తాడేపల్లి: 11 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో జనసేన పార్టీ, పవన కళ్యాణ్ ల వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని వైయస్ఆర్‌సీపీ కృష్జా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కుల, మత, రాజకీయాల్లో అవసరం మేరకు స్టాండ్ మార్చే పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఆయన్ను నమ్మి వచ్చిన వారికే అర్థం కావడం లేదని తేల్చి చెప్పారు. 2017లో సుగాలీ ప్రీతి హత్య జరిగితే... వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆధారాలు ఎలా తారుమారు అవుతాయని పవన్ కళ్యాన్ ను ప్రశ్నించారు. ప్రధాని మోదీ, అమిత్ షాలు తనకు అత్యంత సన్నిహితులని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్... స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై వారిని ఎందుకు ఒప్పించడం లేదని నిలదీశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... మీ కార్యకర్తలకే అర్థం కాని ఐడియాలజీ: మీ ఐడియాలజీని, ప్రాగ్మిటిజమ్ మిమ్నల్ని నమ్మి మీ వెనుక వచ్చినవారే అర్థం కాక సతమతమవుతున్నారు. మీ ఐడియాలజీ అసలు ప్రాగ్మటిజమా ఇంకేదైనా అన్నది కూడా అర్థం కావడం లేదు. కులం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడుపుతున్న మీ ఐడియాలజీ చూస్తే .. ఒక్కోసారి ఒక్కోరకమైన మాటలు మాట్లాడారు. మీకు అవసరం ఉన్నప్పుడు ఒకరకమైన కులవాదన, అవసరం తీరాక మరొకరకమైన కులవాదన మాట్లాడుతున్న మీది ఏ రకమైన ఐడియాలజీ అన్నది ప్రజలతో పాటు మీ కార్యకర్తలకు అర్థం కాలవడం లేదు. మతం గురించి కూడా వివిధ సందర్భాల్లో భిన్నమైన మాటలు మాట్లాడారు. కాసేపు మతం గురించి హిందూనాయకులే గొడవులు పెడతారని మాట్లాడారు. మీ నాయనమ్మ దీపారాధన చేస్తే మీ తాతయ్య సిగరెట్ వెలిగించుకునేవారని చెప్పారు. ఇంకో సందర్బంలో నేను బాప్టిజమ్ తీసుకున్నానని చెప్పారు. మరోసారి నేను అన్ అపాలజిటిక్ సనాతనీ హిందూ అని చెబుతుంటారు. ఇప్పుడేమో మతం లేదంటున్నారు. రేపు ఇంకేం అంటారో ఆ భగవంతుడు కూడా పసిగట్టలేడు. మీ రాజకీయ సిద్ధాంతం చూస్తే.. మీ కార్యాలయం అంతా చేగువేరా, మాయవతి, అనంతరం కమ్యూనిస్టులతో సాగిన మీ ప్రయాణం ఆ తర్వాత కాషాయ బట్టలతో సాగి ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కొనసాగుతున్నారు. మీది ఒక్క సిద్ధాంతం కాదు. లెఫ్టిజం, రైటిజం, సెంట్రలిజం అన్ని కలిసి పవనిజం మీది. సుగాలీ ప్రీతి హత్యపై పచ్చి అబద్దాలు: నారా చంద్రబాబు నాయుడు, మీరు కలిసి ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ హయాంలో 2017 ఆగష్టులో అనుమానాస్పదంగా సుగాలీ ప్రీతి అనే బాలిక మరణిస్తే.. దానిమీద మీ అభిప్రాయాలు కూడా రకరకాలుగా మారిపోయాయి. బాధిత కుటుంబానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 5 సెంట్ల ఇండ్ల స్థలం, 5 ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం మన పోరాట ఫలితంగా ఇస్తే.. ఇవాళ సుగాలీ ప్రీతి తల్లి మన మీద రాళ్లేస్తుందని మీ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో మాట్లాడారు. వాస్తవానికి 2017 ఆగష్టులో సుగాలీ ప్రీతిని హతమార్చారు. ఆ కేసులో స్కూల్ కరస్పాండెంట్, మిగిలిన