తాడేపల్లి: దీర్ఘకాలం సీఎంగా పని చేసినా కూడా రాయలసీమకు నీళ్ళివ్వాలనే ఆలోచనే ఏనాడు చంద్రబాబు చేయలేదని మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చివరికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహించిన కుప్పానికి కూడా సీఎంగా వైయస్ జగన్ కృష్ణా జలాలను అందించారని గుర్తు చేశారు. తాను సీఎంగా ఉండి పుంగనూరు నుంచి కుప్పానికి నీటిని అందించేందుకు బ్రాంచి కెనాల్ పనులను కూడా పూర్తి చేయలేని అసమర్థుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. వైయస్ జగన్ కుప్పానికి చేసిన మంచిని నేడు సిగ్గు లేకుండా తన ఖాతాలో వేసుకుంటూ, పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..: ‘క్రెడిట్ చోర్’ గా చంద్రబాబు ఇటీవల సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. కుప్పానికి నీళ్ళిచ్చాను అని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్న అబద్దాలను ఆధారాలతో సహా సోషల్ మీడియాలో నెటిజెన్లు బయటపెట్టి మరీ ప్రశ్నిస్తున్నారు. 1989 నుంచి కుప్పానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ, నిన్న కుప్పానికి నీళ్ళు ఇచ్చాను, ఇది నా గొప్పతనం అని చాటుకున్నారు. 2024 ఫిబ్రవరి 26వ తేదీన హంద్రీనీవా నుంచి కుప్పానికి కృష్ణా జలాలను సీఎంగా వైయస్ జగన్ విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో జలవనరుల శాఖమంత్రిగా నేను కూడా పాల్గొన్నాను. శ్రీశైలం నుంచి కుప్పంకు 720 కిలోమీటర్ల దూరం. ఆనాడు సీఎంగా వైయస్ రాజశేఖర్‌రెడ్డి గారి హయాంలోనే పుంగనూరు వరకు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ నుంచి నీటిని తీసుకువెళ్ళారు. ఆ తరువాత చంద్రబాబు పుంగనూరు నుంచి బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పానికి నీటిని తీసుకువెళతానంటూ కాలువ పనులకు రెట్టింపు అంచనా వ్యయాన్ని పెంచి, తనకు అనుకూలమైన వారికి కాంట్రాక్ట్‌లు ఇచ్చుకున్నారు. కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు దండుకున్నారే తప్ప, కుప్పానికి నీటిని మాత్రం తీసుకువెళ్ళలేకపోయారు. వైయస్ జగన్ సీఎం అయిన తరువాత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి నీటిని అందించేందుకు పుంగనూరు నుంచి కుప్పానికి బ్రాంచ్ కెనాల్ పనులను శరవేగంగా పనులు చేయించి, నీటిని కూడా విడుదల చేశారు, ఇదీ వాస్తవం. కానీ నేడు చంద్రబాబు తానే కుప్పానికి నీటిని తీసుకువచ్చినట్లుగా అబద్దాలు చెప్పడం, తన అనుకూల ఎల్లో మీడియాలో పెద్ద ఎత్తున దీనిపై ప్రచారం చేయించుకున్నాడు. నాడు–నేడు అదే దోపిడి: విభజిత ఆంధ్రప్రదేశ్‌లో నాటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కన్స్‌ట్రక్షన్ కంపెనీకే ఇచ్చింది. 2016, జనవరి 4న మొదలుపెట్టి, అదే ఏడాది అక్టోబర్ 3 నాటికి పూర్తి చేయాలనేది కాంట్రాక్ట్ ఒప్పందం. అయితే ఆ గడువుకు పనులు చేయకపోవడంపై చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం.. సీఎం రమేష్ సంస్థకు అనుకూలంగా 2016, అక్టోబర్ 4 నుంచి 2019, ఏప్రిల్ 30 వరకు ఐదుసార్లు గడువు పెంచింది. అయినా పనులు పూర్తి చేయలేదు. మరోవైపు దోపిడికి పథకం వేసిన రిత్విక్ సంస్థ, కాలువ తవ్వడం కాకుండా, డిజైన్ మార్చి ఎంబాక్‌మెంట్ (మట్టి కట్టలతో గట్టు) ద్వారా పనులు చేయడం వల్ల అధికంగా మట్టి పనులు చేశామని రూ.160కోట్లు అదనంగా చెల్లించమని కోరారు. ఆ మేరకు అధికారులు ప్రతిపాదనలు పంపగా, స్టేట్‌లెవల్ స్టాండింగ్ కమిటీ తిరస్కరించింది. అయినా టీడీపీ ప్రభుత్వం ఆ సంస్థకు అడ్డంగా రూ.144.7 కోట్లు దోచి పెట్టింది. అందుకోసం ప్రత్యేకంగా జీఓ నెం:32 తీసుకొచ్చింది. దీనితో కుప్పం బ్రాంచ్ కాలువ వ్యయం రూ.574.96 కోట్లకు చేరింది. 2024లో అధికారంలోకి రావడంతో, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల పేరుతో మళ్లీ దోపిడికి సీఎం చంద్రబాబు తెర తీశారు. కెనాల్ లైనింగ్ పేరుతో పనులను రూ.161.78 కోట్లకు అదే సీఎం రమేష్ రిత్విక్ సంస్థకు కట్టబెట్టారు. ఇక లైనింగ్ పనులను షార్ట్ క్రీటింగ్ పద్దతిలో కాకుండా స్టీల్ ఫైబర్ రీయిన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్‌తో అత్యంత నాసిరకంగా చేసి, యథేచ్ఛ దోపిడి చేశారు. దీన్ని బట్టి చూస్తే కుప్పానికి సీఎం చంద్రబాబు నీళ్లు ఇవ్వడం మాటేమో కానీ, ఆ ముసుగులో నిధులు దోచుకున్నారన్నది స్పష్టమవుతోంది. కమిషన్ల కోసం పోలవరంను సర్వనాశనం చేసిన చంద్రబాబు: కెనడా, అమెరికాకు చెందిన అంతర్జాతీయ నిపుణులతో కూడిన కమిటీ రెండురోజుల పాటు పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించేందుకు పర్యటిస్తోంది. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు, ప్రమాణాలను పరిశీలించేందుకు, సలహాలు ఇచ్చేందుకు అంతర్జాతీయ స్థాయి నిపుణులతో కూడిన ఒక కమిటీ కావాలని కేంద్రాన్ని కోరాం. దీనికి సీడబ్లు్యసీ నుంచి అనుమతి రావడం, దానిని ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచి కమిటీని ఖరారు చేశాం. ఈ కమిటీ వచ్చే సమయానికి ఎన్నికలు జరగడం వల్ల మేం అధికారం నుంచి దిగిపోయి, చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా క్లిష్టమైనది. అంత తొందరగా అర్థమయ్యేది కాదు. ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టతతో కూడిన ప్రాజెక్ట్ ఇది. అందువల్లే ప్రపంచస్థాయి నిపుణుల కమిటీ కావాలని ఆనాడు మేం సీడబ్లు్యసీని కోరి, దానికి అనుమతులను సాధించాం. దానిలో భాగంగానే ఈ కమిటీ నేడు ప్రాజెక్ట్ కు వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి సోమవారాన్ని పోలవరం అంటూ హంగామా చేశారు. పోలవరం నిర్మాణాన్ని సర్వనాశనం చేశారు. నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి శాస్త్రీయంగా పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని మా ప్రభుత్వంలో భావించాం. ఆ కమిటీ వచ్చి ఇప్పటికే ఒక నివేదికను కూడా సమర్పించింది. డయాఫ్రం వాల్ దెబ్బ తినడానికి చంద్రబాబు ప్రభుత్వమే కారణం: డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి వైయస్ జగన్ ప్రభుత్వమే కారణమని, కాఫర్ డ్యాంలను నిర్మించలేదని ఇష్టం వచ్చినట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. డయాఫ్రం వాల్ నిర్మాణానికి ముందే కాఫర్ డ్యాంల నిర్మాణంను పూర్తి చేయాల్సి ఉన్నా కూడా ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అందువల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నది అని అంతర్జాతీయ నిపుణులు చాలా స్పష్టంగా చెప్పినా వారికి బుద్ది రావడం లేదు. దీనిపై చర్చకు చంద్రబాబు, నిమ్మల రామానాయుడు సిద్దమా? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 72 శాతం పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయని మంత్రి రామానాయుడు అంటున్నారు. మిగిలిన 28 శాతంలో వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం కేవలం 2 శాతమే పూర్తి చేసిందని ఆయన చెబుతున్నారు. ఆయన లెక్కల ప్రకారం చూసినా మిగిలి 26 శాతం పనులను పూర్తి చేయడానికి ఏడాదిన్నర సమయం కూడా సరిపోలేదా? పోలవరం గురించి అసలు చంద్రబాబుకే అర్థం కావడం లేదు. కాఫర్ డ్యాంలు వేయకుండానే డయాఫ్రం వాల్ వేసేందుకు ప్రయత్నం చేశామని సీఎంగా చంద్రబాబు చెప్పారంటేనే ఆయనకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎటువంటి అవగాహన లేదని అర్థమవుతోంది. చంద్రబాబు, నిమ్మల రామానాయుడి కన్నా పోలవరం గురించి నాకే ఎక్కువ అవగాహన ఉంది. నిపుణుల సూచనలకు భిన్నంగా డయాఫ్రం వాల్ నిర్మాణం: 2018లో టీడీపీ ప్రభుత్వ హాయాంలో రెండు కాఫర్ డ్యాం పనులు ప్రారంభించారు. వాటి జీవితకాలం కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే. ఇది తాత్కాలిక నిర్మాణం మాత్రమే. ఈ గడువు లోగా డయాఫ్రం వాల్, యర్త్ కం రాక్ ఫిల్లింగ్ డ్యాంను నిర్మించిన తరువాత ఈ కాఫర్ డ్యాంలను తొలగించాల్సి ఉంటుంది. అలా చేస్తేనే జలవిద్యుత్‌ను ఉత్పాదన చేసేందుకు అవకాశం ఉంటుంది. 2018లో నిర్మించిన ఈ కాఫర్ డ్యాంలకు మూడేళ్ళ గ్యారెంటీ పీరియడ్ కూడా ముగిసిపోయింది. ఎగువ కాఫర్ డ్యాంపై భయం అక్కరలేదని నిపుణులు చెప్పినట్లుగా ఈనాడు పత్రిక కథనం ప్రచురించింది. సాక్షి పత్రికలో కాఫర్ డ్యాం సీపేజ్ పై అప్రమత్తంగా ఉండాలని కథనం వచ్చింది. మూడేళ్ల గ్యారెంటీ ఉన్న ఈ నిర్మాణం ఇప్పటికే కొంతమేర కుంగింది. దీనిలో లీకేజీలు కూడా ఉన్నాయి. నేటికి కూడా పోలవరం పనుల్లో చంద్రబాబు కక్కుర్తి పడుతున్నాడు. డయాఫ్రం వాల్ నిర్మాణం కూడా నేటికీ సక్రమంగా జరగడం లేదు. అంతర్జాతీయ నిపుణుల రికమండేషన్స్ ప్రకారం 1.5 మీటర్ల వెడల్పుతో ఈ డయాఫ్రం వాల్ నిర్మించాల్సి ఉండగా, కూటమి ప్రభుత్వం కేవలం 0.9 మీటర్ల మేరకే నిర్మిస్తున్నారు. దీనివల్ల సీపేజ్ వచ్చే ప్రమాదం ఉంది. ఎంత దౌర్భాగ్యమైన పద్దతుల్లో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ అవకతవకలపై చర్చకు సిద్దమా? కేంద్రప్రభుత్వం చేపట్టాల్సిన ప్రాజెక్ట్‌ను కమీషన్ల కక్కుర్తి కోసం కేంద్రం కాళ్ళమీద పడి, మేం చేస్తామంటూ తీసుకుని నేడు పోలవరం ప్రాజెక్ట్‌ను భ్రష్టు పట్టించిన ఘనత కూడా చంద్రబాబుదే. 2027 కి పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నా, ఇది ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ.. రఫ్పా... రఫ్పా.. అనే సినిమా డైలాగ్ ప్రదర్శించినందుకు ఒక యువకుడిని చంద్రబాబు అరెస్ట్ చేయించారు. ఇప్పుడు చంద్రబాబు అదే సినిమా డైలాగ్‌ను మాట్లాడుతున్నాడు. ఆయన ఇప్పటికే పోలీసులతో రఫ్ఫా...రఫ్పా ఆడిస్తున్నాడు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా రాబోయేది వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వమే. రుషికొండ రిసార్ట్స్‌కు కూటమి నేతలు క్యూ కడుతున్నారు. ఆ నిర్మాణంలో పై నుంచి పెచ్చులు ఊడిపోయాయంటూ యాగీ చేస్తున్నారు. ఇదేమైన నాసిరకంగా నిర్మించిన అమరావతి తాత్కాలిక సెక్రటేరియట్టా? రుషికొండ నిర్మాణాలు మంచిదీ అని అంగీకరించడానికి వారికి మనస్సు రావడం లేదు. పోనీ చెడ్డదీ అని చెప్పలేకపోతున్నారు. ఈ భవనాలను వినియోగించడానికి నిపుణుల కమిటీని వేశారు. గత ప్రభుత్వం అద్భుతమైన భవనాలను నిర్మించింది, వాటిని కనీసం వాడుకోలేని అసమర్థత కూటమి ప్రభుత్వానిది. కరకట్ట మీది అక్రమ నిర్మాణంలో నివాసం ఉన్న సీఎంకు రుషికొండ భవనాల గొప్పతనం ఎలా అర్థమవుతుంది? సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ రాజకీయంగా వాడుకున్నారు. తాను అధికారంలోకి వస్తే ఈ కేసును విచారించి, దోషులను కఠినంగా శిక్షిస్తానని గొప్పగా ప్రకటించారు. కర్నూలు పబ్లిక్ మీటింగ్‌లో ఊగిపోతూ ఇదే అంశంపై మాట్లాడారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కేంద్రంలోనూ భాగస్వామిగా ఉన్నారు, ఎందుకు సీబీఐ ఎంక్వయిరీ కోరడం లేదు? సుగాలి ప్రీతి తల్లి రోదనలు చూసి పవన్ కళ్యాణ్ సిగ్గు పడాలి.