ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్  

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు  బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు 

 విజయవాడ: వైయ‌స్ఆర్‌సీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్‌ లభించింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు అనుమతిస్తూ ఏసీబీ కోర్టు శనివారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తిరిగి 11వ తేదీన సరెండర్‌ కావాలని ఆయన్ని కోర్టు ఆదేశించింది. 

అక్రమ మద్యం కుంభకోణం కేసులో సిట్‌ ఎంపీ మిథున్‌రెడ్డి పేరును ఏ4గా చేర్చింది. సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్‌ తిరస్కరణకు గురికాగా.. కోర్టు ఆదేశాల మేరకు జూలై 19వ తేదీన సిట్‌ ఎదుట విచారణకు మిథున్‌రెడ్డి హాజరయ్యారు. అయితే సుదీర్ఘంగా ఆయన్ని విచారించిన అనంతరం అదేరోజు రాత్రి సిట్‌ అరెస్ట్‌ చేసింది. 

ఈ క్రమంలో.. కోర్టుల్లో ఉపశమనం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు.  ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. తాను ఓటేయాల్సిన అవసరం ఉందని అందులో పేరొన్నారు. అయితే.. మిథున్‌రెడ్డి పిటిషన్‌కు అర్హత లేదని సిట్‌ వాదించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలను సాకుగా చూపుతూ బెయిల్ కోరడం సహేతుకం కాదు అని అభిప్రాయపడింది. చివరకు కోర్టు మిథున్‌రెడ్డి తరఫు లాయర్ల వాదనకే మొగ్గు చూపిస్తూ మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. సెప్టెంబర్‌ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.

Back to Top