నిందితులను సెప్టంబరులో అరెస్టు చేస్తే.. అదే ఏడాది అక్టోబరులో వారికి బెయిల్ వచ్చింది. సంఘటనా స్థలంలో ఆధారాలు, డీఎన్ ఏ ముద్దాయిలతో సరిపోలడం లేదని విడిచిపెట్టారు. మీరు ఆ రోజు ఏం మాట్లాడకుండా ఎన్నికల ప్రచారంలో వంద రోజుల్లో సీబీఐ విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. వాస్తవానికి 2022 లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సుగాలి ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం, 5 సెంట్ల ఇండ్ల స్థలం, 5 ఎకరాల భూమి ఇవ్వడంతో పాటు, హత్యా కేసుపై సీబీఐ విచారణ చేయాలని కోరారు. ప్రధానితో నేరుగా మాట్లాడగలనని చెప్పే మీరు ఆరోజు ఎందుకు ఈ కేసులో సిబీఐ విచారణ చేయాలని అడగలేదు. ఇప్పుడు మరలా మాట మారుస్తూ.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం హత్యకు సంబంధించిన సాక్ష్యాధారాలను చెరిపేసిందని అత్యంత కిరాతకంగా మాట్లాడుతున్నారు. మీరు, చంద్రబాబు కలిసి ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ హయాంలో సుగాలీ ప్రీతి హత్య, ముద్దాయిల అరెస్టు, ఆధారాలు సరిపోలక పోవడంతో వారు విడుదల అయితే... వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆధారాలు ధ్వంసం చేసిందని ఏ రకంగా మాట్లాడతారు. గత ఎన్నికల ప్రచారంలో సుగాలీ ప్రీతి మరణంపై సిబీఐ విచారణ చేసి న్యాయం చేస్తానని మాట్లాడి మీరు మర్చిపోతే... ఇవాళ ఆ తల్లి ఆక్రోషంతో మీ కార్యాలయాలు, ప్రభుత్వం చుట్టూ తిరుగుతుంటే, మీరు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదు. పైగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తే దాన్ని కూడా మీ ఖాతాలో వేసుకోవడాన్ని ఏ ఇజం అంటారు పవన్ కల్యాణ్..? ప్రాగ్మటిజమ్ అంటే ఇదేనా ? ఇంత పచ్చి అబద్దాలు ఆడుతున్న నీకు పాపం చుట్టుకోదా పవన్ కళ్యాణ్..? నిబద్దత లేని రాజకీయ విధానాలు: ఇక జనసేన పార్టీ పెట్టిన తర్వాత 10 ఏళ్లలో రకరకాలుగా మారిన మీ రాజకీయ విధానాలు, మీ నిబద్దత, వివిధ సందర్భాల్లో మీరు మాట్లాడిన మాటలు చూస్తే మీ కార్యకర్తలే ఆశ్చర్యపోతారు. టీడీపీ పల్లకీ ఇక మోయలేం, భుజాలు అరిగిపోయాయని చెప్పిన మీరు, కుక్కకు బిస్కెట్లు వేసినట్లు టీడీపీ మనకు పదో, పదిహేను సీట్లు వేస్తుందనీ మీరే చెప్పారు. ఆ తర్వాత ఆ మాట మీద కూడా నిలబడకుండా మీ అంతటి మీరే మనకు పోల్ మేనేజిమెంట్ తెలియదు, అన్ని స్ధానాల్లో పోటీ చేసే సత్తా లేదని చేతులెత్తేసిన మాట నిజం కాదా ?అందులో భాగంగా మరలా తెలుగుదేశం పార్టీని భుజానకెత్తుకుని మోయాలని చెప్పి మీ కార్యకర్తలనే ఆశ్చర్యపరిచిన ఐడియాలజి మీది. స్టీల్ ప్లాంట్ విషయంలో మీది పచ్చి దగా: వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మీ స్పందన చూస్తే.... ఆ రోజు ప్రతిపక్షంలో వైయస్ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆపామని చెబుతున్నారు. వాస్తవానికి స్టీల్ ప్లాంట్ కు సంబంధించి రూ.14 వేల కోట్లు అప్పులు కట్టాల్సిన అవసరం ఉందని తీర్మానం చేసిన కేంద్రం రూ.11,400 కోట్లు మాత్రమే చెల్లిస్తామని స్పష్టం చేసింది. అందులో రూ.8,500 కోట్లు మాత్రమే విడుదల చేయగా.. మరో రూ.3 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇంకా రూ.3 వేల కోట్లు రావాల్సి ఉందని చెబుతోంది. కేంద్రం ఈ రూ.8,500 కోట్లు జీఎస్టీ బకాయిలు కట్టడానికి ఇచ్చింది. ఈ డబ్బులు తిరిగి కేంద్రానికే వెళతాయి. అంటే కేంద్రం ఒక జేబులో తీసి మరో జేబులో పెట్టుకుంటున్నారు. ఇంకా బ్యాంకు రుణాలు చెల్లింపు, వీఆర్ ఎస్ తీసుకున్న 1440 మంది ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.500 కోట్లు చెల్లించడానికి సరిపోతుంది. స్టీల్ ప్లాంట్ లో సుమారు 14000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే... కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4వేల మందికి ఉద్వాసన చెప్పిన మాట వాస్తవం కాదా.? త్వరలోనే మరో 2వేల మందిని ఇంటికి పంపించడానికి మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు సిద్ధంగా ఉన్న మాట నిజం కాదా? ఇదీ కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు చేస్తున్న మేలు. స్టీల్ ప్లాంటులో 18 వేల మంది శాశ్వత ఉద్యోగులుంటే... కూటమి ప్రభుత్వంపై నమ్మకం లేక 1440 మంది వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకున్నారు. మరో వేయి మంది అదే బాటలో ఉన్నారు. 8 వేల మంది పదవీ విరమణ చేశారు. ఇది కాక స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భూములిచ్చిన వారిలో 8 వేల మంది నిర్వాసితులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వారందరికీ ఉద్యోగాలిస్తామని మీరు, చంద్రబాబు కలిసి ఇచ్చిన హామీ ఏమైంది? ఒక్క కొత్త ఉద్యోగ నియామకం కూడా మీరు వచ్చిన తర్వాత జరగలేదు. ఆ మిగిలిన వారికి కేవలం 75 శాతం మాత్రమే జీతాలు చెల్లిస్తూ.. వారికి రావాల్సిన ఇతర భత్యాలన్నీ నిలిపివేశారు. మరి మీరు ఎక్కడ, ఏ విధంగా స్టీల్ ప్లాంటును కాపాడినట్టు, ఎవరిని మోసం చేయడానికి ఇంత వంచన మాటలు చెబుతున్నారు.? స్టీల్ ప్లాంటులో కీలకమైన వాటితో సహా 32 విభాగాల ప్రయివేటీకరణకు టెండర్లు ఆహ్వానించారు. ఇవన్నీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్న నిర్ణయాలే. మీకు అత్యంత సన్నిహతులు అని చెప్పుకుంటున్న మీ ఢిల్లీ బాగస్వామిలే ఈ ప్రయివేటీకరణ నిర్ణయం తీసుకుంటే.. మీరు మాత్రం స్టీల్ ప్లాంటును కాపాడానని చెబుతున్నారు. ఇదా మీ ఐడియాలజీ ? రుషికొండ బదులు స్టీల్ ప్లాంట్ కు ఎందుకు వెళ్లలేదు..? విశాఖపట్నంలో పార్టీ సమావేశాల్లో పాల్గొంటూ మీరు రెండో దఫా తనివితీరా రుషికొండ టూరిజం రిసార్ట్స్ చూడ్డానికి వెళ్లారు. అందుకు బదులుగా ప్రయివేటీకరణ కాకుండా మీరు ఆపిన.. విశాఖ స్టీల్ ప్లాంట్ చూడ్డానికి ఎందుకు వెళ్లలేకపోయారు ? వేలాది మంది ఉద్యోగుల అభినందనల మధ్య మీరు సాధించిన విజయంపై సంబరాలు ఎందుకు చేసుకోలేకపోయారు పవన్ కళ్యాణ్ ? స్టీల్ ప్లాంట్ బ్రతకాలంటే క్యాప్టివ్ మైన్ అలాట్ మెంట్ ఒక్కటే మాత్రమని చెప్పి గతంలో విశాఖలో దీక్ష చేసిన మీరు ఆ రోజు జనాల దగ్గర అర్జీలు తీసుకోవడానికి నోవాటెల్ హోటల్ కి వెళ్లానని చెప్పారు. మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు అర్జీలు తీసుకోవడం లేదు. అప్పుడు మిమ్నల్ని అంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ప్రయత్నం చేశారని చెప్పారు. నాకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అత్యంత