తాడేపల్లి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో మొదలుపెట్టిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రయివేటీకరణ చేయడం ద్వారా.. వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఆరోగ్యశ్రీ అంటే దివంగత నేత వైయస్ఆర్ మాత్రమే గుర్తుకు వస్తారని, ఆ తర్వాత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చేపట్టిన నాడు-నేడు, నూతన వైద్య కాలేజీల నిర్మాణం రాష్ట్ర చరిత్రలో చిరస్ధాయిగా నిల్చిపోతుందని స్పష్టం చేసారు. ప్రజల్లో ఆ మంచి పేరును చెరిపివేయాలన్న కుట్రతో పాటు, ఇన్సూరెన్స్ పేరుతో తమ వారికి కట్టబెట్టడానికే... కూటమి ప్రభుత్వం ప్రయివేటీకరణకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో 11 మెడికల్ కాలేజీల నిర్మాణం.. ప్రయివేటీకరణ పేరుతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం నాశనం చేస్తోంది. రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ఆలోచన చేయాలి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే అందుబాటులో ఉంటే.. కేవలం 5 ఏళ్ల కాలంలోనే వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో రూ.8500 కోట్ల ఖర్చుతో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వందలాది మంది నిరుపేదల వైద్య విద్య కలను సాకారం చేయడంతో పాటు, ఎక్కడికక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందాలన్న సంకల్పంతో ఏకంగా 17 వైద్య కళాశాలలను ప్రభుత్వ రంగంలో నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగానే 5 మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభం కాగా.. మరో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకో 7 కాలేజీలను ఈ ఏడాది ప్రారంభమయ్యేలా కార్యాచరణ కూడా రూపొందించాం. ● పేదవాడికి ఉచిత వైద్యం దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం: ప్రభుత్వ రంగంలో నిర్మాణం పూర్తిచేసుకున్న, సిద్ధంగా ఉన్న మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రయివేటీకరణ పేరుతో చంపేస్తోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మా ప్రభుత్వ హయాంలో పేదరోగి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే... వైద్యంతో పాటు మందులు, అవసరమైన వైద్య పరీక్షలు పూర్తిగా ఉచితంగా అందేవి. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే అన్ని వసతలు కల్పిస్తే... ఇవాళ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వైద్య కళాశాలలను ప్రయివేటీకరణ చేస్తే... ఆ ఆస్పత్రులకు వచ్చే పేద రోగులు కన్సెల్టెన్సీతో పాటు మందులు, సీటీ, ఎమ్మారై స్కాన్ లాంటి వైద్య పరీక్షలకూ మందులు కట్టుకోవాల్సిన దుస్థితి. ఆపరేషన్ చేయాల్సి వస్తే అది ఆ పేదరోగుల మీద మరింత భారం పడి.. అప్పుల పాలయ్యే పరిస్థితి. ఈ పాపం కూటమి ప్రభుత్వానిదే. వైద్యం పేరుతో పేదవాడి నడ్డి విరిచి సొమ్ము చేసుకోవాలనుకునే దుస్థితికి ఈ ప్రభుత్వం తీసుకువస్తోంది. దేశచరిత్రలో ఏ ముఖ్యమంత్రీ, ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా తన ఐదేళ్ల పాలనలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం ద్వారా వైయస్ జగన్ మోహన్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇలా ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలల ద్వారా 50 శాతం సీట్లను ఉచితంగా అందించాలని, మరో 50 శాతం సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా... ప్రపంచశ్రేణి ప్రమాణాలతో ఆయా వైద్య కళాశాలల నిర్వహణ పక్కాగా చేయడానికోసం భర్తీ చేసే విధానాన్ని తీసుకొచ్చాం. అలాంటిది ఇప్పుడు మొత్తం కాలేజీలను ప్రయివేటీకరణ చేయడం వలన నామమాత్రంగా కొన్ని సీట్లను ఉచితంగా కేటాయించి, మిగిలిన వాటన్నింటినీ కోట్లాది రూపాయలకు అమ్ముకోవడానికే ప్రయివేటీకరణకు తెరతీశారు. దీని ద్వారా కూటమి ప్రభుత్వం వైద్య విద్యను అభ్యసించాలన్న అర్హులైన పేదల కోరికను నిలువునా పాతరేసింది. ప్రతీ ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి పెద్ద సంఖ్యలో భూమిని సేకరించడంతోపాటు రూ.500 కోట్ల బడ్జెట్ ను కాలేజీ నిర్మాణానికి కేటాయిస్తే... అలాంటి ఖరీదైన మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేయడం ద్వారా ఉచిత వైద్యాన్ని బిజినెస్ మాడ్యూల్ లో చూపిస్తూ వారికి వైద్యాన్ని దూరం చేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మరొక్కసారి పునరాలోచన చేయాలి. దీనిపై వైయస్ జగన్ మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలి. ప్రయివేటైజేషన్ పేరుతో పేదవాడి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మీరు చేస్తున్న వ్యాపారాన్ని భవిష్యత్తులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఆ నిర్ణయాన్ని రద్దు చేయడం ఖాయం. ● ప్రజల్లో మంచి పేరు చెరిపేయాలన్న దుర్భిద్ధితోనే.. కోట్లాది మంది ప్రాణాలు కాపాడిన ఆరోగ్యశ్రీ అనే గొప్ప పథకం దివంగత నేత డాక్టర్ వైయస్.రాజశేఖర రెడ్డి హయాంలో పురుడుపోసుకుని దేశానికే రోల్ మోడల్ గా నిలిచింది. అలాంటిది ఈ పథకాన్ని ప్రజలకు దూరం చేసే పనిలో ఉన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో 3257 చికిత్సా విధానాలు, రూ.25 లక్షల వరకు చికిత్స వ్యయంతో రాష్ట్రంలో ఉన్న 90 శాతానికి పైగా కుటుంబాలు ఆరోగ్యశ్రీ ని వినియోగించుకునే పరిస్థితి నుంచి... ఇవాళ అసలు ఆరోగ్యశ్రీ అమలవుతుందా ? లేదా ? అన్న పరిస్థితుల్లోకి ప్రజలను కూటమి ప్రభుత్వం నెట్టివేసింది. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద రూ.3600 కోట్లు ఏడాదికి ఖర్చు చేస్తూ .. ఆరోగ్యశ్రీ పథకాన్ని అద్భుతంగా అమలు చేశాం. అలాంటి దాన్ని రద్దు చేసి...ఇన్సూరెన్స్ మాడ్యూల్ ద్వారా ఏ విధంగా పేద రోగులకు న్యాయం చేస్తారు. మీరు చెబుతున్న లెక్కల ప్రకారం రూ.5వేల కోట్లు కంటే ఎక్కువ ఖర్చయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఆరోగ్యశ్రీ కంటే అదనంగా చూపిస్తున్న రూ.1500 కోట్లు ఎవరి జేబులోకి వెళతాయి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.4వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా.. కేవలం 600 కోట్లు మాత్రమే చెల్లించి వాటిని గాలికొదిలేశారు. దీంతో నెట్ వర్క్ ఆసుపత్రులు రోగుల వైద్యానికి నిరాకరిస్తుండటంతో పేద రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. వైద్య ఆరోగ్యరంగంలోనూ, ఆరోగ్యశ్రీలోనూ ఏ పని చేసినా...ఆ పేరు ప్రఖ్యాతలు దివంగత రాజశేఖర్ రెడ్డికి, మా నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే మంచి పేరు వస్తుంది.. దాన్ని ప్రజల నుంచి చెరిపేయాలన్న దురాలోచనతోనే మీరు ఈ పనులన్నీ చేస్తున్నారు. వైద్య ఆరోగ్య రంగంలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి, అందులో భాగంగా ప్రజలకు గ్రామస్ధాయిలో గొప్ప సేవలు అందించాలన్న తపనతో 10032 డాక్టర్ వైయస్ఆర్ విలేజీ క్లినిక్స్ నిర్మించారు. వీటితో పాటు అర్భన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, జిల్లా ఆసుపత్రులను నాడు-నేడు ద్వారా రూపురేఖలు మార్పు చేశారు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల పరిధిని కూడా పెంచారు. జీరో వేకెన్సీ పాలసీతో వైద్యఆరోగ్యశాఖలో వైద్యుల కొరత లేకుండా భర్తీ చేయడంతో పాటు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో ప్రతి ఇంటికి వైద్యులను పంపించి చికిత్స అందించాం. ● ప్రయివేటీకరణను కచ్చితంగా రద్దు చేస్తాం. అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న తపనతో నూతనంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మాణాలను చేపడితే వాటన్నింటినీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇవాళ నీరుగార్చుతోంది. ఇన్సూరెన్స్ మోడల్ అనేది నూటికి నూరుశాతం ఫెయిల్యూర్ మోడల్. వైద్య ఆరోగ్యరంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల ద్వారా ప్రజల్లో వైయస్ఆర్, వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారికున్న మంచి పేరును చెరిపేయాలన్న కుట్ర, తమ వారికి కట్టబెట్టాలన్న దురుద్దేశ్యంతోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కాలేజీల ప్రయివేటీకరణ, ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ విధానంలోకి మార్చాలన్న ప్రయత్నం చేస్తోంది. తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సొమ్ము చేసుకునే స్కామ్ కి పాల్పడుతున్నారని విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా ప్రయివేటీకరణ నిర్ణయాన్ని రద్దు చేసి, ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు కొనసాగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.