ప్రమాదపు అంచున బెజవాడ వాసులు

బుడమేరు ముంపు సమస్యపై కూటమి సర్కార్ మొద్దునిద్ర

చంద్రబాబు అసమర్థ పాలనలో అరచేతిలో ప్రాణాలతో ప్రజలు

ఏడాది కాలంగా ఆధునీకరణ పనులను అటకెక్కించిన సీఎం చంద్రబాబు

వరదల్లో పబ్లిసిటీ కోసం పడిన తపన బాధితులను ఆదుకోవడం లేదు

మండిపడ్డ వైయస్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్

తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో  మీడియాతో  మాట్లాడిన దేవినేని అవినాశ్‌

చినుకు ప‌డితే విజ‌య‌వాడ వాసుల‌కు కునుకు ప‌ట్టడం లేదు 

బుడమేరు వ‌ర‌ద‌ విల‌యానికి ఏడాది పూర్తి

నేటికీ బాధితుల‌కు అందని సాయం

ప్రజల కోసం వైయ‌స్ జ‌గ‌న్‌లా నిజాయితీ, చిత్తశుద్ధితో ప‌నిచేయాలి

ఆయ‌న రిటైనింగ్ వాల్ క‌ట్టించక‌పోయుంటే ఈరోజు కృష్ణ‌లంక ఉండేదా ?

ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన దేవినేని అవినాశ్‌

తాడేప‌ల్లి: బుడమేరు వరద ముంపుతో ప్రమాదపు అంచున బెజవాడ వాసులు బెంబేలెత్తుతుంటే, సీఎం చంద్రబాబు మాత్రం ఏడాది కాలంగా బుడమేలు ఆధునీకరణ పనులను అటకెక్కించి మొద్దు నిద్రపోతున్నారని వైయస్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది వరదల్లో పబ్లిసిటీ స్టంట్‌లతో హడావుడి చేసిన సీఎం చంద్రబాబు, బుడమేరు ముంపు శాశ్వత పరిష్కారం కోసం చిత్తశుద్దితో చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని లక్షలాధి మంది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే విధంగా, కూటమి ప్రభుత్వ అసమర్థ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. కనీసం ప్రజలకు రక్షణ కల్పించాలనే ఇంగితం కూడా లేని దుర్మార్గమైన ప్రభుత్వానికి చంద్రబాబు నాయకత్వం వహిస్తున్నారని దుయ్యబట్టారు. ఇంకా ఆయనేమన్నారంటే...

చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలోని కూట‌మి ప్ర‌భుత్వాన్ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించినా ల‌క్ష్య‌పెట్ట‌క‌పోవ‌డం వ‌ల్ల గ‌తేడాది బుడ‌మేరు వ‌ర‌ద‌ల‌కు విజ‌య‌వాడ న‌గ‌రం మునిగిపోయింది. దాదాపు 50 మందికిపైనే ప్రాణాలు కోల్పోయారు. వ‌ర‌ద‌ల విష‌యంలో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా వ్వ‌వ‌హ‌రించి కొండ ప్రాంతాల్లో నివ‌సించే వారిని ఖాళీ చేయించ‌ని కార‌ణంగా విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో కొండ‌చ‌రియ‌లు విరిగి ప‌డి ఆరుగురు మృత్యువాత ప‌డ్డారు. మ‌రెన్నో కుటుంబాలు నిరాశ్ర‌యుల‌య్యారు. బాధితులు దాదాపు నెల‌రోజులపాటు వ‌ర‌ద నీటిలోనే బ‌త‌కాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. చంద్ర‌బాబు అస‌మ‌ర్థ‌త, హెచ్చ‌రిక‌ల ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌ల్ల జ‌రిగిన ఈ దుర్ఘ‌ట‌నకి ఏడాది పూర్త‌యినా బాధితుల‌కు ఇంత‌వ‌ర‌కు న్యాయం జ‌ర‌గ‌లేదు. విజ‌య‌వాడ‌లోని 32 డివిజ‌న్ల ప్ర‌జ‌లు సర్వం కోల్పోయారు. విజ‌య‌వాడ న‌గరంలో 79 వేల గృహాలు సంపూర్ణంగా, ఫ‌స్ట్ ఫ్లోర్‌లో ఉన్న‌ 14 వేల గృహాలు పాక్షికంగా దెబ్బ‌తిన్నాయి. సింగ్ న‌గ‌ర్ ప్రాంతంలో ఎంతో మంది ఆటో డ్రైవ‌ర్లు వాహ‌నాలు దెబ్బ‌తిని వారి కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయి. దాదాపు 60 వేల కోళ్లు, 222 ప‌శువులు మృత్యువాత ప‌డ్డాయి. దాదాపు రూ. 6800 కోట్లు న‌ష్టం వాటిల్లింద‌ని, త‌క్ష‌ణ సాయం కింద రూ. 602 కోట్లు ఇస్తున్న‌ట్టు  ప్రభుత్వ‌మే ప్ర‌కటించింది. న‌ష్ట‌ప‌రిహారం చెల్లింపుల్లో స‌ర్వేల పేరిట కాల‌క్షేపం చేశారే కానీ బాధితుల‌కు న్యాయం చేయ‌లేదు. వ‌ర‌ద బాధితులు ధ‌ర్నా చేస్తే స‌చివాల‌యంలో న‌ష్టం వివ‌రాల‌ను న‌మోదు చేసుకోవాల‌ని సూచించారే కానీ అక్క‌డికెళితే అధికారులు చేతులెత్తేశారు. అక్క‌డ్నుంచి బాధితులు క‌లెక్ట‌రేట్‌కి వెళితే వ‌ర‌ద బాధితులు లోప‌లికి రాకుండా గేట్ల‌కు తాళాలేసి పోలీసుల‌ను కాప‌లా ఉంచారు. సాయం కోసం వ‌చ్చిన వ‌ర‌ద బాధితుల‌ను ఈ ప్ర‌భుత్వం ఘోరంగా అవ‌మానించింది. 