సన్నిహితులు.. కానీ వారి సహాయం తీసుకోలేదు. నేనే పోరాటం చేసి బయటకు వచ్చానని చెబుతున్నారు. ఆ రోజు నోవాటెల్ కు ఊరేగింపుగా వెళ్లి అర్జీలు తీసుకున్న మీరు ఇవాళ ఎందుకు ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకోవడం లేదు ? మీకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు అంత సన్నిహితులు అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడ్డాం కోసం ఒక క్యాప్టివ్ మైన్ కేటాయించాలని ఎందుకు అడగలేకపోయారు ? ఇప్పడైనా ఈ రాష్ట్ర ప్రజల మీద అంత ప్రేమ ఉంటే.. మోదీ, అమిత్ షాలకు ఫోన్ చేసి ప్రయివేటీకరణకు సిద్ధమైన స్టీల్ ప్లాంట్ 32 విభాగాల టెండర్లు రద్దు చేయించండి. మీ ప్రాగ్మటిజంని నిరూపించండి పవన్ కళ్యాణ్. వైజాగ్ కి మీరు ఏం చేశారు ? ప్రయివేటీకరణ అపడానికి మీరు చేసిన ప్రయత్నం ఎక్కడ ? ఆ రోజు వైయస్ఆర్‌సీపీకి 151 మంది ఎమ్మెల్యేలు 23 మంది ఎంపీలుండి స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణ వద్దని ప్లకార్డు పట్టుకునే దమ్ముందా ? అని మమ్నల్ని ప్రశ్నించారు. ఇవాల మీకేముంది పవన్ కళ్యాణ్ ? కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీతో భాగస్వామ్యులుగా ఉన్నారు. ఇద్దరు ఎంపీలు మీ పార్టీకి ఉన్నారు. పార్లమెంటులో మీరు ఇవాళ ఎందుకు చెలరేగిపోవడం లేదు? మీరు చేస్తున్న పోరాటం ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ అర్ధం అవుతుంది. దసరాకి రైతుల కోసం రోడ్డెక్కమనండి: జనసైనికులు అందరూ దసరాకి పూజ చేయాలని చెబుతూ.. ఆయుధాలు చేతపూని రోడ్ల మీదకు ఎవరిని చంపడానికి రమ్మని చెబుతున్నారు?. ఆయుధాలతో రోడ్లమీదకు వచ్చి రైతులకు యూరియా ఇప్పించండి అని చెప్పారా ? అధిక ధరకు యూరియా అమ్ముతున్న వాళ్ల దగ్గరకు ఆయుధాలతో వెళ్లి రైతులకు న్యాయం చేయమని ఎందుకు చెప్పడం లేదు. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు అల్లాడుతున్నారు. మా ప్రభుత్వంలో గత ఐదేళ్లలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతు లేడు. ఇప్పుడురైతుభరోసా కేంద్రాలను తీసేశారు. ప్రాధమిక వ్యవసాయ సహకార సంగాల్లో టీడీపీ కార్యకర్తలు యూరియా బస్తాలు ఎత్తుకెల్లి బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. కేంద్రం నుంచి ఎరువులు రావాలి కాబట్టి... మీకు అత్యంత సన్నిహితులైన మోదీ, అమిత్ షాలకు ఫోన్ చేసి యూరియా, నత్రజని తెప్పించండి. చివరికి రైతులకు ఉచితంగా ఇచ్చే వేరుశెనగ విత్తనాలను కూడా టీడీపీ నేతలు అమ్ముకుంటున్నారు. దానిపై పోరాటం చేయమని చెప్పండి. మీరు పదవులు తీసుకుని అనుభవించాలి, మీ కార్యకర్తలను మాత్రం సర్దుకోమ్మని చెబుతారు. మీరిచ్చిన హామీలు గురించి మాత్రం మాట్లాడరు. నియోజకవర్గానికి 500 మంది దళితులకు రూ.10 లక్షలు పెట్టుబడితో పరిశ్రమల పెట్టిస్తానన్న హామీ ఏమైంది ? ఇంకెన్నాళ్లు రకరకాల అభిప్రాయాలను రాసుకొచ్చి మాటల గారడీ చేస్తారు. మీ 11 ఏళ్ల ప్రయాణంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం సాధించి పెట్టారు, మీ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిటో మిమ్నల్ని మీరు ప్రశ్నించుకొండి అంటూ పవన్ కళ్యాణ్ ను పేర్ని నాని నిలదీశారు.