోత్పాతాన్ని సృష్టించారు. ఇలా చేయడానికి చంద్రబాబుకు సిగ్గనిపించడం లేదా? వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లకముందే మామిడి రైతుల సమస్యలకు ఎందుకు పరిష్కారం చూపలేకపోయారు? రైతులకు మీరేం చేశారో మేమేం చేశామో చర్చకు సిద్దం. ధైర్యం ఉంటే రండి బెజవాడ బెంజిసర్కిల్ లో చర్చిద్దాం. వైయస్ఆర్, వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఏనాడైనా రైతులు ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నారా? అక్రమ కేసులు, బైండోవర్లతో ప్రజాభిమానాన్ని నిలువరించలేరు. వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రజల వద్దకు వెళ్లకుండా చంద్రబాబు, లోకేష్‌లు ఎంత ప్రయత్నిస్తే, ప్రజలు అంత ఆయనకు దగ్గరవుతారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంటేనే పోరాటం, వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంటేనే ప్రజావ్యతిరేకులతో చేసే ఒక యుద్ధం అని టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు.