మామిడి రైతుల‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకొండి

కేజీ మామిడికి కనీసం రూ.12 దక్కేలా చూడండి 

ప్రభుత్వానికి వైయస్‌ జగన్‌ డిమాండ్‌

చిత్తూరులో 76 వేల మంది మామిడి రైతులున్నారు

వారి ఖాతాల్లో రూ.12 వేల చొప్పున జమ చేయాలి

మామిడి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

ఆ తర్వాత ప్రభుత్వమే మార్కెట్‌లో అమ్ముకోవాలి

మామిడి రైతుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం

ఆ ప్రభుత్వాన్ని నిద్ర లేపడం కోసమే నా పర్యటన

నా పర్యటన అడ్డుకోవడం కోసం అనేక ఆంక్షలు

నేను వచ్చి మామిడి రైతులను కలవడం తప్పా?

వారి సమస్యలు ప్రస్తావించడం కూడా తప్పేనా?

ప్రభుత్వాన్ని నిలదీసిన శ్రీ వైయస్‌ జగన్‌ 

రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు

అత్యంత దారుణంగా ఇక్కడ మామిడి ధర

రూ.2 కే కిలో మామిడి. ఇంత దారుణమా?

తీవ్ర కష్టనష్టాల్లో రైతులు. వ్యవసాయ రంగం

అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేసిన ప్రభుత్వం

జగన్‌ పర్యటిస్తుంటే భయపడుతున్న ప్రభుత్వం

అందుకే ఎక్కడికక్కడ కట్టడికి కుత్ర, కుతంత్రం

సమస్యలు లేకపోతే ఇంత మంది రైతులు వస్తారా?

సూటిగా ప్రశ్నించిన  వైయస్‌ జగన్ 

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో మామిడికి మంచి ధర

కిలో రూ.29 వరకు పలికిన ధర. రైతులకు లాభం

ఏటా మే మొదటి వారంలో మామిడి పంట కొనుగోలు

కూటమి ప్రభుత్వం నెల రోజులకు పైగా జాప్యం

ఫలితంగా మార్కెట్‌ను ముంచెత్తిన మామిడి ఉత్పత్తి

దిక్కు తోచని స్థితిలో రైతులు. స్వయంగా పంటల విధ్వంసం

ఇంత దారుణస్థితి గతంలో ఏనాడూ చూడలేదు: మీడియాతో వైయస్‌ జగన్‌

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌యార్డులో మామిడి రైతులను పరామర్శించిన వైయ‌స్ జ‌గ‌న్   

బంగారుపాళ్యం: చిత్తూరు జిల్లాలో కేజీ మామిడికి కనీసం రూ.12 వచ్చేలా చూడాలని, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మామిడి రైతుల సమస్యలు ఆరా తీసేందుకు వస్తున్న తన పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసిందని, ఎక్కడికక్కడ రైతులను అడ్డుకోవడమే కాకుండా, ఎక్కడా లేని ఆంక్షలు విధించిందని ఆయన ఆక్షేపించారు. ప్రభుత్వం వెంటనే మామిడి రైతులను ఆదుకోకపోతే, వారి తరపున తమ పార్టీ పోరాడుతుందని, బంగారుపాళ్యం మార్కెట్‌యార్డు వద్ద మీడియాతో మాట్లాడిన  వైయస్‌ జగన్‌ హెచ్చరించారు.
మీడియా మీట్‌లో వైయస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..:

అందుకే ఇన్ని వేల మంది!:
    ఎవరూ బయటకు తొంగి చూడకూడదు అని, రైతులు ఎన్ని అగచాట్లు పడుతున్నా కూడా, వాళ్ల జీవితాలు నాశనమైపోవాలి అని ఎందుకు పెడుతున్నారయ్యా ఈ ఆంక్షలు అని అడుగుతున్నా. అసలు జగన్‌ వచ్చి రైతుల్ని కలిస్తే తప్పేమిటి? అని అడుగుతున్నా. జగన్‌ వచ్చి రైతుల కోసం మాట్లాడితే తప్పేముంది? పోనీ రైతులు అగచాట్లు పడకుండా ఉండి ఉంటే, వారికి అసలు సమస్యలు లేకపోతే ఇక్కడికి ఇంత మంది ఎలా వస్తారు?.
    జగన్‌ వచ్చాడు కాబట్టి.. జగన్‌ వాళ్లకు తోడుగా నిలబడుతున్నాడు కాబట్టి.. వాళ్ల సమస్య ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టికి కచ్చితంగా పోతుందని భావిస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని కుంభకర్ణుడి నిద్ర నుంచి లేపడం కోసమే ఇక్కడికి ఇన్ని వేల మంది వచ్చి తమ ఆక్రందన వినిపిస్తున్నారు. 

ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?:
    ఇవాళ నేను అడుగుతున్నా. ఇవాళ ఇక్కడికి జగన్‌ వస్తున్నాడని తెలిసి 2 వేల మంది పోలీసులను మోహరించారు. ప్రతి గ్రామంలోనూ ఏ రైతూ ఇక్కడికి రాకూడదని కట్టడి చేయాలని చూశారు. ‘మీరు కనుక ఈ కార్యక్రమంలో పాల్గొంటే రౌడీషీట్లు తెరుస్తాము’ అని రైతులను బెదిరించారు. అయినా రైతులు స్వచ్ఛందంగా తరలి వస్తారు కాబట్టి, టూవీలర్స్‌పై ఎవరైనా వస్తే పెట్రోలు పోయవద్దంటూ బంక్‌ల యజమానులను ఆదేశించారు.

జగన్‌ రైతులను కలిస్తే తప్పేమిటి?:
    నేను అడుగుతున్నా. కేవలం 500 మంది మాత్రమే రావాలట!. అంటే, కేవలం 500 మంది రైతులు మాత్రమే నష్టపోయారా?. సమాధానం చెప్పండి. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తోంది?. జగన్‌ వస్తే తప్పేమిటి? నేను రైతులతో మాట్లాడితే, వారి సమస్యలు లేవనెత్తితే తప్పేముంది?.
రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టే ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి వాళ్ల ఆవేదన చెబుతున్నారు. 

ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు:
    ఇవాళ రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. వరి తీసుకుంటే దాదాపు రూ.300 నుంచి రూ.400 తక్కువకు అమ్ముకుంటున్న పరిస్థితి. మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు, చివరికి మామిడి.. ఏ రైతు పరిస్థితి చూసుకున్నా గిట్టుబాటు ధర రావడం లేదు. 
    నేను అడుగుతున్నా. ఆంధ్ర రాష్ట్రంలో తప్ప, వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా కిలో మామిడి రూ.2కే దొరుకుతుందా? అంత దుర్భర స్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం. తమకు కిలో మామిడికి కనీసం రెండున్నర రూపాయలు కూడా రావడం లేదని ఇక్కడి మామిడి రైతులు చెబుతున్నారు.

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.29:
    ఇదే రైతన్నలకు ఇదే పంట, గత ఏడాది వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కేజీ రూ.29 పలికింది. ఇదే చిత్తూరు జిల్లాలో కిలో మామిడి రూ.22 నుంచి రూ.29 వరకు రైతులు అమ్ముకున్నారు. ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో రైతుల బతుకులు తల్లకిందులయ్యాయి. వారు తీవ్ర కష్ట నష్టాల్లో కూరుకుపోయారు.

కొనుగోలులో ఎందుకింత జాప్యం?:
    నేను అడుగుతున్నా. చంద్రబాబునాయుడుగారి ప్రభుత్వానికి సూటిగా నా ప్రశ్నలు.
    అయ్యా చంద్రబాబునాయుడుగారూ, ఏటా మామిడి కొనుగోళ్లు మే 10 నుంచి 15వ తేదీ మధ్యలో మొదలు పెడతారు. మరి ఈ ఏడాది ఎందుకు అలా మొదలు పెట్టలేదు? జూన్‌ 3వ వారం వరకు కొనుగోళ్లు మొదలు కాలేదు. ఎప్పటిలాగే మే రెండో వారంలో మామిడి కొనుగోళ్లు జరిగే దిశలో ఈ ప్రభుత్వం చొరవ చూపక పోవడం వల్ల.. జూన్‌ 3వ వారం నాటికి మామిడి పంట మార్కెట్‌ను ముంచెత్తింది. రైతులంతా మామిడి పల్ప్‌ కంపెనీల వద్ద బారులు తీరాల్సిన దుస్థితి ఏర్పడింది. పల్ప్‌ ఫ్యాక్టరీలకు ఒకేసారి పంట మొత్తం తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో వాహనాల్లోనే మామిడి పంట కుళ్లిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కేజీ మామిడి కనీసం రూ.3 లేదా రూ.2.50కి కూడా కొనే నాథుడు లేడు. 
    ఇదే పెద్ద మనిషి చంద్రబాబును అడుగుతున్నా. 52 మామిడి పల్ప్‌ కంపెనీలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. నేను అడుగుతున్నా.. మే 10, 15వ తేదీన తెరవాల్సిన ఆ ఫ్యాక్టరీలు జూన్‌ 3వ వారం వరకు తెరవకపోతే మీరు ఏం గాడిదలు కాశారు?. నేను ఇదే చంద్రబాబును అడుగుతున్నా. ఎంత మంది రైతుల నుంచి ఈ ఫ్యాక్టరీలు కిలో మామిడి రూ.8కి కొన్నాయి. అలాగే మీరు గొప్పగా ప్రచారం చేస్తున్న అదనంగా రూ.4 ఎంత మంది రైతులకు ఇచ్చారు?. అయ్యా చంద్రబాబూ.. మీ పుణ్యాన ఈరోజు రైతులకు ఏ ఒక్కరికీ కూడా గిట్టుబాటు రాని పరిస్థితి.

ఎంత మందికి ఆ ధర వచ్చింది?:
    పక్కన కర్ణాటకలో జనతాదళ్‌కు చెందిన కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే, కిలో మామిడి రూ.16 చొప్పున కొనేందుకు కేంద్రం ముందుకొచ్చిందట. నిజానికి అది మంచి రేటు అని కాదు, కనీస రేటు అని చెప్పి. అదే పని మీరెందుకు చేయలేకపోయారు? మీరు ఎందుకు కేంద్రాన్ని అడగలేకపోయారు?. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏం గాడిదలు కాస్తోంది?.
    ఇదే చంద్రబాబునాయుడుగారిని గట్టిగా ప్రశ్నిస్తున్నా. జిల్లాలో 6.45 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుంది. 2.20 లక్షల ఎకరాల్లో పంట పండుతుంది. 76 వేల మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీద బతుకుతారు. ఆ 76 వేల రైతుల కుటుంబాల్లో ఎంత మందికి, చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కేజీ మామిడి ధర రూ.12 చొప్పున దక్కింది? 
    వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలో నిరుడు కిలో మామిడి రూ.29కి రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు కనీసం రూ.12 కూడా ఇప్పించలేని పరిస్థితి ఉందంటే, ఆ రైతుల దయనీయ పరిస్థితి అర్థ్థం చేసుకోవచ్చు. అలా ఆ రైతుల్ని నడిరోడ్డుపై నిలబెట్టారు. 
    ఇక్కడికి జగన్‌ వస్తున్నాడు అని చెప్పి, మూడు రోజుల నుంచి కిలో మామిడికి రూ.6 ఇస్తామని మెసేజ్‌లు పెడుతున్నారు. నేను అడుగుతున్నా.. అయ్యా చంద్రబాబూ.. రైతులకు కనీసం కిలో మామిడికి  రూ.3 కూడా రావడం లేదంటే.. మీరు నిద్ర పోతున్నారా?.

