కర్నూలు: కర్నూలు జిల్లాలో ఉల్లి, టమాటా పంటలను కొనుగోలు చేసేవారు లేక, రైతులు పండించిన పంటను కన్నీటితో రోడ్ల పక్కన పారేసి వెళ్ళిపోతున్నా కూటమి ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదని వైయస్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ధ్వజమెత్తారు. పంటలకు ధర లేక, వ్యవసాయానికి యూరియా దొరక్క రైతులు అల్లాడుతుంటే, సిగ్గులేకుండా విజయోత్సవాలు చేసుకుంటున్నారని ఆక్షేపించారు. ఇంకా ఆయనేమన్నారంటే... కర్నూలు జిల్లాలో ఉల్లి, టమాటా రైతుల గోడు కూటమి ప్రభుత్వం చెవికి సోకడం లేదు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. ప్యాపిలి మండలంలో రైతులు పండించిన టమాటాను కేజీ కనీసం రూపాయి కూడా కొనేవారు లేక రోడ్డుపక్కన పారబోసి వెళ్లిపోయారు. కర్నూలులో ఉల్లి పంటకు రేటు లేక మార్కెట్ యార్డ్ నుంచి బళ్ళారి చౌరస్తా వరకు పంటతో కూడిన ట్రాక్టర్లు క్యూలో పెట్టుకుని వేచి ఉండాల్సిన పరిస్థితి. వర్షాల వల్ల ట్రాక్టర్లలో ఉల్లి తడిచిపోయి, కొనేవారు లేక రైతులు ఆవేదన చెందుతున్నారు. చివరికి ఉల్లి కొనేవారు లేకపోవడం, ట్రాక్టర్లలో తెచ్చిన ఉల్లి తడిచిపోవడంతో చేసేది లేక రైతులు మునగాలపాడు సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ వద్ద రోడ్డు పక్కన ఉల్లి పంటను బస్తాలతో సహా పడేసి వెళ్ళిపోయారు. తిరిగి ఆ పంటను ఇంటికి తీసుకువెళ్ళాలంటే దానికి కూడా రవాణా చార్జీలు చెల్లించాల్సి ఉండటంతో, విధిలేని పరిస్థితుల్లో ఉల్లిని రోడ్డు పక్కన పడేసి, కన్నీటితో వెళ్ళిపోయారు. రోడ్డు పక్కన పడేసిన ఉల్లిని స్థానికులు ఎలా తీసుకువెడుతున్నారో దానికి సంబంధించిన వీడియోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మీడియా సమావేశం ద్వారా ఆ వీడియోలను కూడా ప్రదర్శిస్తున్నాం. ఉల్లి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి క్వింటా రూ.1200 లకు ఉల్లి కొనుగోలు చేస్తున్నామని ఈ కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. అలాంటప్పుడు రైతులు దాదాపు 1000 బస్తాల ఉల్లిని రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారంటే, రైతులకు డబ్బులు ఎక్కువై ఇలా చేశారా? లేక ప్రభుత్వం చెప్పినట్లు కొనేవారు లేక, ఆవేదనతో ఇలా పంటను రోడ్డుపాలు చేసుకుని వెళ్ళారా? వ్యవసాయ శాఖ మంత్రి దీనికి సమాధానం చెప్పాలి. సినిమా షూటింగ్ మాదిరిగా కర్నూలు మార్కెట్ లో ఉల్లి కొనుగోలు చేస్తున్నట్లు చూపిస్తున్నారు. కొందరు వ్యాపారులతో కొనుగోళ్ళు ప్రారంభించి, తరువాత వాటిని పట్టించుకోకపోవడం వల్లే ఉల్లి రైతులు పంటను రోడ్డుపాలు చేసుకోవాల్సిన దుస్థితిని తీసుకువచ్చారు. ఉల్లి పంటను రూ.1200 క్వింటా చొప్పున కొనుగోలు చేయాలని ప్రైవేటు వ్యాపారులకు చెబుతున్నారు. ఆ వ్యాపారులు మంచి నాణ్యత ఉన్న వాటిని మాత్రమే అరకొరగా కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన పంట తడిచిపోయిందని, నాణ్యత తక్కువగా ఉందని కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తున్నారు. సకాలంలో ఉల్లిని కొనుగోలు చేసి ఉంటే, వర్షంలో