వరదల్లో బాబు పబ్లిసిటీ స్టంట్స్

బుడమేరు బాధితుల‌కు సాయం అంద‌లేద‌ని టీడీపీ ఎమ్మెల్యేలే చెప్పారు. వ‌ర‌ద‌లొచ్చిన‌ప్పుడు బోటుల్లో, ట్రాక్ట‌ర్ల మీద‌, జేబీసీల్లో తిరుగ‌తూ చంద్ర‌బాబు ప‌బ్లిసిటీ చేసుకున్నాడు. మెయిన్ రోడ్డులో ఉన్న కుటుంబాల‌కు మాత్ర‌మే పులిహోర, పెరుగ‌న్నం పంచి అంద‌ర్నీ ఆదుకున్న‌ట్టు షో చేశారు. చాలా మంది నిరాశ్ర‌యుల‌కు ఈ ప్ర‌భుత్వం క‌నీసం మంచి నీళ్ల బాటిల్ కూడా ఇవ్వ‌లేక‌పోయింది. వైయ‌స్సార్సీపీ త‌ర‌ఫున ప్ర‌భుత్వం చేర‌లేని ప్రాంతాల‌కు వెళ్లి బాధిత కుటుంబాల‌ను క‌లిసి రూ. కోటి విలువైన నిత్య‌వ‌స‌ర స‌రుకులు పంపిణీ చేశాం. మా నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్ ముంపు ప్రాంతాల్లో వ‌ర‌ద‌ల్లో తిరిగి ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే త‌ప్ప ప్ర‌భుత్వంలో క‌ద‌లిక రాలేదు. బాధితులంద‌ర్నీ ఆదుకుంటామ‌ని చంద్ర‌బాబు గొప్ప‌గా ప్ర‌క‌ట‌న‌లు చేశారే కానీ దుర్ఘ‌ట‌న జరిగి ఏడాది గ‌డిచినా బాధితుల‌కు ఈ రోజుకీ న్యాయం జ‌ర‌గ‌లేదు. మృతుల కుటుంబాల‌ను ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఏ ఒక్క‌రూ క‌నీసం ప‌రామ‌ర్శించిన పాపాన‌పోలేదు. గ‌తేడాది జ‌రిగిన డీఆర్సీ స‌మావేశంలో తెలుగుదేశం ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమ‌, గ‌ద్దె రామ్మోహ‌న్ లు బాధితుల‌కు నష్ట ప‌రిహారం ఇప్ప‌టికీ అంద‌లేద‌ని, ప్ర‌జ‌ల్లో తిర‌గ‌లేపోతున్నామ‌ని చెప్పిన మాట వాస్త‌వం కాదా?  నందిగామ‌, మైల‌వ‌రం శాస‌న‌స‌భ్యులు తంగిరాల సౌమ్య‌, వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ సైతం కంచిక‌చ‌ర్ల‌, నందిగామ‌, కొండ‌ప‌ల్లి, ఇబ్ర‌హీంప‌ట్నం ప్రాంతాల్లో వ‌ర‌ద‌ల వ‌ల్ల తీవ్ర న‌ష్టం వాటిల్లింద‌ని చెప్పినా ఈ ప్ర‌భుత్వం, సీఎం చంద్ర‌బాబు ప‌ట్టించుకోలేదు. 