నాడు రైతన్నలకు అండగా మా ప్రభుత్వం:
    మా ప్రభుత్వ హయాంలో వ్యవసాయం రూపురేఖలు మారుస్తూ రైతులకు తోడుగా ఉండేవాళ్లం. రైతన్నలకు మే మాసం వచ్చే సరికి పెట్టుబడి సహాయం అందేది. అడుగడుగునా రైతన్నలకు ఆర్బీకేలు తోడుగా ఉండేవి. అవి వారిని చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం జరిగేది. 
    కానీ ఈరోజు ఏం జరుగుతోంది? మొదటి ఏడాది దాటిపోయింది. రైతన్నలకు ఇవ్వాల్సిన రైతు భరోసా రూ.20 వేలు ఎగరగొట్టేశారు. ఈ ఏడాది జూన్‌ కూడా అయిపోయింది, జూలైలో ఇవాళ ఉన్నాం. ఇంత వరకు రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు. ఇంకా చంద్రబాబునాయుడుగారి పుణ్యాన రైతులకు సమయానికే రావాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ రాకుండా పోయింది. ఆయన పుణ్యాన ఉచిత పంటల బీమా కూడా పూర్తిగా ఎగరగొట్టేసిన పరిస్థితి. ఇంకా ఆయన పుణ్యాన ఆర్బీకేలన్నీ నిర్వీర్యమయ్యాయి. ఈ–క్రాప్‌ లేకుండా పోయింది. 

ఇప్పుడవన్నీ కనుమరుగు:
    నాడు రైతులకు కనీస మద్దతు ధర రానప్పుడు మా ప్రభుత్వ హయాంలో సీఎం–యాప్‌ ఉండేది. ఆర్బీకేల పరిధిలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాకపోయినా కూడా వెంటనే అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్‌గా ఉన్న ఆర్బీకే అసిస్టెంట్‌ నోటిఫై చేసే వారు. జాయింట్‌ కలెక్టర్లు, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లుగా వ్యవహరిస్తూ, మార్క్‌ఫెడ్‌ పాత్ర పోషించే వారు. అలా అందరూ వెంటనే ఇన్వాల్వ్‌ అయి, ఆ ఆర్బీకే పరిధిలో ఈ–క్రాప్‌ ఆధారంగా పంటను కొనుగోలు చేసే వారు. ఇప్పుడవన్నీ కనుమరుగయ్యాయి.
    రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు యూరియా,  ఎరువులు ఇవన్నీ కూడా ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే సరఫరా చేసే పరిస్థితి ఇవాళ లేకుండా పోయింది. నియోజకవర్గానికి ఒక అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ కూడా ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితి జరుగుతోంది. వ్యవసాయానికి సంబంధించిన అన్ని రంగాలూ ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. 

ప్రభుత్వమే కొనుగోలు చేయాలి:
    చంద్రబాబునాయుడిని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నా. 76 వేల మంది రైతులు 2.20 లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేస్తుండగా, 6.45 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. ఈ 76 వేల మంది రైతులకు మీరే రూ.12 వేల చొప్పున వారి బ్యాంక్‌ ఖాతాల్లో వేయాలి. ఆ పంటను మీరే కొనుగోలు చేసి, ఆ తర్వాత మీరే (ప్రభుత్వం) మార్కెట్‌లో అమ్మాలి. 
    మామిడిని ఫ్యాక్టరీలు కొనుక్కోక, రైతులకు కనీసం రెండున్నర, మూడు రూపాయలు కూడా దక్కని పరిస్థితుల్లో.. ఆ సరుకు వాహనాల్లోనే  కుళ్లిపోతోంది. మామిడి రైతులు చివరకు లారీ కిరాయి కూడా ఇవ్వలేక అగచాట్లు పడుతున్నారు. అందుకే ఆ రైతులకు తోడుగా ఉండాలని కోరుతున్నాను.
    ప్రభుత్వం స్వయంగా వెంటనే మామిడి కొనుగోలు చేసి, రైతులను ఆదుకోకపోతే వారి పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ గట్టిగా ఉద్యమిస్తుందని హెచ్చరిస్తున్నాను. 

