ఫ్యాక్షనిస్ట్‌ పరిటాల రవీంద్ర విగ్రహావిష్కరణకు లోకేష్‌ రావడం దుర్మార్గం

వందలాది మంది చావులకు పరిటాల రవి కారణం

: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి

 అనంతపురం: మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ఓ ఫ్యాక్షనిస్ట్‌ అని, ఆయన రాజకీయ జీవితంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్‌ రాప్తాడుకు రావడం దుర్మార్గమని అన్నారు. గతంలో ఫ్యాక్షన్‌ రాజకీయాలతో తీవ్రంగా ప్రభావితమైన అనంతపురం జిల్లాలో ప్రజలు ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటున్న సమయంలో, ఫ్యాక్షన్‌ నేపథ్యం ఉన్న వ్యక్తి విగ్రహావిష్కరణకు ప్రభుత్వం పెద్దపీట వేయడం సమంజసం కాదని పేర్కొన్నారు.

రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల వర్గీయుల కార్యకలాపాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నారా లోకేష్‌ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. విగ్రహావిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వడం కంటే అనంతపురం జిల్లా కరవు, రైతుల నీటి సమస్యలు, అభివృద్ధి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపకుండా ఫ్యాక్షన్‌ రాజకీయాల నేపథ్యాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు.
 

Back to Top