వ‌ర‌ద సాయంలోనూ భారీగా అవినీతి 

వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవాల‌ని దాత‌లు స్పందించి విరాళాలిస్తే అందులోనూ విచ్చ‌ల‌విడిగా అవినీతి చేసిన ఘ‌ట‌న కూట‌మి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల‌కే దక్కుతుంది. అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, వాట‌ర్ బాటిల్స్‌, ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేసిన‌ట్టు త‌ప్పుడు లెక్క‌లు చూపించి భారీగా దోచుకుతిన్నారు. వ‌ర‌ద సాయం గురించి వివ‌రాలివ్వాల‌ని మేం డిమాండ్ చేసినా ప్రభుత్వంలో క‌నీసం స్పంద‌న రాలేదు. నిజంగా అవినీతికి పాల్ప‌డ‌క‌పోయుంటే దేనికి ఎంత ఖ‌ర్చు పెట్టారో లెక్క‌లు చూపించ‌డానికి కూట‌మి నాయ‌కులు ఎందుకు వెన‌క‌డుగు వేసిన‌ట్టు? ఇరిగేష‌న్ శాఖ మంత్రి రామానాయుడు ఆప‌రేష‌న్ బుడ‌మేరు పూర్త‌య్యే వ‌ర‌కు అక్క‌డే ఉంటాన‌ని డ్రామాలు చేశాడు. కానీ ఏడాది క్రితం మొద‌లైన ప‌నులు ఇప్ప‌టికీ అలాగే ఉన్నాయి. దీంతో రెండు నెల‌లుగా కురుస్తున్న వ‌ర్షాల‌కు ఈ ప్రాంత వాసులకు రాత్రుళ్లు కంటి మీద కునుకు రావ‌డం లేదు. వ‌ర‌ద‌లకు శాశ్వ‌త ప‌రిష్కారం చూపించి విజ‌య‌వాడ వాసుల‌కు ఇప్ప‌టికీ భ‌రోసా ఇవ్వ‌డంలో ఈ ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌ల‌మైంది. 

కృష్ణలంక వాసులకు రక్షణగా రిటైనింగ్ వాల్

వైయస్ జగన్ హయాంలో నిర్మించిన రిటైనింగ్ వాల్ లేక‌పోయుంటే కృష్ణానది వరదకు కృష్ణ‌లంక తుడిచిపెట్టుకుపోయేది. సీఎం చంద్ర‌బాబు త‌న గొప్ప‌త‌నాన్ని మైకుల ముందు  చెప్పుకోవ‌డం, పేప‌ర్ ప్ర‌క‌ట‌న‌ల్లో చూపించ‌డం కాదు. ఆప‌రేష‌న్ బుడ‌మేరు ప‌నులు పూర్తి చేయాలి. వ‌ర‌ద బాధితుల‌కు పూర్తిగా నష్ట‌ప‌రిహారం చెల్లించి త‌న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఉపాధి కోల్పోయిన వారికి ప్ర‌భుత్వం అండ‌గా నిల‌బ‌డాలి. మా నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఇచ్చిన హామీ మేర‌కు రిటైనింగ్ వాల్ నిర్మించి విజ‌య‌వాడ వాసుల ముంపు భ‌యం పోగొట్టేలా శాశ్వ‌త ప‌రిష్కారం చూపించారు. కృష్ణ‌లంక ప్రాంత ప్ర‌జ‌ల‌కు దేవుడ‌య్యారు. బుడ‌మేరు వ‌ర‌ద‌ల విష‌యంలో చంద్ర‌బాబు నిర్ల‌క్ష్యం వ‌హించినా వైయ‌స్ జ‌గ‌న్ క‌ట్టించిన రిటైనింగ్‌వాల్ కార‌ణంగానే వేలాది మంది ప్రాణాలు నిలిచాయి. రిటైనింగ్ వాల్ లేకపోయుంటే కృష్ణా న‌దికి వ‌చ్చిన 12 ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌ద‌ కృష్ణ‌లంక ప్రాంతాన్ని తుడిచిపెట్టేసి ఉండేదని ఇప్పటికీ అక్క‌డి వారు వ‌ర్షం కురిసిన‌ప్పుడ‌ల్లా గుర్తు చేసుకుని వైయ‌స్ జ‌గ‌న్ కి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకుంటారు. టీడీపీ స‌పోర్టుతో కేంద్రంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వం కొన‌సాగుతున్నా వ‌ర‌ద బాధితుల కోసం ఒక్క రూపాయి ప్ర‌భుత్వ సాయాన్ని తీసుకురావ‌డంలోనూ చంద్ర‌బాబు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు.

Back to Top