కట్టడి ప్రయత్నాలు అత్యంత దారుణం:
    శశిధర్‌ రెడ్డి అనే వ్యక్తి.. తాను రైతు కుటుంబం కాదా? అని అడుగుతున్నా. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి  బతుకుతున్నారు. చిత్తూరు జిల్లాలో దాదాపు 80 శాతం మంది వ్యవసాయం మీద బతుకుతున్నారు. మరి వీళ్లంతా రైతు బిడ్డలు కాదా?. ఇక్కడికి రావొద్దని దాదాపు 1200 మంది రైతులను నిర్భంధించారు. ఇక్కడికి వచ్చిన రైతులపై విచ్చలవిడిగా లాఠీఛార్జ్‌ చేశారు. ఇది అత్యంత దారుణం.

పలికేది జగన్‌ ఒక్కడే. గుర్తుంచుకొండి:
    ప్రతి పోలీసు అధికారికీ ఒకటే చెబుతున్నా. అయ్యా ప్రతి పోలీస్‌ సోదరుడా.. మీకు కూడా సమస్యలుంటాయి. ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా.. పలికేది ఒక్క జగన్‌ మాత్రమే. పొగాకు రైతులకు సమస్య అయినా జగనే పలుకుతున్నాడు. మామిడి రైతుల సమస్యలపైనా జగనే పలుకుతున్నాడు. మిర్చి రైతులైనా జగనే పలుకుతున్నాడు. ఉద్యోగుల సమస్యలైనా.. వాళ్లకు మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇవ్వాలన్నా, వేతనాల సవరణ (పీఆర్సీ) డిమాండ్‌ చేయాలన్నా, వాళ్లకు కరవు భత్యం (డీఏ) ఇప్పించాలన్నా, చివరికి చంద్రబాబునాయుడు హామీలను నిలదీస్తూ, ఆయన్ను గట్టిగా ప్రశ్నించాలన్నా, ఆయన సూపర్‌ సిక్సు, సూపర్‌ సెవెన్లు అమలు చేయకుండా మోసం చేసిన వైనాన్ని ఎండగట్టాలన్నా.. జగన్‌ మాత్రమే ముందుంటాడు.  ప్రతి పోలీస్‌ సోదరుడు దీన్ని గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నాను.
    అధికారంలో ఉన్న ఆ ఎస్పీలు, డీఐజీలు, సీఐల మాటలు వినకండి. వాళ్ల ప్రలోభాలకు లొంగకండి. రేప్పొద్దున మీ సమస్యలపైనా ఇదే మాదిరిగానే చంద్రబాబు మిమ్మల్ని మోసం చేసి రోడ్డున పడేస్తే.. అప్పుడు జగన్‌ అనే వ్యక్తే ముందుకు వస్తాడు. లేదంటే ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడేవాడు ఎవడూ ఉండడు. అసలు సమస్యలే లేనట్లు వక్రీకరిస్తారు. డ్రామాలాడతారు. తప్పుదోవ పట్టిస్తారు. అలా సమస్యలను గాలికి వదిలేసే పరిస్థితి వస్తుంది. ఇంకా అందరూ నష్టపోయే కార్యక్రమం కూడా జరుగుతుందని ప్రతి పోలీస్‌ సోదరుడికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని శ్రీ వైయస్‌ జగన్‌ చెప్పారు.

Back to Top