తడిచే వరకు రైతులు ట్రాక్టర్‌లలో పెట్టుకుని రోడ్ల పక్కన ఉండేవారా? ఇప్పుడు ఆ ఉల్లిపంట తడిచిపోతే దానికి ఆ బాధ్యత ఈ ప్రభుత్వ అసమర్థత, అధికారుల నిర్లక్ష్యం కాదా? తక్షణమే ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేయాలి. రైతు బజార్లలో కిలో రూ.20 రూపాయలు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా ప్రజలకు అంతకంటే తక్కువ రేటుకే అమ్ముకోవచ్చు. రైతుల ఆత్మహత్యలను బోగస్ అంటారా? వెల్ధుర్తి మండలి హుసునాపల్లిలో రామచంద్రుడు అనే రైతు పండించిన పంటను అమ్ముకోలేక రైతు ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నం చేస్తే వారు బోసగ్ అంటూ కూటమి ప్రభుత్వం వారిపై కేసులు పెట్టింది. రెండు రోజుల పాటు ఆత్మహత్యాయత్నం చేసిన రైతులు ఆసుపత్రిలో చికిత్స పొందారు. వారు చేసింది బోగస్ అయితే వారికి ఇచ్చిన చికిత్స కూడా బోగస్సేనా? ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చి ఉంటే, ఇటువంటు పరిస్థితి ఉండేదేనా? ఉల్లి రైతులకు అండగా నిలిచేందుకు మేం కర్నూలు మార్కెట్ యార్డ్‌ను సందర్శించి, వైయస్ జగన్ గారిని ఇక్కడకు తీసుకువస్తామని ప్రకటించాం. జగన్ గారు ఇక్కడకు వస్తున్నారనే సమాచారం తెలుసుకుని, భయంతో కూటమి ప్రభుత్వం రాత్రికి రాత్రి రూ.1200 ధరను ప్రకటించారు. అయితే ఈ రేటు ప్రకారం ఎంత ఉల్లిని కొనుగోలు చేశారో చెప్పగలరా? టమాటా రైతుల దీనస్థితి పత్తికొండ, ప్యాపిలి, ఆదోనీ ప్రాంతాల్లో టామాటా రైతులు తమ పంటను రోడ్డుపాలు చేస్తున్నారు. కనీసం కేజీ రూపాయికి కూడా కొనుగోలు చేయడం లేదు. కనీసం పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే అప్పులు తెచ్చి, పంట సాగుచేసిన రైతులు ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. ఈ ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు రేటు కల్పించడంలో విఫలమైంది. పెట్టుబడి సాయం అందించడంలోనూ, ఎరువులను సమకూర్చడంలోనూ పూర్తిగా విఫలమైంది. నిత్యం పబ్లిసిటీ, ఆర్భాటంతోనే కాలం గడుపుతున్నారు. ఉపముఖ్యమంత్రి సినిమా షూటింగుల్లో బిజీ. సీఎం చంద్రబాబు ప్రతినెలా పెన్షన్ల పంపిణీ డ్రామాలకు హెలికాఫ్టర్ వేసుకుని తిరుగుతున్నారు. ఇక డిఫ్యాక్టో సీఎంగా ఉన్న లోకేష్ ఢిల్లీ తిరగడమే సరిపోయింది. కమీషన్లు దండుకోవడంలో వ్యవసాయశాఖ మంత్రి తలమునకలు అయి ఉన్నారు. ఇక రైతుల గురించి పట్టించుకునే నాధుడు లేదు. సిగ్గులేకుండా సూపర్ సిక్స్ - సూపర్ హిట్ అంటూ విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారు. గతంలో కరోనా సంక్షోభ సమయంలో చీనీ, అరటి పంటలకు రేటు లేని సందర్బంలో సీఎంగా వైయస్ జగన్ గారు నిర్ణయం తీసుకుని, ప్రభుత్వపరంగా పంటను కొనుగోలు చేయించారు. ఇతర రాష్ట్రాల్లో ఆ పంటను అమ్మించారు. అదీ విజన్ ఉన్న నాయకుడు చేసే పని. కానీ నేడు సీఎంగా ఉన్న చంద్రబాబు పూర్తిగా రైతు వ్యతిరేకి. అందుకే రైతుల గురించి కనీసం ఆలోచన కూడా చేయడం లేదు. ఇకనైనా ఆయన కళ్ళు తెరవకపోతే, వైయస్ఆర్‌సీపీ తరుఫున రైతులకు అండగా ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం.