తుని: గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై రోజూ దుష్ప్రచారాలు, అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి, అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వెల్లడించారు. గత ఏడాది అధికారంలోకి రాగానే, ఈ ఏడాది సంక్రాంతిలోగా అన్ని రోడ్లు మరమ్మతు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించి, ఏకంగా రోడ్‌రోలర్ ఎక్కి పనులు ప్రారంభిస్తున్నట్లు ఫోటోలకు ఫోజులిచ్చిన సీఎం చంద్రబాబు, వాస్తవంగా ఎక్కడా ఆ పనులు పక్కాగా చేయించలేదని ఆయన తెలిపారు. గత 15 నెలలుగా ఎలాంటి మరమ్మతులు లేక, అక్కడక్కడా చేసినా, అత్యంత నాసిరకం పనుల వల్ల రాష్ట్రంలో రోడ్లన్నీ దారుణంగా ఛిద్రమయ్యాయని తునిలో మీడియాతో మాట్లాడిన దాడిశెట్టి రాజా చెప్పారు. ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఏం మాట్లాడారంటే..: దీనికి ఏం సమాధానం చెబుతారు?: రెగ్యులర్‌గా రహదారులు భవనాల శాఖ చేసే రోడ్ల మరమ్మతు పనులను కూడా పబ్లిసిటీ పిచ్చితో, స్వయంగా రోడ్ రోలర్ ఎక్కి, రోడ్డుపై ఇంత మట్టి పోసి మొదలుపెట్టి, రాష్ట్రమంతా అది ఒక పెద్ద కార్యక్రమంలా జరుగుతుందంటూ విపరీతంగా ప్రచారం చేసుకున్న చంద్రబాబు, ఆ పనుల్లో ఎక్కడా చిత్తశుద్ధి చూపలేదు. నిజానికి పలు చోట్ల మంత్రులు కూడా సీఎం మాదిరిగా రోడ్ రోలర్లు ఎక్కి, రహదారుల మరమ్మతు చేస్తున్నట్లు ఫోజులు ఇచ్చారు. అలా రాష్ట్రంలో ఏకంగా 18 వేల కి.మీ రోడ్లకు మరమ్మతు చేసి, పూర్తిగా అద్దంలా మార్చామని కూటమి ప్రభుత్వం జోరుగా ప్రచారం చేసుకుంది. అందుకు వేల కోట్లు ఖర్చు చేసినట్లు ప్రకటించారు. కానీ, అటు ఏజెన్సీ ఏరియాలతో పాటు, ఇటు పలు చోట్ల అత్యంత దారుణంగా రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి. అవన్నీ కళ్ల ముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. వాటి కోసం ఖర్చు చేసిన వేల కోట్లు ఏమయ్యాయి? ఎక్కడికి పోయాయి? దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో..: అదే గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో రెండేళ్లు కరోనా సంక్షోభం ఉన్నా, ఏ ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు ఆపలేదు. పథకాలన్నీ డీబీటీ ద్వారా అమలు చేయడంతో, సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. మార్కెట్‌లో మనీ సర్క్యులేట్ అయింది. దీంతో ఎక్కడా ఎవరూ ఏ ఇబ్బంది పడలేదు. అదే సమయంలో రోడ్ల మరమ్మతుల కోసం నాడు దాదాపు రూ.43 వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది. కానీ, ఇప్పుడు కేవలం 15 నెలల్లో దాదాపు రూ.2 లక్షల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం, తెచ్చిన డబ్బంతా ఏం చేస్తోంది? పథకాలు లేవు. సంక్షేమ కార్యక్రమాలు అంతకన్నా లేవు. రోడ్ల మరమ్మతుల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తే, అవి ఇంత దారుణంగా ఛిద్రమవుతాయా!. (అంటూ రాష్ట్రంలో రోడ్ల దుస్థితి ఫోటోలు చూపారు). ఆ మాటకు కట్టుబడతారా?: నాడువైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబుగారు, ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అసత్య ఆరోపణలు చేశారు. రోడ్ల మరమ్మతులో నాణ్యత లేదంటూ, ఆ పనులు చేసిన వారిని (కాంట్రాక్టర్లు), చేయించిన వారిని (అధికారులను) జైల్లో పెట్టాలని స్టేట్‌మెంట్ ఇచ్చారు. మరి ఇప్పుడు చంద్రబాబు దానికి కట్టుబడి ఉంటారా? తమ ప్రభుత్వంలో ఇంత హేయంగా రోడ్ల మరమ్మతులు చేసిన వారిపై చర్య తీసుకుంటారా?. రూ.500 పెట్టినా యూరియా దొరకడం లేదు: సీజన్ ప్రారంభమైనా యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. యూరియా డిమాండ్‌ను అంచనా వేయడం, కేంద్రం నుంచి తెప్పించడంలో ఈ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. దానిపై మంత్రి కనీసం సమీక్ష కూడా జరిపిన దాఖలా లేదు. గత ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల ద్వారా రైతులకు అవసరమైన యూరియా అందేది. అప్పుడు రూ.270కే యూరియా అందగా, ఇప్పుడు రూ.500 పెట్టినా అస్సలు దొరకడం లేదు. పవన్ ఇకనైనా డ్రామాలు ఆపండి: గత ఎన్నికల ముందు సుగాలి ప్రీతి కేసును పదేపదే ప్రస్తావించి, ఆమె తల్లికి ఎన్నెన్నో హామీలు ఇచ్చిన ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, తన మాట నిలబెట్టుకోవడంలో దారుణంగా విఫలమయ్యారు. సుగాలి ప్రీతి కేసును ఫస్ట్ కేసుగా తీసుకుంటామన్న ఆయన, 15 నెలలు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు. చివరకు సుగాలి ప్రీతి తల్లి విజయవాడ వచ్చి, తన గోడు మీడియాకు చెప్పుకోవడంతో, నేరుగా సమాధానం చెప్పని పవన్‌కళ్యాణ్, విశాఖ పర్యటనలో ఉండి డ్రామా చేశారు. రుషికొండ భవనాలు సందర్శించి, గత మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ఏవో ప్రకటనలు చేశారు. పవన్‌కళ్యాణ్‌కు తన మాటలపై చిత్తశుద్ధి ఉంటే, ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ కట్టిపెట్టి, సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తేల్చి చెప్పారు.